అమరావతి: క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ పరీక్షలు జరగాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్ టెలీమెడిసిన్‌లో 300 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ టెలీ మెడిసిన్ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు, మందులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ పరీక్షలు జరగాలన్నారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లో ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ, పరీక్షల వివరాలను అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 809 పరీక్షలతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5,757 పరీక్షలు చేసినట్టు వివరించారు. ఏపీకి రాజస్థాన్ తరహా చైనా కిట్లను విక్రయించేందుకు సంబంధిత వ్యక్తులు ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. కొరియా నుంచి నాణ్యమైన ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించామని పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లాల్సిన కిట్లను చార్టర్ విమానం ద్వారా తెప్పించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికి 5 నుంచి 6 వేల శాంపిళ్లను పరిశీలించామని అన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కరోనా రోగులకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలపై నిరంతర అధ్యయనం, పరిశీలన చేస్తున్నామన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.