క‌ష్టాలు తెలుసుకుంటూ..భ‌రోసాగా నిలుస్తూ..

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

వ‌ర‌ద బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌..ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌

అన్ని ర‌కాలుగా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి హామీ

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడ్డ లంక గ్రామాల్లో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌టించారు. ఒకవైపు వర్షం కురుస్తోన్నప్పటికీ సీఎం వైయ‌స్ జగన్‌ వరద బాధితులకు వద్ద వెళ్లి పరామర్శించారు. వారికి తానున్నాంటూ భరోసా ఇచ్చారు. అలుపెర‌గ‌కుండా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లంక గ్రామాల్లో మొద‌టి రోజు ప‌ర్య‌టించారు.

  కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం వైయ‌స్ జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తామన్నారు. పశువులకు ఎటువంటి కష్టం రాకుండా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయిస్తానని సీఎం వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు. గంటి పెదపూడిలో తమకు మరో విలేజ్‌ క్లినిక్‌ కావాలని గ్రామస్తులు కోరగా సీఎం వైయ‌స్ జగన్ ఆమోదం తెలిపారు.

బాగా చూసుకుంటున్నారా?
సహాయక శిబిరాల్లో బాగా చూసుకున్నారా? కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయవచ్చని వరద బాధితులను స్వయంగా సీఎం జగన్ అడిగారు. పర్యటనలో భాగంగా నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శిస్తూ సీఎం వారి 8 నెలల బాబును ఎత్తుకున్నారు. ఆ సమయంలో బాబు జగన్ జేబులోంచి పెన్ తీసుకోగా.. తన పెన్‌ను సీఎం గిఫ్టుగా ఇచ్చారు. అటు గోదావరి వరదల సమయంలో బాధితులందరికీ అండగా నిలిచామని సీఎం వైయ‌స్ జగన్ చెప్పారు. 

 వారం రోజుల టైం ఇచ్చి..
వరదల సమయంలో తాను ఇక్కడికి వచ్చి ఉంటే అధికారులు తన చుట్టూ తిరిగేవారని.. అప్పుడు ప్రజలకు మంచి జరిగేది కాదని, అందుకే అధికారులకు వారం రోజుల టైం ఇచ్చి ఆ తర్వాత వచ్చానన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలన్న వైయ‌స్ జగన్.. సీఎం అంటే ఇలా చేయాలన్నారు. ప్రభుత్వ సాయం అందిందని బాధితులే చెబుతుంటే తనకు సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి అనే వ్య‌క్తి వ్యవస్థలను నడిపించాలి
తనది ప్రచార ఆర్భాటం కాదని.. తాను కూడా వరదల సమయంలో ఇక్కడికి వచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే టీవీల్లో కనిపించే వాడిని అని వైయ‌స్‌ జగన్ అన్నారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యమంత్రి అనే వ్య‌క్తి వ్యవస్థలను నడిపించాలన్నారు. ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు. సరైన సమయంలో సరైన సహాయం అందేలా చూడాలన్నారు. ఆ తర్వాత అది అందిందా.. లేదా.. అన్నది కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా అధికారులు తమ విధులు సమర్థంగా నిర్వర్తించేలా నిర్దేశించాలన్నారు. వారికి తగిన వనరులు కూడా సమకూర్చాలని తెలిపారు. అందుకే సహాయ పనులు, కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా అధికారులకు వారం రోజుల సమయం ఇచ్చానని.. ఇప్పుడు తాను వచ్చానని.. బాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా అందాయన్నది స్వయంగా తెలుసుకోవడానికి వచ్చానని జగన్ పేర్కొన్నారు. వరద నష్టంపై అంచనాలు కొనసాగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అవి అందగానే అందరినీ ఆదుకుంటామన్నారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


నేనున్నాన‌ని..ఆదుకుంటాన‌ని హామీ
 కోనసీమ జిల్లాలో గోదావరి వరద బాధితులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేనున్నాన‌ని..అండ‌గా ఉండి ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు. వ‌ర‌ద బాధితుల ఇంటింటికి వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్‌.. బాధితులను పరామర్శించారు. పి. గన్నవరం మండలం పుచ్చకాయలవారిపేటలో మొదలైన వైయ‌స్ జగన్ పరామర్శ యాత్ర గండిపెదపూడిలంక, బూరుగులంక, అరిగెలలంకల గుండా సాగింది. రోడ్లన్నీ బురదగా ఉండటంతో ట్రాక్టర్ లో సీఎం పర్యటన సాగింది.  పరామర్శను మొక్కుబడిగా కాకుండా… ఇంటింటికి వెళ్లి బాధితులను పలకరించి, పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు వైయ‌స్‌ జగన్. బాధితుల పిల్లల్ని ఎత్తుకున్నవైయ‌స్ జగన్ వారిలో ఒకరిగా కలిసిపోయారు.

 వంతెన నిర్మిస్తాన‌ని హామీ..
వశిష్ట కాల్వపై గండిపెదపూడిలంక దగ్గర వంతెన నిర్మించడం ద్వారా పై నాలుగు గ్రామాల ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు వైయ‌స్‌ జగన్. అలాగే పెదపూడిలంకలో గ్రామ సచివాలయ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోడానికి ప్రభుత్వం ఏం చేసిందో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.  సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని… పశువులకు నోళ్లు ఉంటే… అవి కూడా ప్రభుత్వ సాయం గురించి సంతోషంగా చెప్పేవని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. గంటిపెదపూడిలో వరద బాధితులను పరామర్శించారు.  ఏ సీజ‌న్‌లో పంట న‌ష్టం జ‌రిగితే అదే ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్  స్పష్టం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో వ‌ర‌ద బాధితుల క‌ష్టాలు తెలుసుకొని..భ‌రోసాగా నిలిచారు.  ఈ ప్ర‌భుత్వం మీది..ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికే ఈ ప్ర‌భుత్వం ఉంద‌ని బాధితుల్లో ధైర్యం నింపారు.

 

తాజా వీడియోలు

Back to Top