అమరావతి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు (జేసీఎస్) రాష్ట్ర కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ఆహ్వానితులు అందరూ విధిగా హాజరుకావాలని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా పార్టీ నిర్దేశిత ఫార్మాట్‌లో ‘గృహ సారథులు’గా నియమితులైన వారి తుది జాబితాను హార్డ్ కాపీ (పెన్ డ్రైవ్‌లో) లేదా సాఫ్ట్ కాపీని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.