జ‌బ్బు న‌యం అయ్యే వ‌ర‌కు తోడుంటాం

‘ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్‌

అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు

45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం

 తాడేప‌ల్లి:  జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటామ‌ని సీఎం స్పష్టం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.  

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

దేవునిదయతో మరో మంచి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంపై కలెక్టరేట్లు, డివిజన్‌ కార్యాలయాల్లో, సచివాలయాల్లో ఇప్పటికే ఓరియంటేషన్‌ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ స్థాయివరకూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు నాలుగు మాటలు చెపుతాను. 
గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం లేదు. గొప్పగా చేయగలుగుతామనే విశ్వాసంతో దీన్ని ప్రారంభిస్తున్నాం.

 ఆరోగ్య సురక్ష- ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం 
ప్రివెంటివ్‌ కేర్‌లో ఇదొక నూతన అధ్యాయం. ఈ స్ధాయిలో రాష్ట్రంలో, దేశంలో కూడా ఎవ్వరూ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం.  దీనికి కారణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వానికున్న సిబ్బందే. ఇవాళ ప్రతి గ్రామంలోనూ 10,032 సచివాలయాల పరిధిలో మనం విలేజ్‌ క్లినిక్స్‌ను తీసుకువచ్చి.. నిర్వహణలో ఉంచగలిగాం. అదే విధంగా 542 అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు కూడా వివిధ మున్సిపాల్టీలలో అందుబాటులోకి తీసుకునిరాగలిగాం. ఇందులో ఉండాల్సిన సిబ్బందిని నియమించాం.

 ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌. 
అంతే కాకుండా ప్రివెంటివ్‌ కేర్‌లో గొప్ప అధ్యాయంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ను తీసుకొచ్చాం. ప్రతిమండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ప్రతి పీహెచ్‌సీలో ఒక 104 వాహనం, ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం.  మొత్తంగా మండలంలో 4 డాక్టర్లుకూ  ఆ మండలంలోని గ్రామాలను సమానంగా పంచాం.
ఆ డాక్టర్లు నిర్దేశిత నాలుగైదు గ్రామాల్లో సేవలు అందిస్తారు. ప్రతి డాక్టరు ఒక రోజు పీహెచ్‌సీలో ఉంటే, రెండో డాక్టరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి విలేజ్‌ క్లినిక్స్‌తో అనుసంధానమై సేవలందిస్తారు. ప్రతి డాక్టర్‌ తనకు సంబంధించిన గ్రామానికి నెలకు కనీసం రెండు సార్లు  వెళ్లేలా ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఒకే డాక్టర్, ఒకే గ్రామానికి నెలకు రెండు సార్లు వెళ్తున్నారు. ఆరు నెలలు అదే కార్యక్రమం చేస్తే.. ఆగ్రామంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంమీద ఒక అవగాహన డాక్టరుకు ఉంటుంది. ఆ తర్వాత ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు వారికి కావాల్సిన మందులు తీసుకెళ్లి వారికి అండగా నిలిచే అవకాశం కలుగుతుంది. ఇదిఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌. ఇది కూడా మనం తేగలిగాం.  

 వైద్యం కోసం అప్పులు పాలు కాకూడదని-ఆరోగ్యశ్రీ 
వీటన్నింటితో పాటు ఆరోగ్య శ్రీని కూడా ప్రతి పేదవాడూ వినియోగించుకునేలా తీర్చిదిద్దాం. వైద్యం కోసం పేదవాళ్లు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. దీన్ని మనసులో పెట్టుకుని మనం రాకమునుపు 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితమైన పరిస్థితుల నుంచి 3256 చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చి సేవలను అందిస్తున్నాం.  నెట్‌వర్క్‌ ఆస్పత్రులను విస్తరించాం. మనం రాకమునుపు 915 నెట్‌వర్క్‌ ఆసుపత్రులుంటే ఈరోజు 2200 పైచిలుకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకునిరాగలిగాం. 
వీటన్నింటి వల్లా పేదవాడికి వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా అందుబాటులోకి తీసుకునిరాగలిగాం. 

 ఆరోగ్య సురక్ష విలేజ్ మ్యాపింగ్ 
ఈ రోజు మనం చేసే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నాం. ప్రతి గ్రామంలోనూ,  ప్రతి ఇంటినీ, జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆ తర్వాత గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేత వారికి చికిత్స అందిస్తున్నాం. ఆ తర్వాత వారికి తదుపరి పరీక్షలు అవసరమైతే అవి కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. ఆ పేషెంట్‌కు నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం. ఇవన్నీ ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో భాగం కాబోతున్నాయి. 

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ గురించి, వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. చాలా చోట్ల ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఎక్కడుందో తెలియలేదు ? ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళితే నాకు ఫ్రీగా ట్రీట్‌మెంట్‌ అందుతుంది. ఆ ఆసుపత్రి ఎక్కుడుందో తెలియదు కాబట్టి నేను వెళ్లలేకపోతున్నాను అనే అనుమానాలన్నీ ఎవరెవరికి ఉన్నాయో వాటిని తీసేస్తూ.. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందాలి అనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తాం. ఆ ట్రీట్‌మెంట్‌లో ఏమైనా లోపాలు కనిపిస్తే... వాటిని ఎలా ఫిర్యాదు చేయాలన్న విషయాలపై అవగతం, అవగాహన కలిగించే కార్యక్రమం కూడా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జరగబోతుంది. 

ఆరోగ్యశ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్‌  చేస్తాం.  వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం. వారికి ఎప్పుడు మందులు కావాలో... అదే  సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తాం. 
ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం. కేన్సర్‌ , డయాలసిస్‌ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం. అవి కూడా ఆరోగ్యసురక్షా క్యాంపు తర్వాత మ్యాపింగ్‌ జరుగుతుంది. 
ఇవన్నీ జరిపించడం కోసం ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోంది.  ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదని చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం. 

 ఆరోగ్య సురక్ష- ఐదు దశలు. 
మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్‌ 15 నుంచిజరుగుతోంది. సెప్టెంబరు 30న తొలి క్యాంపు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఐదు దశలలో జరుగుతుంది. తొలిదశలో ప్రతి ఇంటికీ ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్, ప్రజా ప్రతినిధులు, గృహసారధులు, జగన్‌ మీద అభిమానం, ప్రేమ ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కలిగించవచ్చు. ఏయే టెస్టులు చేస్తారో చెబుతారు. ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు మీ ఇంటికి వచ్చి ఏడు రకాలు టెస్టులు మీకు అందుబాటులోకి ఉంచుతారు. మ్యాపింగ్‌ చేస్తారు. 

ఆ తర్వాత ఫేజ్‌ 2 ప్రారంభమవుతుంది. రెండో భాగంలో గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక భాగానికి సీహెచ్‌ఓ, మరొక భాగానికి ఏఎన్‌ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వాలంటీర్లుతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్లి జల్లెడ పడతారు. అందులో భాగంగా ప్రతి ఇంటిలోనూ ఏడు రకాల టెస్టులు చేసే ఎక్విప్‌మెంట్‌ను కూడా తీసుకుని పోతారు. ప్రతి ఇంట్లోనూ  బీపీ , షుగర్, హిమోగ్లోబిన్‌ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగ్యూ , కఫం పరీక్షలు చేస్తారు. ఈరకంగా ఏడు రకాల ఎక్విప్‌మెంట్‌ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారు. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ యాప్‌ ద్వారా మ్యాపింగ్‌ చేస్తారు.
టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందిస్తారు.  

 ఆరోగ్య శ్రీ పై ఆవగాహన... 
దీంతో పాటు ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య శ్రీ ఆసుపత్రి చికిత్స ఎక్కడ అందుతుంది? ఎలా వెళ్లాలి? ఏదైనా ఇబ్బంది ఉంటే.. ఎవర్ని సంప్రదించాలి? అన్న వివరాలతో కూడా బ్రోచర్‌ను అందిస్తారు.  ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్‌ను కూడా డౌన్లోడ్‌ చేయిస్తారు. వీటన్నింటి మీద రెండోదశలో మీకు అవగాహన కల్పిస్తారు. గ్రామాల్లో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల రక్తహీనత పై ప్రత్యేక ధ్యాస పెడతారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా వారిని మ్యాపింగ్‌ చేసి పుడ్‌ సప్లిమెంటేషన్‌ కూడా జరుగుతుంది.

తర్వాత మూడో దశ కూడా ప్రారంభమవుతుంది. హెల్త్‌ క్యాంపునకు మూడు రోజుల ముందు వాలంటీర్లు, గృహసారధులు ఇలాంటి ఔత్సాహికులు, మన ప్రభుత్వం మీద, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవాళ్లంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కలిగిస్తారు. గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై వివరాలు అందిస్తారు. అందరూ హెల్త్‌ క్యాంపులో పాల్గొనాలని చెబుతారు. ఫేజ్‌ 2లో ఇచ్చిన టోకెన్‌ నెంబర్లు ఉన్నవాళ్లు రావాలని వివరిస్తారు. టోకెన్‌ లేకపోయినా... వైద్యం అవసరమైతే వారు కూడా హెల్త్‌ క్యాంపులకు రావచ్చని వివరిస్తారు. 

హెల్త్‌ క్యాంపు నిర్వహించే రోజు పేజ్‌ 4 న వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌ఓలు, ఔత్సాహికులు మమేకమవుతారు. అందరూ భాగస్వాములవుతారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అన్నిరకాలుగా జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు వారికి అవసరమైనపరీక్షలు అన్ని చేయించడం, డాక్టర్లతో వారికి చికిత్స, మందులు ఇప్పించడంతో పాటు  అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, వారికి కళ్లజోళ్ల ఇచ్చే కార్యక్రమం కూడా జగనన్న సురక్షలో భాగస్వామ్యం చేస్తున్నాం.

ఇదంతా అయిన తర్వాత ఎవరైతే ఆరోగ్య శ్రీ కింద గతంలో సేవలు పొందారో వాళ్లందరినీ మ్యాపింగ్‌ చేస్తారు. ఇంకా ఆరోగ్యశ్రీ సేవలు పొందాల్సిన వారిని కూడా మ్యాపింగ్‌ చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో ఉన్న డాక్టరు ,విలేజ్‌ క్లినిక్‌ వీరిని మ్యాపింగ్‌ చేసి... బాధ్యత తీసుకుని దగ్గరుండి వీరిని వాలంటీర్ల సహాయంతో వాళ్లకు తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. చికిత్స తీసుకున్నవారికి తదనంతర సేవలు సరిగ్గా అందుతున్నాయా? లేవా? ఆరోగ్య శ్రీ సేవలు అందాల్సిన వారికి ఎలా అందించాలి? ఈరెండు అంశాలపై కూడా సురక్షలో ప్రత్యేక దృష్టి  పెడతారు. ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటారు.  ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందుతాయి. ఈ కార్యక్రమాలు అన్నీ హెల్త్‌ క్యాంపులో చేస్తారు.

ఐదో దశ చాలా ముఖ్యమైనది. చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం. ఆరోగ్యశ్రీ పొందిన వాళ్లను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం ఈ దశలో జరుగుతుంది. ఇందులో సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తారు.  సిబ్బంది ఓనర్‌ షిప్‌ తీసుకోవాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు, సీహెచ్‌ఓలు, ఇతర సిబ్బంది ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. ప్రతి అడుగులోనూ  చికిత్సలు వారికి అందడమే కాదు, ఆ తర్వాత కూడా వారికి సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత వీరందరిపైనా ఉంది. ఇది ఐదో ఫేజ్‌ లో జరుగుతుంది. ఈ ఐదు దశలను  క్రోడీకరించి... జగనన్న సురక్ష  కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇప్పటికే దీనిపై అవగాహన కల్గించే కార్యక్రమం జరిగింది. ఇవాళ గ్రామస్ధాయి నుంచి నెట్‌ వర్క్‌ అంతా కనెక్ట్‌ అయి ఉంది, అందరూ భాగస్వామ్యులై ఉన్నారు. వీరందరికీ ఈ కార్యక్రమం ప్రాముఖ్యత అర్ధం కావాలనే ఉద్దేశ్యంతో మరోసారి అందరికీ విపులంగా వివరించాను. మీ అందరూ సహాయ సహకారాలు అందించి.. ఓనర్‌షిప్‌ తీసుకుని, పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలిగితే వారికి మంచి జరుగుతుంది. 
అందరూ ఈ కార్యక్రమంలో ఓనర్‌షిప్‌ తీసుకుని, భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం బాగా జరగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. 

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా), అసోసియేషన్‌ ఆఫ్‌ నెట్‌ వర్క్‌ హాస్పిటల్స్‌ ఆఫ్‌ ఏపీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వాళ్లు కూడా పాల్గొంటున్నారు. వాళ్లంతా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ.. సహకారం అందిస్తున్నందుకు వారందరికీ నా తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

Back to Top