కుక్క తోక వంకరలా చంద్రబాబు తీరు

ఇప్పటికైనా మారి మానవత్వం, మంచితనం పెంచుకోండి

మోసం చేశారు కాబట్టే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు

కాపుల సంక్షేమానికి చంద్రబాబు చేసింది సున్నా..

బాబును చూస్తే సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ కనిపిస్తుంది

ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

 

అమరావతి: కాపులను మోసం చేసి ఏమాత్రం సిగ్గులేకుండా టీడీపీ సభ్యులు సభలో మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సభలో బడ్జెట్‌పై చర్చ జరుగుతుందా.. లేకపోతే రాజకీయ అంశాలపై చర్చ జరుగుతుందా అర్థంకావడం లేదని, టీడీపీ సభ్యులు ప్రతి విషయాన్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కాపులను మోసం చేసింది కాబట్టే ఈస్ట్‌గోదావరి, వెస్ట్‌గోదావరిలో టీడీపీకి వచ్చిన సంఖ్య ఎంతో చంద్రబాబు లెక్కేసుకుంటే బాగుంటుందన్నారు. అధ్వాన్నంగా ప్రజలను మోసం చేశారు కాబట్టి చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. ఒక సినిమాకు పోతే సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ కనిపిస్తుంది. కరెక్ట్‌గా అక్కడి నుంచి షిఫ్ట్‌ చేసి అసెంబ్లీకి మూవ్‌ అయిపోతే చంద్రబాబు అదే క్యారెక్టర్‌లో కనిపిస్తారన్నారు. అచ్చెంనాయుడు అనే వ్యక్తి మనిషి పెరిగాడు కానీ బు్రర అరికాలులో కూడా లేదన్నారు. 

కాపులను అడ్డగోలుగా మోసం చేశాడు కాబట్టే చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నాడని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 2014 మేనిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ మొదలైన కులాల వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఐదు సంవత్సరాల్లో రూ. 5 వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తానని వాగ్దానం చేశాడు. 2014–15లో ఖర్చు చేసింది పెద్ద సున్నా.. బడ్జెట్‌లో కేటాయింపులో మాత్రం రూ. 50 కోట్లు, 2015–16లో బడ్జెట్‌లో కేటాయింపులో రూ. 1000 కోట్లు, ఖర్చు చేసింది రూ. 96 కోట్లు, 2016–17లో బడ్జెట్‌లో కేటాయింపు రూ. 1000 కోట్లు, ఖర్చు చేసింది రూ. 490 కోట్లు, 2017–18లో కేటాయింపు రూ. వెయ్యి కోట్లు, ఖర్చు చేసింది రూ. 891 కోట్లు, 2018–19లో కేటాయింపులు రూ. వెయ్యి కోట్లు, ఖర్చు చేసింది రూ. 525 కోట్లు కాపులకు కేటాయించిన మొత్తం ఖర్చు చేసేందుకు కూడా చంద్రబాబుకు మనసు రాలేదు. ఈ స్థాయిలో కాపులను మోసం చేశారు కాబట్టే చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. 

కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాను.. మీరు అమలు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్న అడుగుతున్నాడని, ఆ ప్రశ్న వేసేందుకు కనీసం ఆయన మనసాక్షికి కూడా తప్పు చేశాననే అనిపించక పోవడం బాధాకరమన్నారు. ఈబీసీ కోటాలో ఫార్వర్డ్‌ కాస్టులకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్‌ ఇస్తే.. కాపులను బీసీల్లో చేర్చకుండా పక్కకు నెట్టేసి వారిని ఈబీసీలోకి కలిపి 5 శాతం రిజర్వేషన్‌ కల్పించేలా జీఓ విడుదల చేశాడని, అంటే కాపులు బీసీలా.. కాపులు ఓసీలా అని కనీసం చెప్పలేని అధ్వాన్న పరిస్థిలో చంద్రబాబు ఉన్నాడన్నారు. చివరకు చంద్రబాబు చేసిన పనికి కోర్టులో కేసు నడుస్తుందన్నారు. కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా రాజకీయంగా లబ్ధి కోసం చంద్రబాబు కాపులను వాడుకున్నాడు. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. 

మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు.. ఏదైనా ఉంటే సూటిగా చెప్పే గుణం నాది అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. తనకు, చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు. రాజకీయాలు అనేది మనసాక్షిని చంపుకొని చేయను.. ఏదైనా చెబితే నిజాయితీగా చేస్తానన్నారు. కాపులకు సంబంధించి మేనిఫెస్టోలో క్లీయర్‌గా చెప్పామని, దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కాపు సోదరులు. వీరంతా రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మన ప్రయత్నం చేస్తామని చెప్పగలం కానీ, అంతకు మించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే అది ప్రజలను మభ్యపెట్టే చర్యే అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్‌ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. మొదటి నుంచి మేము చెబుతున్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలిగించకుండా.. వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే ఏ రిజర్వేషన్‌కు అయినా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

ప్రస్తుతం కాపుల రిజర్వేషన్‌ విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం రూ. 1340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పేషన్‌కు సంవత్సరానికి రూ. 2 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో కలిపి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తా.. ఖర్చు చేస్తా’మని మేనిఫెస్టోలో చెప్పామని సీఎం వైయస్‌ జగన్‌ చదివి వినిపించారు. ఇంతకంటే క్లియర్‌గా మేనిఫెస్టో పెట్టరు.. చెప్పిన ప్రకారం మొట్టమొదటి బడ్జెట్‌లోనే కాపుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించామని గర్వంగా తలెత్తుకొని చెబుతున్నామని సీఎం అన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి కోసం  కేటాయించిన డబ్బులు ఖర్చు చేస్తామన్నారు. 

మంజునాథన్‌ కమిషన్‌ వేసి కమిషన్‌ చైర్మన్‌ సంతకం రిపోర్టుపై లేకుండా ఎక్కడైనా ఉంటుందా అని సీఎం వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. కమిషన్‌ సభ్యులతో సంతకం పెట్టిస్తే ఆ కమిషన్‌కు గౌరవం ఉంటుందా.. ఎవరైనా పట్టించుకుంటారా.. ప్రతి అడుగులోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు మోసం చేశాడన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నా చంద్రబాబు వైఖరి ఏమాత్రం మారలేదని, ఇప్పటికీ పరిస్థితి కుక్కతోక వంకరే అన్నట్లుగా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మారాలని, వయస్సుతో పాటు మానవత్వం, మంచితనం, ఎదుటి వారిని ఎలా గౌరవించాలని తెలుసుకోవాలని, చట్టసభలను గౌరవించాలని ముఖ్యమంత్రి కోరారు.

తాజా ఫోటోలు

Back to Top