న్యూఢిల్లీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడులకు ఏపీ సులభమైనదని అన్నారు. ఢీల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కర్టెన్ రైజర్ సదస్సులో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో అపార వనరులు ఉన్నాయని, పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమన్నారు. రాష్ట్రంలో మినరల్స్‌కు కొదవ లేదని సీఎం వైయస్ జగన్ తెలిపారు.
సోలార్, విండ్ ఎనర్జీలో ఏపీలో అపార అవకాశాలున్నాయని, పరిశ్రమలకు అవసరమైన నీరు, మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలకు ఎలాంటి అవసరాలున్న ఒక్క ఫోన్‌కాల్‌తో స్పందిస్తామని తెలిపారు. ఏపీకి 974 కి.మీ సుధీర్ఘమైన తీర ప్రాంతం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు ఓడరేవులున్నాయని, మరో నాలుగు ఓడ రేవులు నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే 6 ఎయిర్ పోర్టులు ఉన్నాయన్నారు.
వరుసగా మూడేళ్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా నిలిచామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు తాము చేస్తున్న కృషితోపాటు.. పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే తాము నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. వివిధ రంగాల క్లస్టర్లకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందన్నారు సీఎం వైయస్ జగన్. 11.43% వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్లలో మూడు కారిడార్లు ఏపీకే రావడం శుభపరిణామంగా వర్ణించారు.
దాదాపు 80 శాతం జిల్లాలు ఈ కారిడర్లలో ఉన్నాయి. 48 ఖనిజాలు ఏపీలో కనిపిస్తున్నాయి. తయారీ రంగంలో అనేక క్లస్టర్లు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. మాకు సింగ్‌డెస్క్ పోర్టల్ సదుపాయం ఉంది. 21 రోజుల్లో మీకు అన్నిరకాల అనుమతులు వస్తాయి. కరెంటు, నీళ్లు.. విషయంలో పరిశ్రమలకు సరసమైన ధరలకే వస్తున్నాయి. రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీకి పుష్కలమైన వనరులు ఉన్నాయి. 33వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని సీఎం వైయస్ జగన్ చెప్పారు.