పెండింగ్ అనే మాట ఎక్క‌డా ఉండ‌కూడ‌దు..

రోడ్లు, బ్రిడ్జీలు, ఆర్వోబీలు, ఫ్లైఓవ‌ర్ల ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేయాలి

మంత్రులు, ఉన్న‌తాధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం 

నివర్‌ తుపాను కారణంగా దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో ప‌నులు చేప‌ట్టాలి

జూలై 20న కార్పొరేషన్లు, మున్పిపాలిటీల్లో రోడ్ల ఫొటో గ్యాలరీలు పెట్టాలి

ప్ర‌తిప‌క్షాలు ర‌క‌ర‌కాల కుట్ర‌లు చేస్తున్నా.. సడల‌ని సంకల్పంతో ముందుకెళ్తున్నాం 

రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తుల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌

తాడేపల్లి:  రాష్ట్రంలో రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల ప‌నులు ఎక్క‌డా పెండింగ్‌లో ఉండ‌కూడ‌ద‌ని, వేగంగా పూర్తిచేసేలా చ‌ర్య‌లు తీసుకొని, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని సంబంధిత మంత్రులు, ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ర‌హ‌దారుల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ‌ రోడ్ల నిర్మాణ ప్ర‌గ‌తిపై ఆరా తీశారు. 

అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదని, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఫలితాలు కనిపించాల‌ని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేయడమే కాకుండా, గుంతలు లేకుండా రోడ్లను తీర్చిదిద్దాల‌న్నారు. నివర్‌ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాల‌న్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. 

కార్పొరేషన్లు, మున్పిపాలిటీల్లో రోడ్ల‌పై ఏర్ప‌డిన‌ గుంతలు జూలై 15లోగా పూడ్చాలని, జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాల‌ని సీఎం ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధంచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. 

ర‌క‌ర‌కాల కుట్ర‌లు ప‌న్నుతున్నారు..
``రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయి. అయినా సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకుసాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తిచేస్తున్నాం`` అని సమీక్ష సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా స‌మావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు,  పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్‌ అండ్ బీ శాఖ‌ మంత్రి దాడిశెట్టి రాజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఆర్‌ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఆర్ధికశాఖకార్యదర్శి కె.వి.వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top