గత ప్రభుత్వ మోసాన్ని, మన ప్రభుత్వ మంచిని గమనించండి

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

మేనిఫెస్టోలో చెప్పకపోయినా.. అక్కచెల్లెమ్మల మేలు కోసం ‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’

అందరికీ మేలుచేయాలనేదే నా తపన, తాపత్రయం

అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగి.. వారి కాళ్ల మీద వారు నిలబడాలి

వరుసగా రెండవ ఏడాది వైయస్‌ఆర్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం

3,27,244 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేస్తున్నాం

‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’తో రెండేళ్లలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ. 982 కోట్లు జమ

రెండేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.12,126 కోట్లు ఖర్చు చేయగలిగాం

ప్రతి అర్హుడికి మంచి చేయడమే మన ప్రభుత్వ సిద్ధాంతం 

తాడేపల్లి: నిరుపేదలుగా ఉన్న కాపు అక్కచెల్లెమ్మలకు మంచిచేయాలని, ఆర్థికంగా వారు వారి కాళ్ల మీద నిలబడే పరిస్థితి తీసుకురావాలనే నిండుమనసుతో వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా అక్కచెల్లెమ్మలకు మేలు చేయాలనే తపన, తాపత్రయంతో వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని చేపట్టామని, వరుసగా రెండో ఏడాది అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల చొప్పున అందించనున్నామన్నారు. 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా అక్షరాల రూ.490.86 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కాపులకు చేసిన మోసాన్ని, మన ప్రభుత్వం చేస్తున్న మంచిని గమనించాలని సీఎం వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

వరుసగా రెండవ ఏడాది వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం అమలు కార్యక్రమంలో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి మాట్లాడారు. 

‘‘దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిరుపేదలుగా ఉన్న కాపు అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా వారు వారి కాళ్ల మీద నిలబడే పరిస్థితి రావాలి. ఆర్థిక స్వావలంభన రావాలని వైయస్‌ఆర్‌ చేయూత లాంటి మంచి కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌ కాపు నేస్తం అనే పథకాన్ని రూపొందించాం. రెండవ ఏడాది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూపోతే రూ.75 వేలు అక్కచెల్లెమ్మల చేతుల్లో ఉంటుంది. ఆ అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడగలుగుతారని గొప్ప ఆలోచనతో పుట్టిన కార్యక్రమం ఇది. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. 60 దాటిన వారికి ఎలాగో పెన్షన్‌ వస్తుంది. 

ప్రభుత్వం మాట చెబితే.. కచ్చితంగా ఇస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో నా అన్న, నా తమ్ముడు ఉన్నాడు. ఏ నెలలో ఇస్తాడో కూడా ముందుగానే చెబుతున్నాడని ఆ అక్కకు, ఆ చెల్లెమ్మకు భరోసా ఇస్తే.. అప్పుడు కచ్చితంగా వారు ఆర్థిక ప్లానింగ్‌ చేస్తారు. వారి ఫోకస్‌ అంతా కుటుంబానికి మంచిచేయాలని తపనతో అడుగులు వేస్తారు. అక్కచెల్లెమ్మలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారి చేతుల్లోనే నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా రెండో సంవత్సరం వైయస్‌ఆర్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. 

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు నేరుగా వారి చేతుల్లోనే పెడుతున్నాం. ఈ కార్యక్రమం గురించి మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా.. ఇది చేస్తే బాగుంటుంది. నిరుపేద కాపు అక్కచెల్లెమ్మల వారి కాళ్లమీద వారు నిలబడే అవకాశం ఉంటుందని, చేయూత మాదిరిగానే వీరికి కూడా తోడుగా ఉండాలనే తపన తాపత్రయంతో అడుగులు ముందుకువేస్తున్నాం. ఇది నిండుమనసుతో కాపు అక్కచెల్లెమ్మలకు మేలు జరగాలని తపనతో వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి శ్రీకారం చుట్టాం. 

ఇంతకు ముందు గత ప్రభుత్వ పాలనలో కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి.. ఇచ్చింది కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని అక్కచెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పడిన మీ తమ్ముడి, మీ అన్న ప్రభుత్వం రెండేళ్లలో అక్షరాల రూ.12,126 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లో, కాపు సోదరుల చేతుల్లో పెట్టగలిగామని గర్వంగా చెబుతున్నాను. ఈరోజు ప్రత్యేకించి 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాల వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా రూ.490.86 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. బ్యాంకర్లతో ఇంతకు ముందే మాట్లాడటం జరిగింది. అక్కచెల్లెమ్మల పాత అప్పులకు, బకాయిలకు ఎట్టిపరిస్థితుల్లో జమ చేసుకోకూడదని బ్యాంకర్లకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డబ్బులు అక్కచెల్లెమ్మలకు ఉపయోగపడతాయని మనసారా కోరుకుంటున్నాను. 

కాపు నేస్తం కార్యక్రమం ద్వారానే గతేడాది 3,27,349 అక్కచెల్లెమ్మలకు, ఈఏడాది 2,27,244 మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు నేరుగా వారి చేతుల్లో పెట్టాం. వివిధ పథకాల ద్వారా దేవుడి దయతో రెండేళ్లలో కేవలం కాపు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు 59,63,308 మందికి మేలు జరిగిస్తూ రూ.12,126 కోట్లు రెండేళ్లలో ఇవ్వడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

రెండేళ్ల కాలంలోనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా మనందరి ప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా మేలు జరిగిన ఖాతాల వివరాలు గమనిస్తే.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా 7,85,700 మంది లబ్ధిదారులకు రూ.2,550 కోట్లు ఖర్చు చేయగలిగాం. వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ద్వారా 4,11,331 మంది లబ్ధిదారులకు రూ.2,384 కోట్లు, జగనన్న అమ్మ ఒడి ద్వారా 3,81,185 మంది లబ్ధిదారులకు రూ.1,143 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3,27,349 మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా 7,04,048 మంది అక్కచెల్లెమ్మలకు రూ.654 కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం. జగనన్న విద్యా దీవెన ద్వారా 1,28,119 మందికి రూ.354 కోట్లు నేరుగా ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 3,04,451 మంది రైతుల చేతుల్లో రూ.371 కోట్లు పెట్టగలిగాం. జగనన్న వసతి దీవెన ద్వారా 96,739 మంది అక్కచెల్లెమ్మలకు రూ.189 కోట్లు వారి చేతుల్లో పెట్టగలిగాం. వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ ద్వారా 8,42,854 మంది అక్కచెల్లెమ్మలకు రూ.202 కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిటీ కింద 1,71,360 మంది రైతన్నలకు రూ.132 కోట్లు వారి చేతుల్లో పెట్టగలిగాం. వైయస్‌ఆర్‌ బీమా ద్వారా 8,151 మంది రైతన్నలకు రూ.132 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంటల రుణాల ద్వారా 5,42,523 మంది రైతన్నలకు రూ.102 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా 29,957 మంది అన్నదమ్ముళ్లకు రూ.84 కోట్లు పెట్టగలిగాం. విదేశీ విద్యా దీవెన ద్వారా 533 మందికి రూ.29.45 కోట్లు ఇవ్వగలిగాం. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద 37,765 మందికి రూ.22.85 కోట్లు ఇవ్వగలిగాం. జగనన్న చేదోడు ద్వారా 14,121 మందికి రూ.14 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా కూడా 2,577 మంది అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలకు రూ.12.40 కోట్లు ఇవ్వగలిగాం. 

ఇలా నేరుగా బటన్‌ నొక్కి ఆధార్‌ నంబర్లతో సహా ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా, వివక్షకు తావులేకుండా పారదర్శకతతో ప్రతి లబ్ధిదారుడికి మేలు జరగాలనే ఆరాటం, తపన తాపత్రయంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి అర్హుడికి మంచి జరగాలి.. అనర్హత ఉన్నవారికి రాకూడదు. ఈ రెండే ప్రభుత్వ సిద్ధాంతం. ఎలాంటి అవినీతి, వివక్షకు తావులేకుండా అక్షరాల 47,88,663 మందికి డైరెక్ట్‌గా రూ.9,359 కోట్లు నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

నాన్‌ డీబీటీ స్కీమ్స్‌ లెక్కలు తీసుకుంటే వైయస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా 2,46,080 మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాల రూ.2,160 కోట్లతో ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 1,16,797 మందిని రూ.289 కోట్లతో ఆదుకోగలిగాం. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా 1,50,800 మంది అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు మంచిజరిగేలా రూ. 144 కోట్లు ఖర్చు చేయగలిగాం. జగనన్న గోరుముద్ద ద్వారా 2.84 లక్షల మంది పిల్లల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేయగలిగాం. డీబీటీ, నాన్‌ డీబీటీ కింద రూ.12,126 కోట్లు దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డగా అందించగలిగాను. 

మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ప్రతి అడుగు ముందుకువేస్తూ వచ్చాం. ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. మోసాలు చేయలేదు. చిత్తశుద్ధితో మంచి కోసమే అడుగులు వేస్తున్న మీ బిడ్డకు అందరి చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ వరుసగా రెండో ఏడాది వైయస్‌ఆర్‌ కాపు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top