ఎవరికీ ఏ ఆపద రాకూడదని కోరుకునే ప్రభుత్వం మనది

వైయస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైయస్‌ఆర్‌ బీమా.. ధీమా

బీమా ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది

రాష్ట్రంలోని 1.32 కోట్ల కుటుంబాలకు ‘వైయస్‌ఆర్‌ బీమా’ వర్తింపు 

రూ.750 కోట్లతో 1.32 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ 

బ్యాంకులకు సంబంధం లేకుండా పథకం అమలు

18–50 ఏళ్ల మధ్య సంపాదించే వ్యక్తి సహజంగా మరణిస్తే రూ. లక్ష సాయం

18–70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యానికి రూ.5 లక్షల బీమా

తాడేపల్లి: ‘‘శతమానంభవతి అని వందేళ్లు వర్ధిల్లాలంటూ పెద్దలు దీవిస్తారు. అలా ప్రజలంతా వంద సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపద రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనది. ఆరోగ్యశ్రీ పథకంలో పెనుమార్పులు తీసుకువచ్చి ప్రజారోగ్యానికి భద్రత కల్పించాం. మన చేతుల్లో మన బతుకులు ఉండవు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని ఊహించుకోవడమే కష్టం. అలాంటి నిరుపేద కుటుంబాలకు వైయస్‌ఆర్‌ బీమా పథకం ధీమానిస్తుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 1.32 కోట్ల కుటుంబాలను వైయస్‌ఆర్‌ బీమా పథకం పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. బీమా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ నిరుపేద కుటుంబాల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తోందని చెప్పారు. ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన నెలరోజుల్లోనే బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా మార్పులు చేశామని చెప్పారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..  

మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ఎవరైనా దీవించేటప్పుడు మామూలుగా మనం వింటుంటాం. శతమానంభవతి అని వందేళ్లు వర్థిల్లండి అని దీవిస్తారు. అలా వంద సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపద రాకూడదని మనసారా కోరుకున్న ప్రభుత్వం మనది. ఎప్పుడూ జరగని విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల విపరీతమైన ధ్యాసపెట్టాం. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకంలో గతంలో ఉన్నదానికంటే చాలా మార్పులు చేశాం. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకువచ్చాం. గతంలో 1000 లోపు ఉన్న రోగాలను ఏకంగా 2450 జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణ చేశాం. కానీ, ఇవన్నీ చేసినప్పటికీ ఒక్కోసారి మన చేతుల్లో మన బతుకులు ఉండవు. అదృష్టం బాగోలేక అలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు.. ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది.. రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం అవుతుంది. 

నా పాదయాత్రలో చాలా సందర్భాల్లో అలాంటి గాధలు చాలా చూశాను.. చాలా విన్నాను. అవన్నీ మార్పు చేసే దిశగా మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నెరవేర్చామని సగర్వంగా తెలియజేస్తున్నాను. నిజంగా కూలి పనులు చేసుకుంటున్నవారు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుబండిని ఈడ్చేవాళ్లు దాదాపుగా 1.32 కోట్ల కుటుంబాలు వైయస్‌ఆర్‌ బీమా పథకం పరిధిలోకి రావడం జరుగుతుంది. 

కుటుంబ పెద్దను ఈ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. పేద కుటుంబాలకు ఆర్థికంగా బీమా కల్పించేందుకు వైయస్‌ఆర్‌ బీమా పథకం అమలు చేస్తున్నాం. పేద కుటుంబం మీద ఏ ఒక్క రూపాయి భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే భర్తిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజమరణం సంభవిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం, 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల సంపాదించే వ్యక్తి మరణించినట్లయితే లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా కూడా రూ.5 లక్షల బీమా పరిహారం అందించేలా వైయస్‌ఆర్‌ బీమాను రూపొందించడం జరిగింది. 

2021–22 సంవత్సరానికి గానూ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈ రోజు దాదాపుగా రూ.750 కోట్ల వ్యయంతో మనందరి ప్రభుత్వం వైయస్‌ఆర్‌ ఉచిత బీమా పథకాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఈ బీమా పథకం కోసం మనందరి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన ఖర్చు అక్షరాల రూ.1307 కోట్లు అని సవినయంగా తెలియజేస్తున్నాను. 

కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ పథకం నుంచి కేంద్రం తప్పుకుంది. అంత వరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగం, రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం కలిపి ఇన్సూరెన్స్‌ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి ఉండేది. మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న ఆలోచనతో కేంద్రం తప్పుకున్నప్పటికీ ఈ పథకం కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తోంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీమా పథకం నుంచి తప్పుకున్న కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ కన్వజెన్స్‌ స్కీమ్‌ స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతా ద్వారా బీమా చేయించాలని ఆదేశించింది. ఇంతకు ముందు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద జరిగేది. కానీ, కేంద్రం ఈ పథకం నుంచి తప్పుకోవడమే కాకుండా.. ఇన్సూరెన్స్‌ కన్వజెన్స్‌ స్కీమ్‌ తీసేసి.. ఆ స్థానంలో అర్హులైన ప్రతి వ్యక్తి వారి బ్యాంక్‌ ఖాతా ద్వారానే బీమా చేయించాలని ఆదేశించింది. దీని వల్ల దాదాపుగా 1.21 కోట్ల కుటుంబాలకు బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించినప్పటికీ కూడా బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరవడం, ఆ ఖాతాల ద్వారా ఇన్సూరెన్స్‌ సొమ్ము వేయడం, ఆ వ్యక్తిగత ఖాతాల నుంచి ఇన్సూరెన్స్‌ కంపెనీలకు పంపించడం.. ఈ ప్రక్రియ చేయాల్సిన బాధ్యత బ్యాంకులది. 

రాష్ట్ర ప్రభుత్వం 1.21 కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ ప్రీమియం బ్యాంకులకు కట్టినప్పటికీ.. బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు ఓపెన్‌ చేయడం, ఆ ఖాతాల నుంచి ఇన్సూరెన్స్‌ కంపెనీలకు పంపించడం, ఫార్మాలిటీస్‌ ఫిలప్‌ చేయడం ఇలాంటివి చేయలేకపోవడం వల్ల అక్షరాల 62.05 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకులు ఎన్‌రోల్‌ చేయగలిగాయి. మిగిలిన 58.05 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ బ్యాంకులు ఎన్‌రోల్‌ చేయలేకపోయాయి. ఒకవైపున ఎన్‌రోల్‌మెంట్‌ సమస్యలు ఉంటే.. మరో వైపున బ్యాంకులు ప్రతి వ్యక్తిగత క్లెయిమ్స్‌ను బీమా కంపెనీలతో ఫాలోప్‌ చేయించి ఇన్సూరెన్స్‌ మొత్తం ఇప్పించాలి. అది కూడా బ్యాంకులు చేయలేకపోయాయి. దీని కారణంగా క్లెయిమ్స్‌ రావడంలో విపరీతమైన జాప్యం జరగడం, ఈ క్రమంలో అర్హులై ఉండి కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్‌ కాకుండా మిగిలిపోయిన వారు.. ఎన్‌రోల్‌ అయినప్పటికీ 45 రోజుల లీన్‌ పిరయడ్‌ అని చెప్పి పరిగణలోకి తీసుకోరు. లీన్‌ పిరియడ్‌ మధ్యలో అర్హత ఉన్నప్పటికీ బ్యాంకులు ఎన్‌రోల్‌ చేయలేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు 12,039 మంది చనిపోయారు. ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలనే దృక్పథంతో మన ప్రభుత్వం ఆ బీమా క్లెయిమ్స్‌ రూ.254 కోట్ల మొత్తాన్ని మన ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. 

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, సమస్యలకు పుల్‌స్టాప్‌ పడాలని, పద్ధతి ప్రకారం జరగాలని, అనుకోనిది ఏదైనా జరిగితే ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా ఆ కుటుంబాలకు ఉండాలనే ఉద్దేశంతో ఏ నెలలో వ్యక్తి చనిపోతే ఆ నెలలోనే ఆ కుటుంబానికి పరిహారం అందేలా.. గ్రామ సచివాలయాలకే పూర్తిగా ఆ బాధ్యతలు అప్పగించాం. సచివాలయాల జాయింట్‌ కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగేలా మార్పులు చేశాం. ఇక మీదట ఎటువంటి ఇన్సిడెంట్‌ జరిగినా.. ఆ నెలలోనే పరిహారం అందుతుంది. వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది తోడుగా ఉంటారు. వైయస్‌ఆర్‌ బీమా పథకం వల్ల 1.32 కోట్ల కుటుంబాలకు మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా.. 155214 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశాం. ఈ నంబర్‌కు కాల్‌ చేసి బీమా నమోదు, ఫిర్యాదు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. 

మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి మనిషి నిండునూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top