తాడేపల్లి: గత టీడీపీ ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచన చేసిందని వైయస్‌ఆర్ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన మేనిఫెస్టోలో చేనేతలకు 25 హామీలు ఇచ్చారని, వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వైయస్‌ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా తన పుట్టిన రోజున సీఎం వైయస్ జగన్ మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ. 24 వేలు అందజేశారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చేనేత కార్మికుల సమావేశం అనంతరం మోహన్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత సహకార సొసైటీలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం వైయస్ జగన్ పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు వంచన యాత్ర చేస్తున్నాడన్నారు. ప్రతిపక్షం పనిగట్టుకొని రాజధానిపై రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న చంద్రబాబు రకరకాల విమర్శలు చేస్తున్నాడని, బాబు మాటలను ప్రజలు ఎవరూ నమ్మే పరస్థితిల్లో లేరన్నారు.