టీడీపీ కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన 

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పరాకాష్టకు రాజకీయ కక్ష సాధింపు

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే,  పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు.

సాక్ష్యాలు, కారణాలు లేకుండానే ఎడాపెడా కేసులు

పాలనా వైఫల్యాల నుంచి ఎప్పడికప్పుడు డైవర్షన్‌ 

18 నెలల కాలంలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదు

తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన ఆధిపత్య పోరు

చివరకు హత్యలకు సైతం వెనుకాడడం లేదు

పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో హత్యలకు అదే కారణం

పల్నాడులో హత్యలను వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదిస్తున్నారు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమంగా కేసు

రాజకీయ కక్ష సాధింపు కోసం తప్పుడు కేసులు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ అక్రమ అరెస్ట్‌ 

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్టకు చేరిందని ఆయన దుయ్యబట్టారు. సాక్ష్యాలు, కారణాలు లేకుండా ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న కూటమి ప్రభుత్వం, తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని వెల్లడించారు. ఏడాదిన్నర కాలంగా ఈ ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏం మాట్లాడారంటే..:
 
చంద్రబాబు వికృత, నీచ రాజకీయం:
    అధికారమే పరమావధిగా ఏ మాత్రం నైతిక విలువలు లేకుండా సీఎం చంద్రబాబు వికృత, నీచ రాజకీయాలు చేస్తారు. అధికారం కోసం ఆయన ఏ అడ్డదారి అయినా తొక్కుతాడు. ఆ చర్యల్లో చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ పట్టా పొందారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చని, ఎవరినైనా పీహెచ్‌డీ చేయమంటే వారు కచ్చితంగా చంద్రబాబు పేరే తీసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయంలో అన్ని రకాల ఉల్లంఘనలు ఉంటాయి. ఆయనకు సహకరిస్తున్న వ్యవస్థలూ ఉంటాయి. ఇప్పుడు కూడా విపక్ష వైయ‌స్ఆర్‌సీపీలక్ష్యంగా, సీఎం చంద్రబాబు వికృతంగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం సాక్ష్యాలు, ఆధారాలు, కారణాలు లేకుండానే మా పార్టీ నేతలు, నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టు చేస్తున్నారు. జైళ్లకు పంపుతున్నారు. అయితే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. అందుకే చంద్రబాబు ఎన్ని రకాలుగా వేధించినా, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటాం.
    పాలనలో అన్నింటా విఫలమవుతున్న సీఎం చంద్రబాబు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ను నమ్ముకున్నారు. అందుకే ఏ పాలనా వైఫల్యం బయట పడినా, ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రతినెలా పెన్షన్‌ పంపిణీ పేరుతో ఊళ్లు తిరుగుతూ, పక్కా స్క్రిప్ట్‌ మేరకు డ్రామా చేస్తున్నారు. అందుకే ఒక నెల బార్బర్‌ షాప్, ఒక నెల బడ్డీకొట్టు, మరో నెల జాలర్లపేట, ఇంకో నెల నేతన్న ఇంటికి వెళ్తున్నారు. ఒకరోజు ఆటోలో డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చుని డ్రామా, షో చేశారు.

టీడీపీ వర్గపోరు హత్యల్లో పిన్నెల్లిని ఇరికించారు:
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్న, ప్రభుత్వ విప్‌గా పని చేపిన మాచర్లకు చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ట సంప్రదాయానికి తెర లేపారు. పల్నాడులో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఇద్దరు చనిపోతే ఆ కేసును పిన్నెల్లి సోదరుల మీద బనాయించారు. నిజానికి పిన్నెల్లి సోదరులకు ఆ హత్యలతో ఎలాంటి సంబంధం లేదు. అదే విషయాన్ని హత్యలు జరిగిన రోజు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ స్వయంగా ప్రకటించారు. అలాగే ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని చంపింది ఎవరు?. ఇవన్నీ అందరికీ తెలిసినవే. పల్నాడు జిల్లా టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కోసం హత్యలు జరగ్గా, ప్రకాశం జిల్లాలో దోచుకున్న డబ్బులు తినే క్రమంలో, వచ్చిన విభేదాలతో వీరయ్య చౌదరి హత్య జరిగింది. అయినా ఆ రెండు ఘటనలను వైయ‌స్ఆర్‌సీపీకి అంటగట్టేందుకు కుట్ర చేసి, నిరాధార ఆరోపణలు చేస్తూ నిందిస్తున్నారు.

జగన్‌గారు ఏనాడూ అలా చేయలేదు:
    గత ప్రభుత్వ హయాంలో వైయస్‌ జగన్, ఏనాడూ అనైతిక రాజకీయాలు చేయలేదు. పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపలేదు. అలాగే నాటి విపక్ష టీడీపీపై ఎలాంటి కక్ష రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లు, ఆనాటి ప్రభుత్వం చేసి ఉంటే, అసలు ఆ కూటమి అధికారంలోకి వచ్చేదా?. ఇది నిజం కాదు అని చెప్పే ధైర్యం మీకుందా?.

జోగి రమేష్‌పై తప్పుడు కేసు. అక్రమ అరెస్ట్‌:
    ఒక బీసీ నాయకుడైన జోగి రమేష్‌పై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారు. అసలు మీరు చెబుతున్న ఆ కేసుకు సంబంధించిన నిందితుల కాల్‌ డేటాల్లో, ఫోన్‌ డేటాల్లో ఎక్కడైనా ఆయన పేరు ఉందా అని అడుగుతున్నాను. అదే నకిలీ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డిని, సహ నిందితుడైన ఆయన తమ్ముడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?. జోగి రమేష్‌ను అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాదా? నకిలీ మద్యం తయారీ కేసులో ఆయన పాత్ర, ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం ఆ కేసులో ప్రధాన నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తన పేరు ప్రస్తావించాడంటూ, జోగి రమేష్‌పై తప్పుడు కేసు బనాయించి, అక్రమంగా అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.

Back to Top