విశాఖపట్నం: తన అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు సింగపూర్‌లో పర్యటించారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైయస్ఆర్‌సీపీ ఈ మెయిల్స్ రాస్తోందంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వ అవినీతిపై ఈ మెయిల్స్ రాసింది టీడీపీకి చెందిన వీరాభిమానేని బయటపడటంతో లోకేష్ సిగ్గుతో ముఖం చాటేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... పెట్టుబడులు తీసుకురావడానికి సింగపూర్ పర్యటనకి వెళ్తున్నట్టు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చారు? దీనిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక డైవర్ట్ చేసేందుకు రెండు రోజులుగా వైయస్ జగన్ మీద, గత వైయస్సార్సీపీ ప్రభుత్వం మీద మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అబద్దాలు చెప్పడం, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో తండ్రీకొడుకులు ఒకర్ని మించి ఇంకొకరు పోటీ పడుతున్నారు. చంద్రబాబు ఏడాది పాలన చూసి, కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదు. ఏం ఆ విషయాన్ని చెప్పుకోలేక వైయస్ జగన్ విదేశీ కంపెనీలకు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఈమెయిల్స్ రాయించాడంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. తీరా ఆరాతీస్తే మురళీకృష్ణ అనే టీడీపీకి చెందిన ఎన్నారై ఈమెయిల్స్ రాసినట్టు స్పష్టమైంది. దీనికి లోకేష్ ఏం సమాదానం చెబుతారు? సింగపూర్‌తో చంద్రబాబు అవినీతి బంధం 1995 నుంచి మా నాన్న గారికి సింగపూర్‌తో సంబంధాలున్నాయని నారా లోకేష్ నిన్న చెప్పిన మాటలనే మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. సీఎంగా ఇప్పటి వరకు చంద్రబాబు సింగపూర్‌కి 58 సార్లు వెళ్లాడు. మేం చెప్పేమాటలు నిజాలేనని ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా నిర్ధారించినట్టేగా? పెట్టుబడుల కోసం అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే అది నిజమేనని ప్రజలు కూడా నమ్మారు. కానీ రాష్ట్రంలో సంపాదించిన అవినీతి సొమ్మును సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టడానికే చంద్రబాబు ఈ 30 ఏళ్లలో 58సార్లు వెళ్లి వచ్చాడు. చంద్రబాబు, లోకేష్‌తోపాటు సింగపూర్ వెళ్లిన మంత్రులు నారాయణ, టీజీ భరత్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడినట్టు కనిపించదు. వాళ్లు పేపర్లు మోయడానికి వెళ్లారా? ఎప్పుడైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని దావోస్‌కి కానీ, సింగపూర్‌కి కానీ తీసుకెళ్లారా ? ఎందుకు తీసుకెళ్లలేదు? మా హయాంలో జీఐఎస్, దావోస్ ఒప్పందాల గురించి స్పష్టంగా చెబుతాం. మీరు చెప్పగలరా? ఈ పర్యటనల్లో గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలి. రాష్ట్ర సంపదను సింగపూర్ కంపెనీలకి దోచిపెట్టారు 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక సింగపూర్ పిచ్చి మరింత ముదిరిపొయింది. అమరావతి రాజధాని నిర్మాణంలో కేపిటల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను సింగపూర్ కన్సార్సియంకి అప్పగించి రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 58 శాతం వాటాలిచ్చాడు. కానీ రూ.12 వేల కోట్లు నిధులు సమాకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కేవలం 42 శాతం వాటాలు మాత్రమే దక్కేలా ఒప్పందాలు చేసుకున్నాడు. టర్నోవర్‌లో సింగపూర్ కంపెనీకి 91.50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 8.50 శాతం వాటా ఇచ్చారు. ఇంతకన్నా మోసం ఇంకెక్కడైనా ఉంటుందా? దీనిపై చర్చకు చంద్రబాబు, లోకేష్ సిద్ధమా? అవినీతి కేసులో అరెస్టయి జైలు జీవితం గడిపిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబుకి సంబంధాలున్న మాట వాస్తవమా కాదా? సింగపూర్‌లో చంద్రబాబు ఇచ్చిన ప్రజంటేషన్‌లో రాష్ట్రంలో తుది నిర్మాణ దశలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు, అదానీ డేటా సెంటర్ ఏర్పాటు అన్నీ కూడా వైయస్సార్సీపీ హయాంలోనే ప్రారంభమైన మాట వాస్తవమా కాదా? రామాయపట్నం 90 శాతం, మూలపేట 70 శాతం, మచిలీపట్నం 50 శాతం పనులు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీ రావడానికి కారణం కూడా వైయస్ జగన్ దావోస్‌లో చేసిన చర్చల ఫలితమే.. ఇవన్నీ వైయస్సార్సీపీ హయాంలోనే రాష్ట్రంలో ఏర్పాటైనవే. వాటిని మీ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. గడిచిన 30 ఏళ్లలో 15 ఏళ్లపాటు రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఏరోజైనా రాష్ట్రం బాగోగులు పట్టించుకున్నారా? పోర్టుల నిర్మాణంతో బ్లూ ఎకానమీకి మేమే బీజం వేశాం రాష్ట్రానికి సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంటే అభివృద్ధి చేయాలని ఏరోజైనా చంద్రబాబు ఆలోచించారా? పోర్టుల నిర్మాణం గురించి ఒక్క ఆలోచన చేశారా? చంద్రబాబు చెప్పుకుంటున్నా బ్లూ ఎకానమీకి బీజం పడింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. బ్లూ ఎకానమీని అభివృద్ధి చేసేలా తీరప్రాంతంలో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మా పాలనలోనే వచ్చాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి మే 3, 2023లో మా హయాంలోనే శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు చేశాం కాబట్టే మరో ఆరు నెలల్లో పూర్తికావొస్తోంది. ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న తాపత్రయం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్నదాఖలాలు లేవు. రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలోని విలువైన భూములు కట్టబెట్టేశారు. పేరున్న ఐటీ కంపెనీలను ముందు పెట్టి ముసుగులో సత్వా, కపిల్, లులు, ఉర్సా వంటి కంపెనీల పేరుతో తన తాబేదార్లకు విశాఖ భూములను దోచిపెడుతున్నాడు. విశాఖలో వేల కోట్ల విలువైన భూములను లులుకి 99 ఏళ్లకు చదరపు అడుగు రూపాయిన్నరకి కట్టబెట్టడాన్ని ప్రజలెవరూ అంగీకరించడం లేదు. భారతదేశంలో ఎక్కడైనా లులు సంస్థకు ఇలా అప్పనంగా భూములు కేటాయించడం జరిగిందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం సమాధానం చెబుతారు? స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణపై మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్న అడిగితే దాని మీద వెనక్కి తగ్గడం లేదని, ప్రైవేటీకరణకి కట్టుబడి ఉన్నామని కేంద్రం సమాధానమిచ్చింది. 2021లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంటే 2024 వరకు మేం అధికారంలో ఉన్నంతకాలం ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్న ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. మొన్ననే కాంట్రాక్ట్ బేసిస్‌లో పనిచేసే 5200 మందిని స్టీల్ ప్లాంట్ తొలగించింది. ఉద్యోగం పోయిందనే బాధలో నిన్న ఒక స్టీల్ ప్లాంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఒకపక్క ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామంటారు.. ఇంకో పక్క వరుసపెట్టి ఉద్యోగాలు పీకిపారేస్తున్నారు.