అమరావతి: ప్రముఖ ప్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ ప్లై రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. సెంచురీ ప్లై బోర్డ్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు సీఎం వైయస్ జగన్‌మెహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. రాష్ట్రంలో సంస్థ పెట్టుబడి ప్రణాళికలను సీఎంకు వివరించారు. ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అత్యంత పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన సెంచురీప్లై బద్వేల్‌లో మూడు దశల్లో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తొలి దశ పనులను తక్షణం ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి 3 దశలు పూర్తి చేయనుంది. తొలి దశలో 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను పూర్తి చేసి 2024 నాటికి 10 లక్షల టన్నులకు తీసుకెళ్లనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో యూకలిప్టస్ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా ఆర్థికంగా చేయూత అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆ సంస్థ సీఎండీ సజ్జన్ భజంకా, ఈడీ కేశవ్ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షాతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల వలవన్ ఉన్నారు.