తాడేపల్లి: దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులకు స్ఫూర్తిప్రదాత అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఓఎస్‌డీ గోవిందరెడ్డి కొనియాడారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ చిత్రపటానికి గోవిందరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గోవిందరెడ్డి మాట్లాడుతూ..తాను యూనివర్సిటీలో చదివే రోజుల్లో రాధాకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. తాను స్వయంగా ఆయన్ను చూశానని, అంతటి గొప్ప వ్యక్తిని చూడటం తన అదృష్టంగా భావించానని చెప్పారు. సెప్టెంబర్ 5న జన్మించిన రాధాకృష్ణ 1962లో భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు, మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారని తెలిపారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.