రియల్ ఎస్టేట్ కోసమే "తిరుపతి సభా"..?

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ 

 తిరుపతిలో రేపటి అమరావతి సభ .. అదొక టీడీపీ రాజకీయ సభ...

 సాగునీటి ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారిది త్యాగమా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇచ్చిన వారిది త్యాగమా..?
  చంద్రబాబు సమాధానం చెప్పాలిః మంత్రి బొత్స సత్యనారాయణ

 రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఓ సామాజికవర్గం దోపిడీ కోసం చేస్తున్నది త్యాగమా..?

 తిరుపతి సభపై ఇంకా దోబూచులాటలు, దొంగాటలు ఎందుకు.. టీడీపీ ఎజెండాతో జరుగుతున్న సభ అని   చెప్పండి

 29 గ్రామాలు తప్ప 13 జిల్లాలతో సంబంధం లేదు అని తిరుపతి సభలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటన చేయగలరా..?

  ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలను పక్కన పెట్టి హైదరాబాద్ లో 10 కిలో మీటర్ల పరిధిపైనే దృష్టి పెట్టబట్టే బాబు ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాడు

 అమరావతి యాత్రలో పాల్గొంది టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే.. స్వచ్ఛందంగా ఏ ఒక్క రైతైనా వచ్చారా..?

 విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దని ఉత్తరాంధ్రవాళ్ళు ఎవరు చెప్పారో అచ్చెన్నాయుడు చెప్పాలి

 సభలో అల్లర్లు సృష్టించడానికి ఎవరికి అవసరం.. మీరే అల్లర్లు సృష్టించి మాపై బురదజల్లటానికి ప్లాన్ చేశారా..?

  అమరావతి పెద్ద స్కాం అని, పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పింది ప్రధాని, బీజేపీయే కదా..?

 మీరు అనుకున్నదే జరగాలని డిక్టేట్ చేయడం సమంజసం కాదు.. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే ఫైనల్

 రాయలసీమ పరిరక్షణ సమితి ఉద్యమానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు

 జస్టిస్ చంద్రు మాట్లాడిన మాటల్లో తప్పేంటి..?

 ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేస్తామని, రాష్ట్రపతి పాలన పెట్టిస్తామనే హక్కు న్యాయస్థానాలకు ఎవరిచ్చారు?

తాడేప‌ల్లి: తిరుపతిలో రేపు జరగబోయే అమరావతి సభ - అదొక తెలుగుదేశం పార్టీ రాజకీయ సభ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఓ సామాజికవర్గ దోపిడీ కోసం అమరావతి రాజధాని పేరుతో చేస్తున్నదానిని త్యాగం అని ఎలా అంటారో చెప్పాలని నిలదీశారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా వేలాది మంది రైతులు భూములు ఇస్తారని, అలా భూములు ఇచ్చిన వారిది త్యాగమా..? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇచ్చిన వారిది త్యాగమా..? అన్నది చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సూటిగా ప్రశ్నించారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

అమరావతి సభపై ఇంకా దోబూచులాటలు, దొంగాటలు ఎందుకు అని.. టీడీపీ ఎజెండాతోనే ఆ సభ జరుగుతున్నదని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాలు తప్ప, మిగిలిన 13 జిల్లాలతో సంబంధం లేదు అని తిరుపతి సభలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటన చేయగలరా..? అని బొత్స ప్రశ్నించారు. ఆ 29 గ్రామాల అభివృద్ధే టీడీపీ ఎజెండా అయితే.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు, 13 జిల్లాలు అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ విధానం అని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి యాత్రలో పాల్గొంది టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే తప్ప.. స్వచ్ఛందంగా ఏ ఒక్క రైతైనా వచ్చారా..? అని బొత్స ప్రశ్నించారు. తిరుపతి సభలో టీడీపీ వారే అల్లర్లు సృష్టించి, ఆ బురద ప్రభుత్వంపైన వేసేందుకు ప్లాన్ చేశారేమో అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. 

అలానే, జస్టిస్ చంద్రు మాట్లాడిన మాటల్లో తప్పేంటి..? అని, టీడీపీ ఏజెండాకు అనుకూలంగా మాట్లాడితే ఒకలా, వ్యతిరేకంగా మాట్లాడితే మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనని మంత్రి బొత్స అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేస్తామని, రాష్ట్రపతి పాలన పెట్టిస్తామనే హక్కు న్యాయస్థానాలకు ఎవరిచ్చారు? అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. 

 తిరుపతిలో రేపు రాజకీయ సభ జరుగుతుంది. అది ‘అమరావతి ఐక్యసభ’ కాదు.. అదొక రాజకీయ సభ అంటున్నాం. విజయవాడ నుంచి బయల్దేరిన దగ్గర నుంచి తిరుపతి చేరేవరకూ ఆ పాదయాత్రలో, మార్గమద్యంలో పాల్గొన్నవారంతా తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు, వారి సానుభూతిపరులే తప్ప స్వచ్ఛందంగా ఏ ఒక్క రైతు అయినా వచ్చారా? అని అడుగుతున్నాం.

  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన చూస్తే.. ఇంకా  దోబూచులాటలు, దొంగాటలు అవసరమా.. అని ప్రశ్నిస్తున్నాం. డైరెక్ట్‌గానే టీడీపీ ఎజెండాతో, లేక చంద్రబాబు నాయుడు ఎజెండాతోనే ఈ సభ నిర్వహిస్తున్నామని అంటే సరిపోతుంది. అమరావతిలో ఏవైతే 29 గ్రామాల అభివృద్ధి, ఓ సామాజికవర్గాన్ని అభివృద్ధి చేయడం, తద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో దోచుకోవడం వారి తాలుకా అజెండా.

  మా ముఖ్యమంత్రిగారి, మా పార్టీ అజెండా ఏంటంటే... రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం. అన్ని ప్రాంతాల ప్రజల  మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లాలనుకోవడం మా పార్టీ తాలుకా విధానం. దీనికి చంద్రబాబు ఏదోదో మాట్లాడుతున్నారు. 

  చంద్రబాబును సూటిగా అడుగుతున్నా. త్యాగాలు.. త్యాగాలు అంటున్నారే. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టారు. నాగార్జున సాగర్‌ కట్టారు. పోలవరం కడుతున్నాం. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎన్నివేల మంది రైతులు తమ భూములను ఇచ్చారు. ఎంతమంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ప్రాజెక్ట్‌లు కడుతున్నాం. చట్టాల ప్రకారం వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. తద్వారా రాష్ట్రానికి సంపద పోగవుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. మరి వారిది త్యాగం కాదా? 

  కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే కార్యక్రమాలను ఆలోచన చేసి, తన సామాజిక వర్గం కోసమే చేసింది త్యాగం అంటారా? ఏది త్యాగం అన్నది చంద్రబాబు చెప్పాలి. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. 
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ విధానానికి వస్తే ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే మా విధానం. 29 గ్రామాలకు అమరావతి అని నామకరణ చేశారో ఆ ప్రాంతంలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలన్నది మా ఆలోచన. మీ విధానం మీది.. మా విధానం మాది. మీ విధానం తప్పు అని ప్రజలు ఛీత్కరించారు కాబట్టే, 2019లో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. 

 అలానే, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల మేరకు, ఎవరైతే ల్యాండ్‌ పూలింగ్‌ కు భూములు ఇచ్చారో, దాని ప్రకారమే ఆ ప్రాంతాన్ని డెవలప్‌చేసి వారికి ప్లాట్లు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని, అలాగే వారికి ఇంకా మెరుగైన ప్యాకేజీని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. అలాకాకుండా, మేము చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వేదం అని డిక్టేట్ చేద్దామనుకుంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తాలుకా అభిప్రాయం ప్రకారం ఏ కార్యక్రమమైనా జరుగుతుంది. ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. 

  ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలంతా అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నారంటూ అచ్చెన్నాయుడు చెబుతున్నారు. ఎవరు ఆమోదించారో ఆయనే చెప్పాలని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబుకు ఓ అజెండా ఉంది. అమరావతి పేరుతో దోపిడీ కార్యక్రమం చేయాలన్నది ఆయన అజెండా. ఆ విషయాలను ఉత్తరాంధ్రలో సభ పెట్టి చెప్పమంటారా? ఇప్పటికైనా, రాజకీయంగా మీ అజెండాను ఓపెన్‌గా చెబితే బాగుంటుంది. 29గ్రామాల అభివృద్ధి తప్ప, మిగతా 13 జిల్లాలతో సంబంధం లేదు, ఇదే మా అజెండా అని తిరుపతి సభలో చంద్రబాబు స్ఫష్టంగా ప్రకటన చేయగలరా?

  హైదరాబాద్‌ను తానే డెవలప్‌ చేశానని చంద్రబాబు ఎప్పుడూ డబ్బా కొట్టుకుంటారు. హైదరాబాద్‌ గురించి ఎవరికి తెలియదు. కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రాంతంపైనే దృష్టి పెట్టి, బిల్డింగులు కట్టి, మిగతా 23 జిల్లాలనూ పక్కనపెట్టబట్టే, టీడీపీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారే రింగ్‌రోడ్డును, ఎయిర్‌పోర్టును, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే... తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది వాస్తవం కాదా? ఎందుకిలా చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకుంటారు. చరిత్ర ఎప్పుడూ మరచిపోరు. ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. 

  పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలను గ్రంథాల్లో నుంచి తీసుకువచ్చి... త్యాగం.. త్యాగం అని అంటున్నారే? ఏంటి త్యాగం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు జాతీయ సంపదను వాడుకుని, అమరావతి ప్రాంతంలో బిల్డింగులకు 140 అడుగుల మేర పునాదులు తీసి చేసిన కార్యక్రమాన్ని త్యాగం అంటారా? తద్వారా మీ ఆస్తులు పెంచుకునేందు చేసిన కార్యక్రమం కాదా? దాని కోసమే రేపు తిరుపతిలో సభ నిర్వహిస్తామని చెబుతున్నారా? మరోసారి చెబుతున్నాం.. రేపు జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ. తెలుగుదేశం పార్టీ తాలూకా అజెండా సభ. టీడీపీ సామాజిక వర్గం సభ. టీడీపీ తాలుకా ధనదాహానికి, దోచుకోవాడానికి, వత్తాసు పలుకనున్న సభ. దూరదృష్టి లేకుండా, రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమానికి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ప్రజల నుంచి తిరస్కరణ తప్పదు.

 పైపెచ్చు ఆ సభను అడ్డుకునేందుకు వైయస్సార్‌ సీపీ సానుభూతిపరులు కుట్ర చేస్తున్నారని అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అల్లర్లు సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది. రాష్ట్రంలో ఎన్నో రాజకీయ సభలు జరుగుతుంటాయి. రాజకీయ పార్టీల సభలు జరగడం సాధారణం. అందులో భాగంగానే మీ సభ కూడా జరుగుతుంది. దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఇదంతా చూస్తుంటే మీరే అల్లర్లు 
చేసుకుని, దాన్ని ప్రభుత్వంపై రుద్ది, మాపైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్నట్లుగా ఉంది.

 అమరావతి గురించి బీజేపీ నేతలు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల ముందు సాక్షాత్తూ ప్రధానమంత్రిగారే అమరావతి ఒక అవినీతికూపం అని, పోలవరం ప్రాజెక్ట్‌ ను  ఏటీఎం కార్డు అని 
వ్యాఖ్యలు చేశారు గుర్తులేదా? వాటిని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? ఇలాంటివాటిని సమర్థించేది లేదని చెప్పింది మీరే కదా? మీ రాజకీయ దురుద్దేశంతోనే, మీ స్టాండ్‌ మార్చుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు.

 ప్రాంతీయ అసమానతలు ఉండకూడదనే ఉద్దేశంతో 13 జిల్లాల అభివృద్ధే మా పార్టీ, ప్రభుత్వం స్టాండ్‌. రాబోయే తరాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలానే లక్ష్యంతో మేం వికేంద్రీకరణ చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం రేపు తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ. అందులో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆ సభకు వెళతారు. దానికీ, రాష్ట్ర ప్రజలందరి సభ అని ఎలా చెబుతారు...? ప్రజలు నవ్విపోతారు అని కూడా మీకు లేదా..

 చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు మేమే తెలివైనవాళ్లం.. ప్రజలు అమాయకులు అని అనుకుంటున్నారు. టీడీపీకి మద్దతుగా, ఆ పార్టీ నాయకత్వమే అధికారంలో ఉండాలనుకుంటున్న రెండు, మూడు టీవీ ఛానల్స్‌ ప్రసారం చేస్తున్న కథనాలను ప్రజలు నమ్ముతారనుకుంటే ఇవాళ వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చేదే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానల్స్‌... ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌గారి అందమైన బొమ్మలు చూపెట్టాయా? లేదే... అప్పుడేమి చూపించారో, ఎలా దూషించారో ఇప్పుడు అవే చూపిస్తున్నాయి. మీరు చేస్తున్నది ప్రజల కోసం కాదు. మీ వ్యాపారాల కోసం చేస్తున్న డ్రామా. మేము దాన్ని పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మీరు ఆడమన్నట్లు ఆడటానికి, గెంతమన్నట్లు గెంతలేం కదా. ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక విధానం, కార్యచరణ అనేది ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం, ప్రజల తాలూకా అభిమతం, మనోభావాలకు అనుగుణంగా మేము పని చేస్తున్నాం. 

 ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ అని పేరు పెట్టుకుని, తమ అభివృద్ధి కోసం పాదయాత్ర చేశారు. దేవస్థానం తిరుపతిలో ఉంది. మరి న్యాయస్థానం ఎక్కడుంది? హైకోర్టు ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళుతున్నామని అర్థమా? కోర్టు ఒక్కటుంటే సరిపోతుందా? ఇక్కడ నుంచి అక్కడకు వెళడమా? రాయలసీమ ప్రాంత ప్రజలను అన్యాయం చేయడానికి వెళుతూ...  "మీరు అభివృద్ధి చెందకూడదని ... అంతా మేమే 
దోచుకుతింటాం... " అనేలా చంద్రబాబు ఆలోచనలకు వత్తాసు పలుకుతూ ఆ ప్రాంతానికి వెళ్లి మీ బొమ్మలు చూపించడానికా? 

   రాయలసీమ పరిరక్షణ సమితి చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అమరావతి ఉద్యమం చంద్రబాబు అధికారం నుంచి దిగాక వచ్చింది. దానికి దీనికి పోలికేంటి? 

 తమ విధానాన్ని మార్చుకున్నామని, చంద్రబాబు నీతివంతుడు అని బీజేపీని ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వమనండి. ఆ తర్వాత మాట్లాడమనండి. ఇక పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీకి వత్తాసు పలుకుతున్న వారు, ఆ పార్టీకి చెందినవారే సభకు వస్తారు.

  కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీనే మేనిఫెస్టోలో చెప్పింది కదా..  ఇప్పటికైనా, టీడీపీ డొంకతిరుగుడు విధానంతో కాకుండా, వారి ఎజెండా ఏమిటో సూటిగా చెప్పేస్తే సరిపోతుంది కదా.

Back to Top