చంద్రబాబు భాష సంస్కారహీనం 

తిరుపతి ఎమ్మెల్యే భూమన  

తిరుపతి: అధికార దాహంతో సభ్య సమాజం తలదించుకునేలా సంస్కారహీనమైన భాషను మాట్లాడడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకే చెల్లిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. కర్నూలు పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన అసభ్య పదజాలం మానవజాతే తలదించుకునేలా ఉందని, 44 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన నేర్చుకున్నది ఇదేనా? అని ప్రశ్నించారు.

 భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తలంపుతో యువతను రెచ్చగొడుతూ, అసభ్య పదజాలంతో మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ‘ఇదే నా చివరి ఎన్నికలు, ఓట్లు వేసి గెలిపించండి, లేకుంటే మీరే నష్టపోతారు’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

మొరార్జీదేశాయ్‌ 90 ఏళ్ల పాటు రాజకీయాలు చేశారని, జయప్రకాష్‌ నారాయణ 85 ఏళ్లు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 83 ఏళ్లు, కరుణానిధి 93 ఏళ్ల పాటు రాజకీయాలు చేశారని, రాజకీయాలే నా వృత్తి, నా ప్రవృత్తి అని చెప్పుకొనే చంద్రబాబు 74 ఏళ్లకే చివరి ఎన్నికలు అని చెప్పుకొంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.     

Back to Top