తాడేపల్లి: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా లక్షణాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. నలుగురు విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు రావడంతో హుటాహుటిన కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది. విద్యార్థినుల ప్రాణాలతో ఆటలా అంటూ ట్వీట్ చేసింది. గతంలో ఇదే పాఠశాలలో పారిశుద్ధ్య లోపాల కారణంగా జాండిస్ వ్యాప్తి చెందగా, ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన విషాదం చోటుచేసుకుందని గుర్తుచేసింది. అప్పట్లో వందలాది మంది విద్యార్థినులు ఆసుపత్రిపాలయ్యారని పేర్కొంది. ఇప్పుడు మళ్లీ డయేరియా కేసులు వెలుగుచూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైయస్ఆర్‌సీపీ ఎక్స్‌లో పేర్కొంది. “విద్యార్థినుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా? గత తప్పుల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోదా?” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించింది. కురుపాం గురుకుల పాఠశాలలో వరుసగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని నిలదీసింది. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా చంద్రబాబు ? మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సూటి ప్రశ్న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా లక్షణాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం పట్ల మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అంటూ చంద్రబాబును ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, ఆహార పదార్థాల పరిశీలనపై కఠిన నియంత్రణలు అవసరమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.