మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన జగనన్న

ఆడవాళ్ల పట్ల వైయస్‌ జగన్‌కు ఉన్న గౌరవాన్ని నిరూపించుకున్నారు

మహిళాలోకం ముఖ్యమంత్రికి అండగా ఉంటుంది

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. ఏపీ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీలో కూడా మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వంపై కక్షగట్టిందన్నారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ విషయంలో రూల్స్‌కు విరుద్ధంగా తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందన్నారు. విశాఖలో నిర్వహించిన మహిళా పార్లమెంటరీ సమావేశానికి తనను రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో మహిళా అధికారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎక్కడైతే ఆడవాళ్లను గౌరవిస్తారో..అక్కడ దేవతలు సంచరిస్తారని నమ్మిన వైయస్‌ జగన్‌ ..ఆడవాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. డిప్యూటీ సీఎంగా గిరిజన మహిళకు అవకాశం కల్పించారన్నారు. ఆడవాళ్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని నిరూపించుకున్నారన్నారు. చంద్రబాబు ఎస్సీ,ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ ఎస్సీ మహిళలను ఇద్దరినిమంత్రులుగా చేశారన్నారు. సుచరిత, వనితలను మంత్రులుగా చేశారని గుర్తు చేశారు. వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారన్నారు. గత పార్టీలు ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. జగనన్న పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్కరిని కూడా మరిచిపోలేదన్నారు. అధికారం అన్నది అలంకారప్రాయం కాకుండా, ప్రజల కోసం కష్టపడే వారికి పదవులు ఇచ్చారన్నారు. ఇటీవలే అసెంబ్లీలో మహిళలకు నామినేటేడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. వైయస్‌ జగన్‌కు మేమంతా అండగా ఉంటామని, సీఎంకు మంచిపేరు తీసుకువస్తానమన్నారు. వాసిరెడ్డి పద్మకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా..

Back to Top