ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు తీర్చడానికే ఆప్కాస్

ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌
 

 తాడేపల్లి:   పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ప్రారంభించారని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌ అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా  ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)ను వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఆప్కాన్ ప్రారంభం ప‌ట్ల వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై  ప్రశంసలు కురిపించారు. 

ఈ సంద‌ర్భంగా జోగి ర‌మేష్ మాట్లాడుతూ..చంద్రబాబు పాలనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు లంచాలు ఇచ్చి ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఉద్యోగంలో చేరినా జీతాలు సమయానికి రాక తీవ్ర తీవ్ర కష్టాలు పడ్డారని అన్నారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వందల కోట్ల రూపాయలు తీనేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. అందులోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు.

అచ్చెన్నాయుడి దోపిడీలో బాబుల వాటా ఎంత‌?
రూ.151 కోట్ల అవినీతికి పాల్పడ్డ అచ్చెన్నాయుడిని అరెస్టే చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దోచుకున్న సొమ్ములో చంద్రబాబు, లోకేష్‌కు వాటా ఉందని ర‌మేష్ ప్ర‌శ్నించారు. బీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు అనడం విడ్డూరంగా ఉందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.  మచిలీపట్నంలో బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్ రావును హత్య చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మోకా భాస్కర్ రావు హత్యకు కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కొల్లు రవీంద్రను అరెస్టు చేయాలని జోగి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top