విజయవాడ: మహిళలను కించపరిచే విధంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ``ఇటీవల మీరు మూడు పెళ్ళిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ మీరు మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్‌కు గురైంది. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురుచూసింది. ఇన్నిరోజులైనా మీ మాటలపై మీలో మీ పశ్చాత్తాపం లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు మీ నుంచి క్షమాపణలూ లేవు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్ళిళ్లు చేసుకోవలసి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమే. "కోట్ల రూపాయలు భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. చేతనైతే మీరూ చేసుకోండి" అని మీరు అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారు..? కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూపోతే.. ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది..? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్ళిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా..? మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా..?? మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి "స్టెప్నీ" అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయం, మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారు. మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారు. మీ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచే మాటలు మీరు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీరు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మీకు ఈ నోటీసును జారీ చేస్తుంది`` అని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు.