అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టు లో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు ఆయనకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గత 10 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చు.. ప్రజలను కలుసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది. అలాగే, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో ఐదు వాహనాలకు మించి వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. అడ్డుకునేందుకు జేసీ కుట్ర టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రకు తెరతీశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.