అమరావతి: ‘రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూ దందా చేస్తోంది. రూ.లక్షల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణం చేపట్టి, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్చేసింది. ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని సామాజిక, ఆర్థిక, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనరులను కేంద్రీకృతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంపై గురువారం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్‌బాబు, ప్రజా సంఘాల ఐక్య వేదిక చైర్మన్ జేటీ రామారావు, రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పల్లవోలు వెంకారెడ్డి, ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ పి.అశోక్ కుమార్ తదితరులు మాట్లాడారు. ‘అమరావతి కోసం అంటూ 2015 నుంచే వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతి విస్తరణ పేరిట మరో 44 వేల ఎకరాలు పూలింగ్ చేపట్టడానికి యత్నిస్తుండటం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమే. ఒకసారి శంకుస్థాపన చేసి.. కొన్ని కట్టడాలు చేపట్టాక పునఃప్రారంభం అనడం హాస్యాస్పదం. అమరావతిలో, విశాఖలో విలువైన భూములను అస్మదీయ కంపెనీలకు కట్టబెడుతున్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నిర్ణయంలో సామాజిక సమగ్రత, ఆర్థిక నైతికత లేవు. మునిగిపోయే ప్రాంతంలో రూ.వేల కోట్ల ప్రజాధనం తెచ్చి గుమ్మరించడం భావ్యం కాదు. రాజధాని భూ సమీకరణ వెనుక భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇటు అమరావతిలో, అటు విశాఖలో భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు’ అంటూ వారు మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.