కర్నూలు: సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటన బాధాకరమని వైయస్ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం చంద్రబాబుకు ప్రజల ప్రాణాల విలువ తెలియడం లేదు. సింహాచలంలో నాసిరకంగా గోడ నిర్మించడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వ నేతలు ప్రతీ దాంట్లో దోచుకో..పంచుకో..తినుకో విధానంలో ముందుకు వెళ్తున్నారని, అందుకే తరచుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలు పోతాయనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని, అంత మంది భక్తులు మృత్యువాత పడితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారం లోకి వచ్చినా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటారని ఆక్షేపించారు. తిరుమల లో తొక్కిసలాటలో భక్తులు చనిపోతే సిట్ వేసి చేతులు దులుపుకున్నారని, నిజాలు నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు.