వికేంద్రీకరణపై మరింత అధ్యయనం తర్వాతే సరైన చట్టాన్ని తెస్తాం

 రాజధాని వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గ‌న‌

భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం

వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యం. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయ్‌

కేంద్ర సంస్థల్ని ఏ రాష్ట్రం ఎక్కడెక్కడ స్థాపించిందో వివరాలతో సహా వెల్లడి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలకూ భాగస్వామ్యం ఉండాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాలు 

భాషా ప్రాతిపదిక ఏర్పాటైన రాష్ట్రం మళ్లీ 2014లో రెండు భాగాలుగా విడిపోయింది

రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందాలి

తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత కేంద్రం శివరామకృష్ణగారితో కమిటీ వేసింది

విభజన వాదం రాకూడదంటే.. వికేంద్రీకరణ అవసరమన్న శివరామకృష్ణ నివేదిక 
 

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలి

రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాలన్న శ్రీకృష్ణకమిటీ 

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకూ న్యాయం జరగాలి

 అమ‌రావ‌తి: పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో మాట్లాడారు. 
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. బిల్లులకు సంబంధించి చర్చించుకునే ముందు రాష్ట్ర చరిత్ర పూర్వోత్తరాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో 
ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. 50 -60 ఏళ్లలో ఎన్నో సంఘటనలు జరిగాయి. మొట్టమొదట తెలుగు భాష మాట్లాడేవారి కోసం తెలుగు రాష్ట్రమనే డిమాండ్ వచ్చింది. ఎట్టకేలకు పొట్టిశ్రీరాముల 
త్యాగంతో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 1956లో తెలుగు మాట్లాడేవారంతా రాష్ట్రం కావాలని పలు ప్రాంతాల్లో డిమాండ్ చేసిన తర్వాత ఫజల్ కమిటీ ఏర్పాటైంది. మహారాష్ట్ర, తెలంగాణ, 
కర్నాటకలో తెలుగు ప్రాంతాలు కలిసి తెలుగు రాష్ట్రంగా అవతరించిన మాట అందరికీ తెల్సిందే. 

వందల ఏళ్లుగా తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం, ఒకే ప్రభుత్వమనే కోరిక
గత వంద సంవత్సరాలుగా తెలుగు భాష మాట్లాడే వారందరికీ కూడా ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం, ఒక పరిపాలన కావాలనే ఒక ఆశ, కోరిక ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన 
ప్రాంతాలైన నార్త్‌ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు సబ్‌ రీజనల్‌ ఆస్పిరేషన్స్‌తో ఉన్నాయి. తెలుగు భాష మాట్లాడేవారికి ఒక ప్రాంతం, ఒక పరిపాలన, ఒక 
రాష్ట్రం కావాలనుకునేవారు. ఎన్నో కారణాల వల్ల వెనకబడి ఉన్నాం కాబట్టి వారికి సంబంధించిన కొన్ని అవసరాలు ప్రభుత్వం తీర్చాలనే వాదన ఉండేది. 

ఏఏ ప్రాంతాలు ఎలా వచ్చాయ్‌?
తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌
రాయలసీమకు వచ్చి సీడెడ్‌ టెర్రెటరీ. 1800వ సంవత్సరంలో టిప్పుసుల్తాన్ బ్రిటిష్‌ వారికి సీడ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాంతం. అనంతపురం బళ్లారి జిల్లా నుంచి సగమైన ప్రాంతం. కర్నూలు, కడప 
జిల్లాలు ప్రత్యేకమైన జిల్లాలు. చిత్తూరు ఆర్కా్‌ట్‌ నుంచి వచ్చిన ప్రాంతం. నెల్లూరు ప్రత్యేకంగా వచ్చిన ప్రాంతం. నార్త్‌ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గంజాం నుంచి వచ్చిన ప్రాంతం. అదేవిధంగా కోస్టల్ ఆంధ్రా 
చూస్తే.. మొదటి నుంచి గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా ఓ ప్రాంతం. ఇటువైపు తెలంగాణ చూస్తే వారు నైజాం పాలన నుంచి వచ్చిన ప్రాంతం. ప్రతి ఒక్కరూ తెలుగు ప్రాంతం మాట్లాడుతూ..సబ్‌ 
రీజనల్ యాస్పిరేషన్‌. మా ప్రత్యేకమైన తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలోనే మాలోనే ప్రత్యేకత ఉంది. మా ప్రత్యేకతను గుర్తిస్తూ మా అభివృద్ధికి ఒక సమగ్రంగా పాలన ఉండాలనేది ఒక వాదన. 
ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమం రావటం ఆతర్వాత జై ఆంధ్రా ఉద్యమం రావటం జరిగింది. మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదిక ఏర్పాటైన తెలుగు 
రాష్ట్రం 2014లో రెండు భాగాలు అయింది. 

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణే మేలంది
అభివృద్ధి కేంద్రీకరించటమే విభజనకు మూలమైంది
తెలుగు భాష అనేది చూస్తే.. క్రీ.శ. 600లోనే ఆంధ్రులు అనేవారట. తెలుగు వారు అనేది తర్వాత వచ్చింది. తెలుగును గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పాండిచ్చేరి యానం ప్రాంతంలో 
మాట్లాడుతున్నారు. దేశంలో ఆరు క్లాసికల్‌ భాషల్లో ఒకటిగా తెలుగు ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 4వ స్థానంలో తెలుగుంది. భాషకు సంబంధించిన కీర్తి, గొప్పతనం ఇది. 
గత 60-70 ఏళ్ల చరిత్ర చూస్తే.. అనుభవాల నుంచి మనం నేర్చుకొన్నది, గమనించింది దాన్ని పరిపాలనలో వాడాల్సి ఉంది. తెలంగాణా  వాదన దశాబ్ధం క్రితం పుట్టినప్పుడు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని 
కేంద్రం వేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ జిల్లాల్లో చాలా విస్తృతంగా పర్యటించింది. వెనుకబడిన వారు వెనకబడినతనం వల్ల కాదు. చాలా గొప్పగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ప్రత్యేక రాష్ట్రం 
అనేది వచ్చింది. హైదరాబాద్ మహానగరంగా ఏర్పడింది. దీనివల్ల 60% ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతం అంటూ ఉంటే.. రెండు ప్రాంతాలున్నాయి. ఒకటి 
రాయలసీమ, రెండు నార్తల్‌ కోస్టల్‌ ఆంధ్ర అని జస్టిస్‌ శ్రీకృష్ణ చెప్పారు. కోస్టల్ ఆంధ్రాకు సరిసమానంగా తెలంగాణ ఉంది లేకపోతే కొంచెం తక్కువ ఉండొచ్చు ఈ రోజు తెలంగాణ వాదం 
వెనుకబడినతనం వల్ల కాదు గానీ.. హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా ఏర్పడినదానివల్ల వేర్పాటువాదమని శ్రీకృష్ణ కమిటీ సారాంశం. ఇది కూడా ఈరోజు కానీ, భవిష్యత్‌ కోసం గుర్తు 
పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

విభజన చట్ట ప్రకారం శివరామకృష్ణన్‌ కమిటీ
టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారస్తులతో కమిటీ వేస్తే నేడు మంత్రులతో హైపవర్ కమిటీ
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్ట పరంగా ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో భాగంగా శివరామకృష్ణన్‌ గారి చేత ఒక కమిటీ వేశారు. అర్బన్ డెవలప్‌మెంట్‌, టౌన్‌ ప్లానింగ్‌లో 
నలుగురు నిపుణులతో శివరామకృష్ణన్‌ రిపోర్టు తయారు చేశారు. రిపోర్టు అందజేసిన కొద్ది నెలల తర్వాత క్యాన్సర్‌తో చనిపోయారు. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా 10 జిల్లాలు 
పర్యటించారు. ఎంతో శ్రద్ధతో శివరామకృష్ణన్‌ రిపోర్టు తయారు చేశారు. దేశమంతా శివరామకృష్ణన్‌ గొప్ప వ్యక్తి అని గుర్తించింది. ఆయన అందజేసిన రిపోర్టు ఎంతో విలువైనది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర 
రాజధాన్ని ఎంపిక చేసే బాధ్యతను శివరామకృష్ణన్‌కు అప్పజెప్పారు. ఆయన ఏ ప్రాంతాన్ని సూచించకపోయినా రాష్ట్రానికి వికేంద్రీకరణ ఎంతో అవసరమని పలు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాలో 
రిపోర్టులో సూచించారు. గుంటూరు, తెనాలి మూడు పంటలు పండే భూమి.. విపరీతమైన ధర కలిగిన భూమి. చాలా కాస్ట్‌లీ భూమిని అనవసరమైన వాటికి వృధా చేయవద్దు. దీంతో పాటు పరిపాలన 
వికేంద్రీకరణ చేయాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు వంటి చేదు అనుభవం ఉండకూడదని రిపోర్టులో శివరామకృష్ణన్ సూచించారు. 

హైదరాబాద్‌ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతం వల్లనే విభజన వాదం తెరపైకి
ఇతర రాష్ట్రాలను చూసి నేర్చువాల్సింది ఎంతో..
కేంద్ర సంస్థలను ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ స్థాపించారంటే..
ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించిన సంస్థలు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. కేంద్ర సంస్థల యాగ్జిలరీ యూనిట్స్ ద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెందేవి. బీహెచ్‌ఈఎల్ గొప్ప 
సంస్థ. ఈ బీహెచ్‌ఈఎల్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు హైదరాబాద్‌లో పెట్టడం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌కు ఇస్తే హరిద్వార్‌లో పెట్టడం జరిగింది. కొండ ప్రాంతంలోకి ప్రైవేటు సంస్థలు పెట్టవు. ప్రభుత్వ రంగ 
సంస్థ వస్తే ప్రైవేటు సంస్థలూ వస్తాయని పెట్టారు. తమిళనాడులోనూ ట్రిచ్చిలో పెట్టారు. అక్కడ సేలం అభివృద్ధి చెందడానికీ ఇదీ ఓ కారణం. హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ సంస్థకు ఇస్తే హైదరాబాద్‌లో 
పెట్టడం జరిగింది. ఇదే సంస్థను ఒరిస్సాకు ఇస్తే కోరాపూట్‌లో పెట్టడం జరిగింది. కోరాపూట్‌లో పెట్టడం వల్ల ఇతర సంస్థలు వస్తాయని పెట్టడం జరిగింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ను మహారాష్ట్రకు 
ఇస్తే వాళ్లు ముంబై, పూణే, నాగ్‌పూర్‌లో పెట్టలేదు. నాసిక్‌లో పెట్టారు. ఇదే విధంగా నాసిక్ అభివృద్ధి చెందాలని. మహారాష్ట్ర చూస్తే.. షోలాపూర్ టెక్స్‌టైల్స్, కొల్లాపూర్ ఫౌండ్రీలు, అహ్మద్ నగర్ 
ఆటోమొబైల్‌ సంస్థలు,  పూణే చూస్తే ఆటోమొబైల్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ముంబై కాస్మొపాటిన్‌ మహానగరం. మనలాగా ఒకే ప్రాంతం ఒక స్థలం అని మహారాష్ట్ర అనుకున్నట్లైతే గొప్ప రాష్ట్రం అయ్యేది 
కాదు. తమిళనాడు పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు. కర్నాటక పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు. ఇవన్నీ మనం నేర్చుకొని.. అనుభవాలను గమనించాలి. ఐడీపీఎల్‌లో హైదరాబాద్‌ దేశంలోనే పెద్ద స్థానంలో 
ఉంది. ఐడీపీఎల్‌ పూర్వ ఉద్యోగుల వల్లనే హైదరాబాద్‌లో వివిధ ఫార్మసీ సంస్థలు ఏర్పాటయ్యాయి. స్టాండర్డ్ ఆర్గానిక్స్‌తో స్టార్ట్ అయి రెడ్డీ ల్యాబ్స్ అయింది. మనకు కేంద్రం ఐడీపీఎల్‌ ఇస్తే.. 
హైదరాబాద్‌లో పెట్టుకుంటే.. బీహార్‌కు ఇస్తే.. ముజఫర్‌పూర్‌లో పెట్టుకోవటం జరిగింది. లక్నో, అలహాబాద్‌లో పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌కు ఐడీపీఎల్‌ ఇస్తే..కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్‌లో పెట్టడం 
జరిగింది. హెచ్‌ఎంటీ-హిందూస్తాన్ మెషీన్ టూల్స్, బీడీఎల్‌-భారత్‌ డైనిమిక్స్‌ లిమిటెడ్‌, ఈసీఐఎల్-ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ - మిథాని, (డిఫెన్స్‌ 
ఎక్విప్‌మెంట్), ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్‌సీ, ఎన్‌ఎండీసీ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఎఫ్‌డీపీ, డీఎంఆర్‌ఎల్, హెచ్‌సీఎల్‌, బీఎల్‌ఆర్‌ఎల్, ఐఐసీటీ, సీసీఎంబీ, డీఆర్‌డీఓ అన్నీ తీసుకువెళ్లి హైదరాబాద్‌లో పెట్టడం వల్ల గొప్ప 
నగరం అయింది. కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గొప్పనగరం అయింది. కానీ, మిగతా రాష్ట్రం అంతా ఏమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక మాదిరిగా పెరగలేదు. ఈరోజు ఆ అనుభవాల నుంచి మనం 
నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు రంగ సంస్థలు 90% హైదరాబాద్‌కు రావటానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటవ్వటమే. 

ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ విలువ రూ.500 కోట్లైతే హైదరాబాద్‌లోనే రూ.56000 కోట్లు
హైదరాబాద్ నగరం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అనుబంధ సంస్థలు ఏర్పాటయ్యాయి. సాఫ్ట్‌వేర్‌కు సీఎంసీ కంప్యూటర్స్‌, హెచ్‌సీఈఎల్‌ రావటంతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌ అయింది. 2013-14లో 
విభజన నాటికి రూ.56,500 కోట్లు సాఫ్ట్‌వేర్‌ రంగం ఉంది. ఇందులో ఇతర రాష్ట్రం రూ.500 కోట్లు మాత్రమే. అంటే.. రూ.56వేల కోట్లు హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ వాణిజ్యం జరుగుతోంది. ఐఐటీ, 
ఐఎస్‌బీ, బిట్స్, టిస్‌ వంటి అత్యున్నత విద్యా సంస్థలను తీసుకువెళ్లి హైదరాబాద్‌లోనే పెట్టడం జరిగింది. అన్నీ ఒక్కచోటనే పెట్టడం వల్ల వేర్పాటు వాదం ప్రారంభమైందని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు. 
దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో 60శాతం రిసోర్స్‌ హైదరాబాద్‌ నుంచి వస్తే.. మిగతా రాష్ట్రం 40% నుంచి వచ్చాయి. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరించటం వల్లనే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు 
వెనకపడ్డాయని జస్టిస్‌ శ్రీకృష్ణ చెప్పారు. 

విభజన తర్వాత కూడా అభివృద్ధి కేంద్రీకృతమా?
ముంబై కంటే బాహుబలిలా అమరావతి ఏర్పాటా?
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఇదే బాటలో మొదలుపెట్టారు. ఇంత అనుభవం పెట్టుకొని ఇదే బాటలో వెళ్లారు. శివరామకృష్ణన్‌ గారి రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా 
చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లాలా శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. విజయనగరం జిల్లా గుంటూరుతో సమానంగా ఉండాలి. చిత్తూరు నెల్లూరుతో సమానంగా ఉండాలనే ఆలోచన 
ఏ పాలకులకైనా ఆటోమ్యాటిక్‌గా వస్తుంది. చంద్రబాబు మాత్రం రాలేదు. 7500 చ.కి.మీ కేపిటల్‌ ఏరియా పెట్టారు. బాంబే గమనిస్తే థానే, కళ్యాణ్‌, నవీ ముంబై, ఉల్లాస్‌ నగర్, మీరా గమనిస్తే 4500 
చ.కి.మీ మాత్రమే. బాహుబలి మాదిరిగా ఒక సినిమాలో కేపిటల్ 7500 చ.కి.మీ పెట్టారు. రాజధాని అభివృద్ధి చెందదట. కానీ, వీళ్లే (టీడీపీ ప్రభుత్వం) అభివృద్ధి చేస్తారట. 2014 విభజన జరిగేసరికి 
రెవిన్యూలోటు ఉందని ప్రతిరోజూ చంద్రబాబు చెప్పేవారు. రెవిన్యూలోటు ఉండి.. జీతభత్యాలకు ఇబ్బంది ఉండి.. ఐదేళ్లలో ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ లేదు. 

రాజధానిపై నిపుణుల కమిటీ ఏర్పాటు
2019లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దురదృష్టవశాత్తూ వాళ్లు ఇచ్చిన అప్పులు, రెవిన్యూలేని పాలనతో పాటు రెండేళ్ల నుంచి కోవిడ్‌తో అల్లాడుతున్నాం. అయితే వాళ్లు (టీడీపీ) రాజధాన్ని 
అభివృద్ధి చేసేవారట. బాంబేకి రెండింతలు నగరాన్ని కడతారంట. అసలు బాంబే చరిత్ర చూస్తే.. 33వేల ఎకరాలు అమాయకులతో తీసుకున్నది గాక, 50 వేల ఎకరాల అరణ్య భూమిని వాడకానికి 
తెచ్చుకుంటామని ప్రపోజల్ పెట్టారు. భవిష్యత్‌ గురించి ఏమీ ఆలోచించకుండా చేశారు. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్ గారు ఎక్స్‌ఫర్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. వారి 
ప్లాన్స్‌ రివ్యూ చేసి.. ఒక పద్ధతి మార్గంలో ముందుకు తీసుకువెళ్లటానికి ఒక నివేదిక ఇవ్వమని కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్‌ (డీన్ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌), డాక్టర్ అంజలీ మోహన్, 
శివానంద స్వామి, సీపీటీ-అహ్మదాబాద్‌, కే.టీ.రవీంద్రన్, రిటైర్డ్‌ డీన్‌ ఆఫ్‌ ఢిల్లీ స్కూల్ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, డాక్టర్ కె.వి.అరుణాచలం, రిటైర్డ్ చీఫ్‌ అర్బన్ ప్లానింగ్-చెన్నైతో నిపుణుల బృందం పెట్టడం 
జరిగింది. టీడీపీ వాళ్లేమో ఐదు మంది వ్యాపారస్తులను పెట్టారు. వారి పేర్లు చెబితే బావుండదు. ఒకరు విత్తనాలు, ఒకరు రియల్‌ ఎస్టేట్, పరిశ్రమలు, సినిమా పెట్టేవారితో ప్లానింగ్ ప్రకారం చేశారు. 

రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందాలి
ప్రభుత్వానికి నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపును కూడా అధ్యయం చేయమని కోరటం జరిగింది. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి. శ్రీకాకుళంలో మారుమూల 
గ్రామంలోని రైతు కూడా బావుండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. బోస్టన్ గ్రూపులో అంశాలు చూస్తే.. 50వేల ఎకరాలు కడతారట. దానికి రోడ్లు, కాల్వలకే తక్కువలో తక్కువ లక్ష కోట్లు అవుతాయి. 
ఇది ప్రభుత్వం చేయగల పనేనా? బోస్టన్ కన్సల్టింగ్‌ రిపోర్టు ఇచ్చిన తర్వాత హైపవర్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. టీడీపీ ప్రభుత్వం వ్యాపారస్తుల్ని పెడితే.. శ్రీ జగన్ గారు మాత్రం మంత్రులతో 
హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. వికేంద్రీకరణ మస్ట్. జస్టిస్ శ్రీకృష్ణ, శివరామకృష్ణ, ప్రపంచంలో అందరూ ఆలోచిస్తున్నది కరెక్టు అని తేలింది. చంద్రబాబు ఆలోచిస్తున్నది తప్పని తేలింది. తర్వాత 
వికేంద్రీకరణలో భాగంగా..  ఒక లోకల్‌ జోన్లు పెట్టి, బోర్డులు పెట్టి ఉత్తరకోస్తా, కోస్తాంధ్ర, రాయలసీమ డెవలప్‌మెంట్ చేస్తూ.. రాజ్యాంగ సంస్థలైన శాసనసభ ఈ ప్రాంతంలో ఉండాలని, సచివాలయం 
విశాఖలో ఉండాలని ప్రభుత్వం అనుకుంది. విశాఖ పెద్ద నగరం. దాన్ని కొంత ప్రోత్సహిస్తే ఈస్ట్‌ కోస్ట్‌లోనే పెద్ద నగరం అవుతుంది. శ్రీభాగ్ ఒప్పందాలు ప్రకారం.. రాయలసీమలో హైకోర్టు అని 
నిర్ణయించటం జరిగింది. ఈరోజు అది తప్పు పడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అన్నిచోట్లు అందరం కలవాలి. సంవత్సరంలో ఇక్కడ అసెంబ్లీ నడుపుకుందాం. అవసరమైనప్పుడు 
గవర్నమెంట్ పరిపాలన విశాఖలో ఉంటుంది. 1937లోనే హైకోర్టు కర్నూలుగా నిర్ణయించబడింది. మన కాలనీల్లో ఉండే చిన్న దుకాణం మారిస్తే ఒప్పుకుంటారా? కర్నూలు వారు.. హైదరాబాద్‌కు 
రాజధాని మారిస్తే ఆనాడు ఒప్పుకున్నారు. 

భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం
అందుకే.. చట్టాలను రద్దు చేస్తున్నాం
ఏపీసీఆర్‌డీఏ యాక్ట్‌ను మనం అమరావతి మెట్రోపాలిటిన్ రీజన్ ఏరియాగా మార్చటం జరిగింది. జోన్లు, ప్రాంతాలు, నగరాలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవటం 
జరిగింది. అయితే ప్రధానంగా రాజకీయాల వల్ల ప్రాంతీయతత్వం కొంతమందిలో రెచ్చగొట్టారు. ఈ ప్రభుత్వం మీద, సీఎం మీద సంపూర్ణ నమ్మకం ఉండటంతో వేరే సబ్జెక్ట్ లేక అమాయకుల్ని 
రెచ్చగొడుతూ.. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వస్తూ.. నటిస్తున్నారు. టీవీ చూసినా, ప్రజలు ఎవరైనా అక్కడకి వెళ్లి గమనించినా చెబుతారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. 
ఎవరెవరైతే.. ఒకశాతమో, రెండు శాతమో.. వీరి ప్రలోభాలకు లోనైతే.. వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతాం. హేతుబద్ధతో సమాధానం చెబుతాం. పాలసీపై ఒకటికి, రెండు శాతం మందితో చర్చించి 
నిర్ణయం తీసుకుంటాం. పాత అనుభవాలు ఉండకూడదు. ప్రతి ఒక్క రీజియన్ సంతోషంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎంతో ఉదారత్వంతో చట్టాల్ని రద్దు చేస్తున్నామని శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ 
ప్రకటించారు. కొద్దిగో, గొప్పో ప్రశ్నలకు సమాధానం చెప్పి ఒక మార్గం అనుకున్నామో.. వాటి మార్గంలో వికేంద్రీకరణ ప్రాధాన్యం ఇస్తూ.. అన్ని ప్రాంతాల వారు భాగస్వామ్యలయ్యేలా చేసి.. రాష్ట్రాన్ని ఒక 
మంచి డైరెక్షన్‌లో ముందుకు తీసుకువెళ్లాలని తక్షణమే పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. సభ ద్వారా రాష్ట్ర ప్రజలు 
అందరూ అర్థం చేసుకుంటారని నమ్మకం ఉందని శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

Back to Top