అమరావతి: ఉత్తరాంధ్రకు ‘జావద్’ తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమీక్షలో.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ అధికారులను దేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుపాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్ సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.