14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బాబు రాయలసీమకు ఏం చేశారు? 

 మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి  
 
 రాయలసీమకు, రైతుకు ఎవరు న్యాయం చేశారో కమ్మభవన్ లో సదస్సు పెట్టే ముందే టీడీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుండేది. 

 రాయలసీమకు టీడీపీ చేసిన ద్రోహం రైతులు ఎప్పటికీ మరచిపోరు. 
 
టీడీపీ హాయంలో ప్రాజెక్టుల పేరుతో నిధులు భోంచేశారు 

 9 ఏళ్ళలో హంద్రీ-నీవాకు బాబు ఖర్చు చేసింది రూ. 9 కోట్లే. 
 
హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసింది బాబు కాదా..? 

 2004లో డా. వైయస్ఆర్ సీఎం కాకపోయిఉంటే సీమకు చుక్కనీరు వచ్చేది కాదు 

  ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి దోచుకున్నది మీరు కాదా..? 

 రైతు బాగుండాలని కోరుకునేది ఒక్క వైయస్ కుటుంబమే. 

  చిన్న నీటి గుంటలకు జలహారతులు ఇచ్చి, రెయిన్ గన్ లతో బాబు ఎలా మోసం చేశాడో సీమ ప్రజలు మరిచిపోరు 

అనంత‌పురం:  14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌కు ఏం చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు నిల‌దీశారు. దేశంలోనే అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా పథకానికి రాయలసీమకు చెందిన చంద్రబాబే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి హంద్రీ-నీవా కోసం కేవలం రూ. 9 కోట్లు ఖర్చు పెట్టాడు. అదికూడా సాగు నీటి పథకంగా ఉన్న హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబు. ఈరోజు మాట్లాడిన నాయకులంతా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి, ఆనాడు మీరంతా ఏం గడ్డిపీకారు. రాయలసీమ ప్రాంతంపై మీకు ఎందుకు చిత్తశుద్ధి లేద‌ని మండిప‌డ్డారు. శ‌నివారం  అనంతపురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.

 చంద్రబాబు పచ్చి రైతు వ్యతిరేకి: మంత్రి శంకరనారాయణ 
  అనంతపురంలోని కమ్మ భవన్ ఫంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది నాయకులు.. ఆ పార్టీకే చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి భాషలో చెప్పాలంటే టీడీపీ నిరుద్యోగులు రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో ఒక సదస్సు ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, సీమ రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఎక్కడుంది..?

 తెలుగుదేశం పార్టీ దద్దమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. 1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకుని 2004 వరకు అంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్దే మీరు అంతా పనిచేశారు, ఏనాడైనా రాయలసీమ ప్రాజెక్టుల గురించి అడిగారా...? అదేవిధంగా 2014లో మళ్ళీ మోడీ దయాదాక్షిణ్యాల వల్ల మరో 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. అంటే మొత్తం 14 ఏళ్ళ మీ పరిపాలనలో రాయలసీమ సాగునీటి, తాగు నీటి ప్రాజెక్టులు, ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పనులు ఏమైనా చేశారా..? ఆ 14 ఏళ్ళు మీ  పార్టీ నాయకుడిని, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయారు...? 

 వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక.. కరువు జిల్లా అనంతపురానికి నీళ్ళు ఇచ్చేందుకు రూ. 6 వేల కోట్లకు పైగా అంచనాలతో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు డీపీఆర్ లు తయారు చేయించి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 90 శాతం పనులు పూర్తి చేశారు. వైయస్ఆర్ గారు 2004లో ముఖ్యమంత్రి కాకుంటే.. అనంతపురం, రాయలసీమ జిల్లాలకు, ఆఖరికి కుప్పం నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు. ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వైయస్ఆర్ గారు పనులు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం ప్రాజెక్టులకు సంబందించి 5-10 శాతం పనులు పూర్తి చేసి, రంగులేసి, గేట్లు ఎత్తి లస్కర్ ఉద్యోగం చేసి,  తామే పూర్తి చేశామని డప్పాలు కొట్టుకున్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను దోచుకున్నది టీడీపీ నేతలు కాదా..?

  చంద్రబాబుకు రైతుల పట్ల మంచి అభిప్రాయం ఎప్పుడూ లేదు. వ్యవసాయాన్ని దండగ చేయాలనుకున్నాడు తప్పితే.. ఏనాడూ పండగ చేయాలని అనుకులేదు. ఒక రైతు బిడ్డగా, కరువు ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా, మహానేత వైయస్ఆర్ గారు సీమ రైతాంగానికి అనేక మేళ్ళు చేశారు. రైతు బాగుండాలని కోరుకునే కుటుంబం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వైయస్ఆర్ ఫ్యామిలీ అని గర్వంగా చెబుతున్నాం. 

  కమ్మ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసుకోకముందే టీడీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. పెనుగొండ నియోజకవర్గంలో చంద్రబాబు చిన్న గుంటకు నీళ్ళు ఇచ్చి జలహారతిలు చేశాడు. రెయిన్ గన్ లతో రైతులను ఎలా మోసం చేశారో ఈ ప్రాంత ప్రజలు మరిచిపోలేదు. చంద్రబాబు పచ్చి రైతు వ్యతిరేకి. ఎంతసేపటికీ పచ్చ చొక్కాల జేబులు నింపాలని ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి. 

  హంద్రీ-నీవా సామర్థ్యాన్ని పెంచి, 6300 క్యూసెక్కులు నీటిని తరలించేందుకు అనుమతులు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 
- రైతులకు, రాయలసీమకు ఎవరు న్యాయం చేశారో.. టీడీపీ నేతలు గుండె మీద చేయివేసుకుని మాట్లాడాలి. రైతు సంక్షేమం కోసం ఈరోజు జగనన్న ప్రభుత్వం చేస్తున్న పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుది. ఈ విషయాన్ని ప్రధాని మోడీనే స్వయంగా చెప్పారు. మీరు ఇంకా పనిగట్టుకుని ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేస్తే.. మీకు ఇక రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు అన్నది తెలుసుకోవాలి. 

 తెలుగుదేశం పార్టీకి ప్రజలకు దూరం పెరిగింది. రైతులు, యువత, మహిళలు.. ఎవరూ ఆ పార్టీ వైపు చూడటం లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాలో 300 పైగా చెరువులకు నీళ్ళు ఇచ్చాం. అనంతపురం నుంచి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చాం. అనంతపురం జిల్లాలో చిట్టచివరి ప్రాంతమైన మడకశిరకు నీళ్ళు తీసుకువెళ్ళటం జరిగింది. రాయలసీమ టీడీపీ నేతలు దేని గురించి మీరు పోరాడుతున్నారు..?. మీ పార్టీ ఉనికి కోసం, మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నందుకు, మీ రాజకీయ స్వార్థం కోసం, మిమ్మల్ని మరిచిపోతారన్న బాధతో, దుగ్ధతో ఇటువంటి బూటకపు మీటింగులు పెట్టుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఈ రాష్ట్రానికి మీరు చేసిన మంచి ఏమిటో చెప్పండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు దోచుకున్నదెంత. అమరావతి రాజధాని పేరుతో మీరు ఎంత దోచుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా, జన్మభూమి కమిటీల అవినీతి లేకుండా నేరుగా ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.

 బాబు ఎప్పుడు సీఎం అయినా దుర్భిక్షమే: ఎంపీ మాధవ్ 
 రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ సదస్సును కమ్మ భవన్ లో జరుపుతారా..? అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ నిల‌దీశారు.  టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డే రాయలసీమ టీడీపీ నేతల సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటో చెప్పాక, మేం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. మళ్ళీ టీవీల్లో, పత్రికల్లో కనిపించేందుకు, ఉనికిని చాటుకునేందుకు రాయలసీమ పేరుతో సదస్సు పెట్టారు. టీడీపీ సదస్సు ప్రజలలో అపహాస్యమైంది. 

  కరువు జిల్లా అనంతపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, రాప్తాడు నియోజకవర్గంలో 4 రిజర్వాయర్లు, కళ్యాణ దుర్గంలో ఒక రిజర్వాయర్, ధర్మవరంలో ఒక రిజర్వాయర్, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో చెరువులను నింపే కార్యక్రమం చేస్తున్నాం. పుట్టపర్తిలో రూ. వెయ్యి కోట్లతో 193 చెరువులను ఏకంగా నిర్మించే కార్యక్రమం చేపడుతున్నాం. వీటికి సంబంధించి జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. 

 చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా.. రాష్ట్రంలో వర్షాలు ఆగిపోతాయి, రిజర్వాయులు, డ్యాములు ఎండిపోతాయి, ఎక్కడ చూసినా దుర్భిక్షం తాండవిస్తుంది. అన్నం పెట్టే రైతులు అన్నమో రామచంద్రా అంటూ వలసలు పోతారు. పశువులు కబేళాలకు వెళతాయి. 
- జగనన్న ప్రభుత్వంలో ఈరోజు ఎక్కడ చూసినా వాగులు, వంకలు పారుతున్నాయి. డ్యాములు నిండాయి. జలకళ సంతరించుకుంది. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. 
- రాయలసీమ జిల్లాలకు చెందిన పార్టీ సదస్సును కమ్మ భవన్ లో జరుపుతారా..  ఆ పార్టీలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆలోచించాలి. 

  పరిశ్రమలు పెట్టడానికి ఎవరు వచ్చినా, ఈ ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. టీడీపీ నేతల విష ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. 

 రాయలసీమ ప్రాజెక్టులపై విషం కక్కుతున్నది టీడీపీ నేతలే: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 
 రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ప్రాజెక్టుల సదస్సు పేరుతో 3 గంటలపాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారిని విమర్శించే కార్యక్రమం చేశారు. వాళ్ళు పోరాడుతున్నది ఆ పార్టీ ఉనికి కోసం తప్పితే.. రాయలసీమ ప్రాజెక్టుల కోసం కాదు. 

 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఏమీ చేయకుండా, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, 18-19 ప్రాజెక్టులు చేపట్టాలని టీడీపీ సదస్సులో ఈరోజు తీర్మానాలు చేశారు. మీరు ఇంతకాలం ఏం చేశారు..?. మహానేత వైయస్ఆర్ గారి కృషి వల్లే రాయలసీమకు ప్రాజెక్టులు వచ్చాయి అన్నది అందరికీ తెలుసు. వైయస్ఆర్ గారు హంద్రీ-నీవా మొదటి దశ 95 శాతం, రెండో దశ 70 శాతం పూర్తి, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేశారు. వైయస్ఆర్ గారి మరణం తర్వాత, మిగిలి ఉన్న అరకొర పనులకు 200-300 రెట్లు అంచనాలు పెంచుకుని భోంజేసే కార్యక్రమం చేశారు. హంద్రీ-నీవాను సాగు నీటి నుంచి తాగు నీటి ప్రాజెక్టుగా మార్చింది చంద్రబాబు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వకూడదని దేవినేని ఉమ ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేశారు. 

  ప్రాజెక్టులపైన టీడీపీకి ఏనాడు చిత్తశుద్ధి లేదు. రాయలసీమకు నీళ్ళు రావాలని ఏనాడూ చిత్తశుద్ధితో ప్రయత్నించిందిలేదు.  ప్రాజెక్టుల పేరుతో ధనం ప్రవహింపజేశారు గానీ.. ఏనాడూ నీళ్ళు పారించలేదు.  రాయలసీమ లిఫ్ట్ ద్వారా కృష్ణా నీటిని దోచుకుపోతున్నారని, పొరుగు రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్ విమర్శలు చేస్తే.. టీడీపీ నేతలు ఎక్కడైనా మాట్లాడారా..?. పైగా టీడీపీకి చెందిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి దగ్గరకు పంపించి, రాయలసీమ లిఫ్ట్ నిర్మిస్తే.. మాకు నీళ్ళు రావని ఆపాలని చూస్తున్నారు. చంద్రబాబుది, టీడీపీది ఎప్పుడూ రెండు నాల్కల ధోరణే. 

 ఈరోజు  అనంతపురం జిల్లాలోనే 300 చెరువులకు నీళ్ళు ఇస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్.. తెలుగు గంగ, ఎస్ఆర్ బీసీ కాలువలు వెడల్పు చేస్తున్నాం.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేం ఇవన్నీ చేస్తున్నాం. హంద్రీ-నీవా సామర్థ్యం 6300 క్యూసెక్కులకు పెంచుతూ అడ్మినిస్ట్రేషన్ అప్రువల్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఈరోజు టీడీపీ సదస్సులు పెడుతుంది. నేతన్న హస్తం ఇస్తుంటే.. నేతన్నలను రెచ్చగొడతారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తుంటే.. దానికి నాలుగు రోజుల ముందు వారిని రెచ్చగొడతారు. ఇలా ప్రతిదీ రాజకీయం చేయడమే టీడీపీ కార్యక్రమంగా పెట్టుకుంది. 

 రాయలసీమ రౌడీలు, కడప గూండాలు, అభివృద్ధిని సీమకు దోచుకుపోతున్నారని.. ఆంధ్రాలో ఒక మాట, ఉత్తరాంధ్రలో మరో మాట.. ఇలా రెండు నాల్కల ధోరణితో టీడీపీ ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని అవమానపరుస్తూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు వైయస్ఆర్ గారి కల. ఆయన శంఖుస్థాపన చేసి, అన్ని అనుమతులు తెచ్చారు.రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు పూర్తి చేయబోతున్నారు. రాయలసీమ ప్రాంతానికి హక్కుగా నీటిని తీసుకురాబోతున్నాం. టీడీపీ హయాంలో పట్టిసీమ అన్నారు, డబ్బులు అయితే అక్కడ ప్రవహించింది గానీ, నాలుగు పంపులు పెట్టి ఏం సాధించారు...? రాయలసీమ వాటా కోసం మీరు తెస్తామన్న నికర జలాలు ఎక్కడ..? టీడీపీలో అంతా మాటల మల్లన్నగాళ్ళే. 

 చంద్రబాబు ఇన్నేళ్ళు అధికారంలో ఉండి కూడా కుప్పంకు నీళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు. కండలేరు జలాశయం నుంచి పశ్చిమ చిత్తూరు జిల్లాకు  రూ. 4200 కోట్ల హడ్కో రుణంతో ఒక ప్రాజెక్టును రూపకల్పన చేస్తే, ఆ పార్టీకే చెందిన సోమిరెడ్డి వ్యతిరేకించాడని నిలిపివేశారు. సొంత జిల్లాకు నీళ్ళు తేలేని చేతగాని చవట, దద్దమ్మ చంద్రబాబు. బాబు చెబితే.. ఈరోజు అనంతపురం టీడీపీ నేతలు తోకలు ఆడించుకుంటూ మాట్లాడటమా.. ?

  వైయస్ఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టులను జగన్ గారు పూర్తి చేస్తూ, ఆ ఫలాలను రాష్ట్ర రైతాంగానికి, రాయలసీమ రైతులను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలు రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి చేసిన రూ. 2 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారు, ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా...? ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారు.. రూ. 1.5 లక్షల కోట్లు పేదవాడి బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా జమ చేస్తున్నారు. 

  రాయలసీమకు జలకళను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారు ప్రయత్నిస్తుంటే.. తెలంగాణ టిఆర్ఎస్ నేతలతో టీడీపీ నేతలు గొంతులు కలిపి మాట్లాడుతున్నారు.  ఇదేనా టీడీపీ చిత్తశుద్ధి..? టీడీపీ విధానం ఎలా ఉందంటే.."నాకు దక్కనిది.. ఎవరికీ దక్కకూడదన్నట్టు"గా వ్యవహరిస్తుంది. రాయలసీమ రైతులు ఇంకా దుర్భిక్షంతోనే నరకయాతన అనుభవించాలన్న శాడిజంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నార‌ని ప్ర‌శాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top