ఏపీలో తారాస్థాయికి కక్షసాధింపు రాజకీయాలు

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై అనంత వెంకటరామిరెడ్డి 

అనంతపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షసాధింపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంపై ఆయన స్పందించారు. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి స్టేట్‌మెంట్లు తీసుకుని అక్రమ కేసులో మిథున్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలతో సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడంతోనే వైయ‌స్ఆర్‌సీపీలోని కీలక నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19లో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై దాదాపు 13 అవినీతి కేసులు ఉన్నాయని, ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైందన్నారు. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు నేడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. 2014–19 మధ్య లిక్కర్‌ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అలాంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిపై కక్షసాధింపుతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఒక్క బెల్ట్‌ షాపు లేదని, ప్రభుత్వమే పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించిందన్నారు. కానీ నేడు ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయని, ప్రజాప్రతినిధులు మద్యం మాఫియా చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డి వైఎస్‌ జగన్‌కు సన్నిహితంగా ఉంటారని, అందుకే ఆయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. చంద్రబాబు చర్యలకు తప్పకుండా భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిట్‌ కట్టుకథలతో అల్లుతున్న మద్యం అక్రమ కేసు న్యాయస్థానాల్లో నిలబడదని తెలిపారు. 

 

Back to Top