అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్ చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టిలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి తనకు మండలి సభ్యత్వం ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి సముచిత స్ధానం కల్పించే వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని కొనియాడారు. సీఎం వైయస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. అనంతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్‌సీపీ మరింత బలపడుతుందని అన్నారు. కష్టానికి నష్టానికి ఓర్చుకున్న వ్యక్తి అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. సీఎం వైయస్ జగన్ అనంతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు.