కూటమి ప్రభుత్వ అరాచకం..అక్రమ కేసులు

వైయస్ఆర్‌సీపీ నేతల ధ్వజం

గుంటూరు జైల్లో ఉన్న వైయస్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, పానుగంటి చైతన్యను పరామర్శించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని)

పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం

మా కార్యకర్తలను కలుస్తాం. మంచి చెడులు ఆరా తీస్తాం

పోలీసులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదు  

వైయస్ఆర్‌సీపీ నేతల ప్రకటన

అరెస్టు చేసిన వారిని అర్థరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు తీసుకొస్తున్నారు

పగలు తీసుకొస్తే పోలీసులు కొట్టిన దెబ్బలు కనిపిస్తాయని భయం

కోయ ప్రవీణ్‌ పై గతంలోనే ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది

తుళ్లూరు డీఎస్పీ మా కార్యకర్తను బూటు కాలితో తన్నాడు

లాలాపేట పీఎస్‌కు వచ్చి కొట్టాల్సిన అవసరం ఏముంది? 

మా నాయకుల పేర్లు చెప్పాలని కార్యకర్తలను వేధిస్తున్నారు

పోలీసులకు అంత ప్రేముంటే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి తీసుకొస్తున్న పోలీసులు, వారిని అక్రమంగా నిర్భంధించి వేధించడమే కాకుండా, ఒక్కొక్కరిపై ఐదారు అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్‌లతో వేర్వేరు జైళ్లకు తరలిస్తున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో నిర్బంధించిన సుధారాణి దంపతులను పరామర్శించడానికి వస్తే, తమ రాకకు కొద్ది గంటల ముందే వారిని పీటీ వారెంట్‌తో వేరే జైలుకు తరలించారని తెలిసిందని, ఈ విధంగా కొత్త తరహా వేధింపులకు పోలీసులు తెర తీశారని వారు ఆక్షేపించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేస్తే తప్ప కార్యకర్తల ఆచూకీ చెప్పని పోలీసులు, వర్రా రవీంద్రారెడ్డిని సైతం సంధ్యారాణి మాదిరిగానే అర్థరాత్రి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చారని తెలిపారు.  గుంటూరు జైల్లో ఉన్న వైయస్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, పానుగంటి చైతన్యను  మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని),ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు ప‌రామ‌ర్శించారు.  అనంత‌రం  జైలు బయట మీడియాతో మాట్లాడారు. 

    తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి, వారిని పగలు కోర్టులో హాజరు పర్చకుండా, అర్థరాత్రి మెజిస్ట్రేట్‌ ఇంటికి తీసుకెళ్లడంలో ఆంతర్యం ఏంటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇకపై తమ పార్టీ నాయకులు విధిగా జైలుకొచ్చి సోషల్‌  మీడియా కార్యకర్తల మంచిచెడ్డలు ఆరా తీస్తారని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు, వారే న్యాయవ్యవస్థ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రస్తావిస్తూ.. డీఐజీ కోయ ప్రవీణ్‌ వ్యాఖ్యలు, ఆరోపణలకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. కోయ ప్రవీణ్‌ గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు, ఒక పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తే, తాము ఈసీకి ఫిర్యాదు చేస్తే, ఆయనపై తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు.     అదుపులోకి తీసుకున్న కార్యకర్తల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారన్న మాజీ మంత్రి.. ఆడబిడ్డ అని కూడా చూడకుండా  సుధారాణిని కొట్టిన పోలీసులు, వెంకట్రామిరెడ్డిని సైతం దారుణమైన పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించారని చెప్పారు. అంతే కాకుండా తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్, సజ్జల భార్గవ్‌ పేర్లు చెప్పాలంటూ, తమ కార్యకర్తను తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్నాడని వెల్లడించారు. అసలు తుళ్లూరు డీఎస్పీ లాలాపేట పీఎస్‌కి వచ్చి కార్యకర్తపై క్రౌర్యం ప్రదర్శించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు టీడీపీపై అంత మమకారం ఉంటే, యూనిఫామ్‌ వదిలి, ఆ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చురకలంటించారు.
    మొన్న కడపలోనూ.. వైయస్‌ అవినాష్‌ పేరు చెప్పాలంటూ, వర్రా రవీంద్రను అదే విధంగా కొట్టారన్న అంబటి రాంబాబు, ఇలాంటి అనైతిక, చట్టవ్యతిరేక పనులు చేసిన పోలీసులు ఏ స్థాయివారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. టార్గెట్‌గా పెట్టుకున్న వారి పేరిట ఫేక్‌ అక్కౌంట్స్‌ ఓపెన్‌ చేస్తున్న పోలీసులు, తప్పుడు పోస్టులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, ఇంకా వారిని హ్యాబిచ్యువల్‌ క్రిమినల్స్‌గా చూపేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని దుయ్యబట్టారు.
    తమ పార్టీ నాయకులపై కూటమి సోషల్‌ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టులు, మార్ఫింగ్‌లపై ఎన్నో ఫిర్యాదులు చేశామని, అయినా పోలీసులు కనీసం ఒక్కరిపైనా చర్య తీసుకోలేదని అంబటి రాంబాబు తెలిపారు. కాగా, సత్తెనపల్లి నియోజకవర్గం నకిరేకల్‌కు చెందిన తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్త పాలూరి రాజశేఖర్‌రెడ్డి కోసం నాలుగైదు రోజులుగా నూజివీడు పోలీసులు వెతుకుతున్నారని అంబటి రాంబాబు తెలిపారు. ఆయన్ను తీసుకొచ్చి అప్పగించాలని, లేకపోతే అతడి అన్న సంగతి తేలుస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డిపై గతంలో ఏ కేసు లేదన్న మాజీ మంత్రి, అతడు తమ ఆధీనంలోనే ఉన్నాడని, ఎక్కడికి తీసుకురావాలో చెబితే తీసుకెళ్తామని వెల్లడించారు. అయితే ఏ చర్య అయినా చట్టప్రకారమే ఉండాలని, అన్యాయంగా వేధిస్తే మాత్రం ఊర్కునేది లేదని స్పష్టం చేశారు. 
    నిజామాబాద్‌కు చెందిన జగన్‌ అభిమాని అశోక్‌రెడ్డి 2015లో పెట్టిన పోస్టుకి ఇప్పుడు అరెస్ట్‌ చేయడమే కాకుండా, రంపచోడవంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకంగా ఇప్పుడు 5 కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహించారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక, ఒక్క హామీని అమలు చేయకుండానే అయిదు నెలల్లో రూ.57వేల కోట్ల అప్పులు చేసిన కూటమి పెద్దలే అసలైన నేరగాళ్లని (420లని) ఆయన దుయ్యబట్టారు.
    సోషల్‌ మీడియా పోస్ట్‌లకు సంబంధించి, కేవలం 41–ఏ కింద నోటీస్‌లు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉందని, అయితే వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను వేధించేందుకు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో కొత్తగా చేర్చిన 111 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, వ్యవస్థీకృత నేరం (ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌)గా చూపుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు. ఇది ఇంతటితో ఆగదన్న ఆయన.. ‘మీరు ఎక్కాలు నేర్పిస్తే, రేపు అది హెచ్చవేతల దాకా వెళ్తుందని హెచ్చరించారు.

Back to Top