అమలాపురం: తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డా. శ్రీకాంత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నాయకులు తిరుమల లడ్డూ విషయంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందన్నారు. అయినప్పటికీ కొందరు తప్పుడు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి దుష్ప్రచారం కొనసాగించడం తీవ్రంగా ఖండనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజలను, భక్తులను తప్పుదారి పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పవిత్ర ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇశ్రాయేల్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ, రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు పాల్గొన్నారు. అలాగే ఎస్‌ఈసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల మరియు పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.