క్రాప్ ఇన్సూరెన్స్‌లో దేశానికే ఏపీ ఆదర్శం

ఏపీలో వ్యవసాయ గ్రోత్ రేటు 11.3 శాతం- రెండేళ్ళలోనే వంద శాతం అభివృద్ధి

రైతు భరోసా- పీఎం కిసాన్ పంపిణీ చేస్తుంటే.. వాస్తవాలకు దూరంగా ఈనాడు రాతలు

ఎన్టీఆర్‌ చావుకు కారణమైనవారు, ఆయన విగ్రహంపై మొసలి కన్నీరా..?

విగ్రహాలు కూలదోసే చౌకబారు రాజకీయాలు వైయస్ఆర్ సీపీ చేయదు

విజయవాడ నడిబొడ్డున వైయస్ఆర్ విగ్రహం తొలగించింది టీడీపీ హయాంలోనే..

రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం ఏమిటి.. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు

బాబుకు లెఫ్ట్ కమ్యూనిస్టులు.. రైట్ బీజేపీ అన్నట్టుగా రాష్ట్ర రాజకీయం తయారైంది

సిగ్గులేని నాయకుడు ఎవరు అంటే 1 నుంచి 10 స్థానాలు బాబువే

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ధ్వ‌జం

తాడేప‌ల్లి: గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో ఏపీ వ్యవసాయ శాఖ ముందు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రంగం చూపిన ప్రగతి దేశంలో ఎక్కడా లేదన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మెహన్‌రెడ్డి రైతు భరోసా కింద రూ.1036 కోట్లు రైతుల అకౌంటులో జ‌మ చేశార‌న్నారు. అటవీ, దేవాదాయ భూములు సాగుచేసే రైతులకు కూడా సాయం అందిస్తున్నామని, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరన్నారు. చెప్పిన దాని కన్నా ఎక్కువగా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామ‌ని వివ‌రించారు. తొలుత 45 లక్షల రైతులకు ఇస్తే.. ప్రస్తుతం 50.58 లక్షల మందికి పెట్టుబ‌డి సాయం అందిస్తున్నామ‌న్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి క‌న్న‌బాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి కురసాల కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..

గతంలో లబ్ధిదారులకు కోతలు ఉండేవి.. మా హయాంలో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ వైయ‌స్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్‌  పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం మూడో విడత కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ.1,036 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. 2019 అక్టోబర్‌ నెలలో ఈ పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో మొట్టమొదటిగా ఈ పథకాన్ని ప్రారంభించి దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగానే రైతులు అకౌంట్లలోకి డబ్బులు వేశాం. 

అధికారంలోకి రాకముందు వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన హామీ ఏంటంటే.. నాలుగేళ్ల కాలంలో రూ.50వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. కానీ చెప్పినదానికన్నా ఎక్కువగా అయిదేళ్ల పాటు ఏటా రూ. 13500 చొప్పున పెట్టుబడి సాయాన్ని వైయస్ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద అందిస్తున్నాం. ఇప్పటివరకు రైతన్నలకు అందించిన మొత్తంలో, కేవలం రైతు భరోసా సాయం మాత్రమే చూసినా రూ. 19,813 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 

రైతుకు మేలు చేసేందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం
- వైయస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం, వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చూస్తే.. శాశ్వతంగా, తాత్కాలికంగా రైతులకు మేలు చేసేలా ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి ఎప్పుడూ ఒకటే చెబుతారు.. రైతులకు ప్రతిదశలోనూ సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అందుకే రైతును చేయిపట్టి నడిపించాలని చెబుతారు. విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకూ వారిని ముందుండి నడిపించాలని మాకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. అందుకే ఇవాళ గ్రామస్థాయిలో పటిష్టమైన రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను తీసుకువచ్చాం. రైతులకు నేరుగా సేవలు అందించే వ్యవస్థను రూపకల్పన చేస్తే.. దీన్ని దేశమంతా ఆదర్శంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.

రైతు భరోసా కేంద్రాలు ప్రశంసలు పొందుతున్నాయంటే, దేశంలోని సంస్థలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు అయిన ఎఫ్‌ఏవో వంటివి ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకుంటున్నాయి. కొన్ని అర్బన్‌ ప్రాంతాల్లో కూడా ఆర్బీకేలు కావాలనే డిమాండ్‌ ఉంది. ఇప్పటికే అర్బన్‌ ప్రాంతాల్లో సుమారు 158 ఆర్బీకేలు ప్రారంభించాం. ఎక్కడైనా ఇంకా ఏర్పాటు చేయాల్సి వస్తే అధికారులతో చర్చించి వాటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

పంటల కొనుగోలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు పంటలకు మద్దతు ధర ఇస్తున్నాం. సుమారు రూ.6,400 కోట్లు విలువ చేసే  ఉత్పత్తులను ప్రొక్యూర్‌ చేశాం. ఇవే కాకుండా మరో రూ.1800 కోట్లు పెట్టి పత్తి కూడా కొనుగోలు చేశాం. ఈ రెండున్నరేళ్లలో రూ.36వేల కోట్లు విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాం. ఇదంతా రైతుకు ప్రతిదశలో మేలు చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం.

వ్యవసాయ గ్రోత్ 11.3 శాతం
ఇలా శాశ్వతంగా వ్యవస్థలను పటిష్టం చేయడం వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతిని సాధించగలిగాం. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ నాయకత్వంలో ఇవాళ గుడ్‌ గవర్నెన్స్ ఇండికేటర్స్‌లో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు మొదటి స్థానంలో నిలిచాయంటే అది చాలా సంతోషించాల్సిన, సంతృప్తి చెందాల్సిన విషయంగా చెప్పవచ్చు.

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రోత్‌ అనేది ఇక్కడితో ఆగిపోకుండా మరింతగా పెరుగుదలకు కృషి చేస్తాం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ అయితే పటిష్టం చేయాలో సమీక్షించాం. రెండేళ్లుకు ఒకసారి ఇచ్చే గుడ్‌ గవర్నెన్స్ ఇండికేటర్స్‌  గ్రోత్‌ రేట్‌ చూసినప్పుడు.. 2019-21 మధ్య సుపరిపాలన సూచికలను చూస్తే.. రిమార్కబుల్‌గా గుర్తించదగ్గ విషయంగా 11.3 శాతంగా నమోదు అయింది. 2019 నాటికి వ్యవసాయ అభివృద్ధి రేటు 6.3 శాతం ఉంటే.. ఈ రెండేళ్లలో 11.3 శాతానికి పెరిగింది. అంటే, దాదాపుగా వందశాతం అభివృద్ధి సాధించామని ప్రకటిస్తున్నాం. ఇక ఉద్యానరంగాన్ని చూస్తే అద్భుతమైన ప్రగతిని సాధించాం. గతంలో 4.7 శాతం ఉన్న గ్రోత్‌ రేటు ఇప్పుడు 12.3 శాతంకు, అంటే రెండింతలు పెరిగింది. పాల ఉత్పత్తులు చూస్తే  2019నాటికి కేవలం 1.4 శాతం గ్రోత్‌ రేటు ఉంటే ఇప్పుడు 11.7 శాతం గ్రోత్‌ రేటును సాధించి కొత్త రికార్డును స్థాపించాం. 

గతంలో డెయిరీలను కుదేలు చేసి, ప్రైవేట్‌ డెయిరీలను ప్రోత్సహించి డెయిరీ రంగాన్ని దెబ్బతీసిన పరిస్థితుల్ని చూశాం. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి అమూల్‌ వంటి సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యి పాడి రైతులకు మేలు అయిన ధర వచ్చేలా చేయగలుగుతున్నాం. మీట్‌ ప్రొడక్షన్‌ చూస్తే 10.3 శాతం గ్రోత్‌రేటును నమోదు చేసుకున్నాం. 

దేశానికే తలమానికంగా క్రాప్ ఇన్సూరెన్స్ పథకం
క్రాప్ ఇన్సూరెన్స్‌ అనేది దేశంలోనే ఒక తలమానికమైన రికార్డును నమోదు చేసింది. దేశంలోనే క్రాప్ ఇన్సూరెన్స్‌ ఆదర్శవంతంగా నడుస్తుందని కేంద్రం ప్రశంసలు ఇచ్చిందంటే, ఈ ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి దక్కుతుంది. రూపాయి ప్రీమియం కట్టకుండా ఈ-క్రాప్ నమోదు చేసుకుంటే పంటల బీమా పథకాని​కి అర్హుడు అవుతాడని దేశంలో ఎక్కడాలేదు. ఈ విధంగా అమలు చేసే ప్రప్రథమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతున్నాం. ఇందులో 26.1 శాతం స్కోర్‌ను సాధించింది. దీనికి దగ్గరల్లో ఇతర రాష్ట్రాలు లేవు. మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రానికి పోలికే లేనట్లు కనిపిస్తోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అత్యధికంగా రైతులు ఇన్సూరెన్స్‌ పొందుతున్నారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రైతు పక్షపాతి
‘నేను రైతు పక్షపాతిని, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని’ ఎన్నికల ముందే ప్రకటించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఈనాటికీ అదే ఒరవడిని కొనసాగిస్తున్నందువల్లే ఈ ఘనత సాధ్యమైంది. 67లక్షల మంది రైతులకు ఇప్పటివరకూ రూ.1185 కోట్లు సున్నా వడ్డీ పథకం కింద మా ప్రభుత్వం చెల్లించింది.
- చంద్రబాబు హయాంలోపెట్టిన బాకీలను కూడా మా ప్రభుత్వం చెల్లించింది. 2014-15 నుంచి 2018-19 వరకూ రుణాలకు సంబంధించి రూ.11వందల 80కోట్లు బాకీ ఉంది. వాటిని కూడా మా ప్రభుత్వం అంగీకరించి బ్యాంకులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ.688 కోట్లు చెల్లించింది.
- ఎక్కడా రైతుకు నష్టం కలగకూడదని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. క్వాలిటీ కంట్రోల్‌ మీద కూడా ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గానికి ఆగ్రీ టెస్ట్ంగ్‌ ల్యాబ్‌లను తీసుకువస్తున్నాం. దాదాపుగా 62 ల్యాబ్‌లను ప్రారంభించగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వేలసంఖ్యలో శాంపిల్స్‌ సేకరించాం. కల్తీ విత్తనాలకు సంబంధించి పలువురు విత్తనదారుల మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం, నలుగురు డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేశాం. 644 లక్షల రూపాయల విలువైన విత్తనాలు సీజ్‌ చేశాం. అలానే, కల్తీ ఎరువులకు సంబంధించి పలువురిపై క్రిమినల్‌ కేసులు, 15మంది డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేశాం. దాదాపుగా రూ. 21.37 కోట్ల విలువైన 14వేల 104 టన్నుల ఎరువులు సీజ్‌ చేశాం.
- అలాగే అనుమతి లేకుండా పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, జైలులో వేస్తామనే స్థాయికి తీసుకు రావడం వల్ల చాలా కంట్రోల్‌ చేయగలిగాం. పురుగు మందులకు సంబంధించి 21మంది డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేశాం. దాదాపుగా 50.89లక్షల లీటర్ల మేరు రూ.198కోట్ల విలువైన పురుగు మందులను సీజ్‌ చేశాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే క్వాలిటీ కంట్రోల్‌ మీద ప్రభుత్వం ఎంతగా దృష్టి సారించిందో అర్థం అవుతుంది.
- వ్యవసాయ సలహామండళ్లు నాలుగు దశల్లో ఏర్పాటు చేశాం. అవన్నీ క్రమ పద్ధతిలో పనిచేస్తున్నాయి. ఆర్బీకే, గ్రామ,మండళ్లు, జిల్లా స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో వచ్చిన ఇన్‌పుట్‌ను తీసుకుని జిల్లా కలెక్టర్లు స్థాయిలో సమీక్షించిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలు, మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టింది.

మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాశాం
- మిర్చికి సంబంధించి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నల్ల తామర పురుగు వల్ల చాలా పంట నష్టం జరుగుతోంది. ఇది విదేశాల నుంచి వచ్చిన తెగులు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో మిర్చి పంటకు ఈ నల్ల తామర పురుగు సోకింది. దీనిపై మన ప్రభుత్వం సత్వరమే స్పందించి.. టెక్నికల్‌ కమిటీని నియమించి వివిధ అగ్రికల్చరల్‌, హార్టీకల్చర్‌ వర్సిటీల నుంచి శాస్త్రవేత్త బృందాలు జిల్లాల్లో పర్యటించి నివేదిక ఇవ్వనున్నాయి. నల్ల తామర పురుగు వల్ల మిర్చి రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ టెక్నికల్‌ సాయం అందించడంతో పాటు ఆదుకోవాలంటూ కేంద్రానికి కూడా లేఖ రాశాం.

పెద్దఎత్తున ధాన్యం సేకరణ
- ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున జరుగుతోంది. భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో రైతులు నష్టపోయారు. రంగు మారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్బీకేలను రైతు కొనుగోలు కేంద్రాలుగా మార్చాం. ఇప్పటిరకూ 12 లక్షల 23వేల 122 మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని కొనుగోలు చేశాం. ఇది ఇంచుమించు రూ. 2,379 కోట్ల విలువైన ధాన్యం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎక్కడా దళారులు, మిల్లర్ల నుంచి మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.  పొలాల్లోకే వెళ్లి క్షేత్ర స్థాయిలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, వారి ఖాతాల్లోకే డబ్బు జమ అయ్యేలా ప్రభుత్వం తరపున, ఆర్బీకేల ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా రైతులు దళారుల చేతిలో మోసపోయే అవకాశం ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. దానికోసం ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశాం.

మూడో విడత రైతు భరోసా- పీఎం కిసాన్ నిధులు వేస్తుంటే.. ఈనాడు తప్పుడు రాతలా..?
- వ్యవసాయ, అనుబంధ రంగాలపై నూటికి నూరుశాతం దృష్టి సారించి తక్షణమే స్పందించేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. సాధారణంగా ఎక్కడైనా బాగా పనిచేస్తున్నప్పుడు కొంతమంది రాజకీయం కోసం విమర్శలు చేస్తారు. రాష్ట్రంలో కొన్నిపత్రికలు కూడా అదేపని మీద ఉన్నాయి. ప్రభుత్వం ఒక మంచి పనిచేస్తున్నప్పుడు.. అదేరోజు ఈ రాష్ట్రంలో రైతాంగానికి నష్టం జరుగుతున్నట్లుగా పనిగట్టుకుని ఈనాడు లాంటి పత్రికలు చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నాయి.  పెట్టుబడి సాయం నుంచి తిరిగి ధాన్యం కొనుగోలు చేసేవరకూ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. బోర్లు కింద వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలని చెప్పడం ఆలస్యం.. ప్రభుత్వం ఏదో వరిని పండించవద్దన్నట్లుగా చంద్రబాబు నాయుడు అండ్ కో.. పెద్ద పొలిటికల్‌ కలరింగ్‌ ఇచ్చే కార్యక్రమం చేశాయి. వరి పంట గిట్టుబాటు కావడం లేదంటూ మళ్లీ ఆ పత్రికలే రాస్తాయి. వాస్తవాలకు దూరంగా రాయడం అంటే ఇదేమరి. ఎత్తిపోతల పథకాల కింద వరికి నీరు ఇవ్వడం లేదని రాస్తారు. ఎత్తిపోతల పథకాలు ఎందుకు డిజైన్‌ చేశారో వాళ్లు అధ్యయనం చేస్తే మంచిది. అయినా ఎత్తిపోతల పథకం ద్వారా వరికి నీరు ఇస్తున్నాం. 

- వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు జమ చేసే రోజే ఈనాడు ఇటువంటి తప్పుడు రాతలు రాయడం సరికాదు. చంద్రబాబు నాయుడు కడుపు మంట అర్థం చేసుకుంటే రాజకీయంగా రోజురోజుకి పతనం అయిపోతున్నారు కాబట్టి, క్యాడర్‌లో చులకన అయిపోతున్నారు కాబట్టి అబద్ధాలను వండి వార్చుతు అలా మాట్లాడారు అంటే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకు వందిమాగధుల్లా పచ్చ బ్రాండ్‌ వేసుకున్న ఓ వర్గం మీడియా.. రోజూ బురదచల్లేవిధంగా చేస్తుంటే ఏమనుకోవాలి. ఈ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి వైపు పయనిస్తోంది. వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి చేయిపట్టి చేయూతను అందిస్తున్నారని గుడ్‌ గవర్నెన్స్‌ ఇండికేటర్‌ను ప్రకటించినా మా ప్రభుత్వం రైతాంగానికి ఏమీ చేయడం లేదంటూ చంద్రబాబు అండ్‌ కో ప్రచారం చేసినా నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. చెప్పినదాని కన్నా ఒకరోజు ముందుగానే పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా మార్పులు తీసుకురాబోతున్నాం. రైతులకు చేయూతనిచ్చేలా వ్యవస్థలలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురాబోతున్నామని చెబుతున్నాం.

చౌకబారు రాజకీయాలు వైయ‌స్ జగన్ ఎప్పటికీ చేయరు
- గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన చాలా దురదృష్టకరం. అది ఎవరు చేసినా తప్పే. పార్టీపరంగా ఇప్పటికే ఖండించాం. ప్రభుత్వపరంగా తక్షణమే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. విగ్రహాలు ధ్వంసం, కూల్చివేయడం వంటి చౌకబారు రాజకీయాలు వైయస్సార్‌ సీపీగానీ, సీఎం వైయ‌స్ జగన్  కానీ చేయరు. మా ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించదు. 

- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్సార్‌ విగ్రహాలను తీసి పక్కనపడేసిన సందర్భాలు ఎన్నో చూశాం. అంతెందుకు, విజయవాడ నడిబొడ్డునే అటువంటి ఘటన జరిగింది. విజయవాడలోని వైయస్సార్‌ విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించి... దాన్ని సరైన ప్లేస్‌లో కూడా పెట్టకుండా మూలన పడేసింది ఎవరు? అది కాదా టీడీపీ చౌవకబారు రాజకీయం అంటే..? ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారంటూ రాజకీయం చేయాలనుకునేది మీరు. చిత్రం ఏంటంటే ఎన్టీఆర్‌నే విధ్వంసం చేసి, దెబ్బతీసినవాళ్లు, ఆయన విగ్రహాన్ని విధ్వంసం చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

- సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పనిచేసే మేము కూడా అలాంటి చర్యలకు పాల్పడం. కాకినాడలోని సర్పవరం జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి బ్యూటిఫికేషన్‌ లైటింగ్‌ పెట్టి ఆర్నెల్లు అయింది.  సంక్షేమం కోసం పాటుబడ్డ నాయకుడిగా మేము కూడా ఎన్టీఆర్‌ను గుర్తిస్తాం. ఆయనను గుర్తించనివాళ్లు ఎవరంటే 1995లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసినవారే ఆయన నాయకత్వాన్ని గుర్తించలేదు. మేము ఎప్పుడు ఎన్టీఆర్ ను కించపరిచేలా ప్రవర్తించలేదు. లోతుగా అధ్యయనం చేస్తే.. టీడీపీ హయాంలోనే.. వైయస్సార్‌ విగ్రహాలను ఎక్కువగా ధ్వంసం చేసిన విషయాలు ఎన్నో బయటకువస్తాయి. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. 

జనం గుండెల్లో వైయ‌స్ జగన్ పాతుకుపోతున్నారని.. బాబుకు అసహనం
చంద్రబాబు నాయుడులో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. జగన్‌గారు రోజురోజుకు ప్రజల గుండెల్లో పాతుకుపోతున్నారని.. ఇక రాజకీయంగా గట్టేక్కెలా లేమనే బాధతో, కడుపు మంటతో, అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తూ దిగజారిపోయి రాజకీయం చేస్తున్నారు. అందుకు అసెంబ్లీలో జరిగిన ఘటననే చెప్పుకోవచ్చు.
-  అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా  వైయ‌స్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబుకు అసహనం వస్తుందా? రాష్ట్రమంతా విజయ పరంపర సాగించిన జగన్‌గారికి అసహనం వస్తుందా? రాసుకోవడానికి నాలుగు పత్రికలు, చూపించుకోవడానికి నాలుగు టీవీ చానల్స్‌ తప్ప ఈ రాష్ట్రంలో అతనికేమీ బలం లేదని బాబుకు బాగా తెలుసు, ప్రజలకు అంతకంటే బాగా తెలుసు.

గ్రాఫిక్స్ అమరావతిపై బాబును బీజేపీ అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు
- ఈ రాష్ట్రంలో అమరావతి ప్రకటించేనాటికే తెలుగుదేశం పార్టీతో బీజేపీ జతకట్టి ఉంది. నిజంగానే అమరావతి మీద బీజేపీకి అంత ప్రేమ ఉంటే గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్న చంద్రబాబును అప్పుడే ఎందుకు నిలదీయలేదు. ప్రజాగ్రహ సభ పెట్టిన బీజేపీ... అసలు రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏంటో చెప్పాలి? అయిదేళ్ల కాలంలో విభజన హామీలను మీరు ఏం అమలు చేశారు.?  పోనీ భవిష్యత్‌లో, ఎంతకాలంలో అమలు చేయిస్తారో  బీజేపీ నాయకులు ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టే పూచీ మేం తీసుకుంటాం అని బీజేపీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు?.  నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, రాజకీయ పార్టీగా విమర్శలు చేస్తే బాగుంటుంది. 

- అమరావతిని గాలికి వదిలేసి... రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన చంద్రబాబును అప్పుడు ఎందుకు నిలదీయలేదని బీజేపీని  అడుగుతున్నాం. రాష్ట్రంలో రాజకీయం ఏస్థాయికి వచ్చిందంటే చివరికి బాబుకు అటూ ఇటూ లెఫ్ట్ కమ్యూనిస్టులు.. రైట్ బీజేపీ నాయుకులు ఉండే పరిస్థితి. సమాయనుకూలంగా మాటలు మార్చేలా మాట్లాడుతున్నారు. సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టవద్దని తీర్మానం చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. అటువంటి వ్యక్తి సీబీఐ గురించి ఎలా మాట్లాడతాడు.  సిగ్గులేని నాయకుడు ఎవరూ అని పోటీ పెడితే ఒకటి నుంచి పది స్థానాలు చంద్రబాబువే.

- వంగవీటి రాధా పై రెక్కీ వివరాలను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ మాటల్లో చూశాం. దేన్ని అయినా రాజకీయ కోణంలో చూడటం తప్ప వాస్తవాల గురించి ఆలోచించని నాయకుడుగా చంద్రబాబు నాయుడు తయారయ్యారు. నాలుగు ఓట్లు వస్తాయంటే... చంద్రబాబు రాజకీయంగా కులాలను, మతాలను వాడుకునేందుకు, ఎక్కడికైనా వెళతా, ఎవరింటికైనా వెళతాను అన్నట్టుగా తయారయ్యాడు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top