చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ దౌర్జన్య పాలన మరోసారి వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ అండతో టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. పెనుమూరు మండలంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాలు నిర్వహిస్తున్న దుకాణాలను ఎలాంటి నోటీసులు, చట్టబద్ధ ప్రక్రియలు పాటించకుండా టీడీపీ నేతలు బలవంతంగా ఖాళీ చేయించారు. అంతేకాకుండా షాపులను ధ్వంసం చేసి కుటుంబాలను రోడ్డున పడేశారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్ట పాలన కనుమరుగైందని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మారిందని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. బాధితులకు వైయస్ఆర్‌సీపీ అండ ఈ దౌర్జన్య ఘటనను జీడి నెల్లూరు నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయాలన్న కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని, న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. నేడు మాజీ డిప్యూటీ సీఎం పరామర్శ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి నేడు పెనుమూరులో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ప్రజల పక్షాన నిలబడి, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజల గొంతు నొక్కేలా పాలన సాగుతున్నప్పటికీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరంతరం ప్రజల కోసం నిలబడుతుందని, అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతుందని నాయకులు స్పష్టం చేస్తున్నారు.