పచ్చ చొక్కాల పరిరక్షణే టీడీపీ ధ్యేయం

అధికారంలో ఉండగా దళిత చట్టాలను అవహేళన చేశారు

టీడీపీ నేతలు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున

తాడేపల్లి: ప్రతిపక్ష టీడీపీకి పచ్చ చొక్కాల పరిరక్షణే ధ్యేయమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. దళిత వర్గానికి చెందిన మురళికృష్ణ తన ఉద్యోగం తీసేశారని ఫిర్యాదు చేస్తే..అలాంటి వ్యక్తిపై ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వీసీ దామోదర్‌నాయుడు కులంపేరుతో దూషించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి టీడీపీ బాసటగా నిలవడం దారుణమన్నారు. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు సరికాదని తప్పుపట్టారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. 
ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు తెచ్చి భవితరాలకు వైయస్‌ జగన్‌ బంగారు బాటలు వేస్తుంటే..ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు గుండెలపై చేతులు వేసుకొని హాయిగా ఉంటే..మా పాలనలో నేరాలు , ఘోరాలు జరిగిపోతున్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన బృందం గవర్నర్‌ను కలిశారని తప్పుపట్టారు. ఎవరైనా గవర్నర్‌ను కలవొచ్చు అని, కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ, దళిత చట్టాలను అవహేళన చేస్తూ, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేసిన నాయకులు వైయస్‌ జగన్‌ పాలనపై నిందలు వేయడం దారుణమన్నారు. వైయస్‌ జగన్‌ నిర్ణయాలతో పేదలకు మేలు జరుగుతుంటే గవర్నర్‌పై ఎవరిపై ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. నిద్రపోయిన వారిని లేపొచ్చు అని, నటిస్తున్న వారిని ఎవరు లేపలేరని ధ్వజమెత్తారు. చిలుకలూరిపేటకు చెందిన ఉయ్యూరు మురళి కృష్ణ అనే వ్యక్తి ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా చేరారని, అక్కడ ఉన్న వీసీ దామోదర్‌నాయుడు అతన్ని కులం పేరుతో దూషించి అవమానపరిచారని తెలిపారు. కులం పేరుతో తిట్టి అవహేళన చేస్తే కేసులు పెట్టరా అని నిలదీశారు. దామోదర్‌ నాయుడు అనే వ్యక్తి దళితుడిని అవహేళన చేస్తే కేసు పెట్టారు. మీకు దళితులంటే తెలియదా? ఎవరిని రక్షిస్తున్నారని నిలదీశారు. 400కు పైగా తప్పులు చేసిన దామోదర్‌ నాయుడి తరఫున గవర్నర్‌ను కలుస్తారా అని ప్రశ్నించారు. ఎంతమంది దళితులను మీరు అవహేళన చేశారో గుర్తు లేదా అని మండిపడ్డారు. టీడీపీ ఎజెండా ఒక్కటేనని, తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను కాపాడుకోవడమే అన్నారు. మిగతా కులాల వారు ఏమైనా టీడీపీకి ఫర్వాలేదని, పచ్చ చొక్కాల పరిరక్షణే వారి ధ్యేయమన్నారు. దామోదర్‌ నాయుడికి, టీడీపీకి, కేశినేని నానికి ఆ ఒక్కటే సంబంధం అన్నారు. మా దళితులు, బీసీలు మీకు ఓటు వేయలేదా అని నిలదీశారు. రేపు మా గడపలకు వచ్చి ఓటు ఎలా అడుగుతారని ఫైర్‌ అయ్యారు. మీ పరిపాలనలో నాగార్జున యూనివర్సిటీలో బీసీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు అక్కడి ప్రిన్సిపాల్‌ కారణమైతే ఆయన్ను వెనుకవేసుకొచ్చారని తెలిపారు. అణగారిన కులాల మనుగడ మీకు కాబట్టదా? అని ధ్వజమెత్తారు. మీ సామాజిక వర్గాన్ని కాపాడుకునేందుకు అడ్డంగా గడ్డి తినడానికి కూడా టీడీపీ నేతలు వెనుకాడరన్నారు. మా నాయకుడు రాజ్యాంగం మీద నమ్మకంతో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే..అభినందించాల్సింది పోయి..విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తీరు బాధాకరమన్నారు.  ప్రజలన్ని కూడా గమనిస్తున్నారని, టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Read Also:వరదలతోనే ఇసుక సేకరణకు ఇబ్బందులు

 

Back to Top