విజయవాడ: ఈవీఎంలపై చంద్రబాబుకు నాడు లేని అనుమానాలు నేడు ఎందుకు ఉన్నాయని, ఈసీని అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఓటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, పిల్లి మొగ్గలు వేస్తున్నారని విమర్శించారు. అనుభవం ఉన్న చంద్రబాబుకు రూల్స్ తెలియవా అని ప్రశ్నించారు. ధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 50 శాతం వీవీప్యాడులు లెక్కించాలని కోరడం అనుభవంతో కూడిన నాయకులు కోరాల్సిన అంశమేనా? 50 శాతం లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పిన తరువాత కూడా చంద్రబాబు ఈసీ వద్దకు వెళ్లి లెక్కించాలని కోరడం ఏంటో? చంద్రబాబు ఈవీఎంలపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈవీఎంలు వాడుకలో ఉన్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన సమయంలో కూడా ఈవీఎంలే ఉన్నాయి. చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం చేయడంతో వీవీ ప్యాడ్‌లు వచ్చాయి. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ..తాను ఓటు వేస్తే ఎవరికి పడిందో అంటూ ఎన్నికల కమిషన్‌నే అవమానించే విధంగా వ్యాఖ్యానించారు. మీరు పోరాడి సాధించిన వీవీపాడ్‌లో ఎవరికి ఓటు పడిందో చూడలేదా? మరిచిపోయారా? సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు పడిందని చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారు. బాధ్యత గల నాయకుడైతే చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇంత కష్టపడి ఈవీఎంలు, వీవీపాడులు తీసుకొస్తే అవహేళనగా మాట్లాడటం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు దుర్దేశంతో మాట్లాడుతున్నారు. తాను ఓడిపోతే తన పరిపాలన వల్ల జరిగిన తప్పు కాదాని, కేవలం ఈవీఎంల వల్లే ఓడిపోయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది దుర్మార్గమైన ఆలోచన. వ్యవస్థలపై నమ్మకంతో వ్యవహరించాలని కోరుతున్నాను. మంత్రివర్గ సమావేశం 10న ఏర్పాటు చేస్తున్నానని చంద్రబాబు మాట్లాడారు. సీఎస్ వస్తారో? లేదో చూస్తానని మాట్లాడారు. ఎన్నికల సమయంలో మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాల్సిన అత్యవసరం ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి రూల్స్ తెలియవా? ఏవిధంగా మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలో ఆయనకు తెలియదా? ఎన్నికల కమిషన్ అనుమతితో మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చు అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు పంథాలకు వెళ్తున్నారు. ఎందకు 14వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని మార్చుకున్నారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించడం లేదు. సర్వేలు అన్నీ కూడా చంద్రబాబు ఓడిపోతారని చెబుతున్నాయి. ఈ విషయం అందరి కన్న చంద్రబాబుకే తెలుసు. తన కుటుంబ సభ్యులకు, మంత్రివర్గ సభ్యులకు మనమే అధికారంలోకి రాబోతున్నామని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. దీనికి తప్పని సరిగా చంద్రబాబు మూల్యం చెల్లించుకోకతప్పదు. నిన్న చిన్నపాటి గాలివాన వచ్చింది. అమరావతిలో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ఫోల్, రేకుల షెడ్డు గాలికి ఎగిరిపోయింది. జెస్టీ సీటీ కూడా అద్దాలు పగిలిపోయాయి. భారీ వర్షం పడితే మంత్రివర్గ సహచరులు ఛాంబర్స్, ప్రతిపక్ష నేత గదులు నీటితో నిండిపోతున్నాయి. ఇది మొదటిసారి కాదు. వర్షం పడినా నీరు వస్తున్నాయి. గాలి వస్తే లక్షల పెట్టుబడితో నిర్మించిన భవనాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. చిన్న గాలి వానకు ఎగిరిపోయే భవనాలు కట్టిన చంద్రబాబు నా అనుభవం చూడండి. కోర్టుకు వెళ్లడం చంద్రబాబు అలవాటు చేసుకుంటున్నారు. మొన్న ఏబీ వెంకటేశ్వర్లు విషయంలో కూడా కోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. పరిపాలనకు చంద్రబాబు అనర్హులు. ఈ 20 రోజులు కూడా మీరు పరిపాలించేందుకు కూడా అనర్హులే. అమరావతిలో అడుగడుగునా అవినీతే? కమీషన్లు, లంచాలతో నిర్మించిన అమరావతి గాలికి కొట్టుకుపోతోంది. చంద్రబాబు తనకు ఒక్కరికేనా ఎన్నికల కోడ్..ప్రధానికి లేదా అంటున్నారు. ప్రధాని ఈసీ అనుమతితో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిల్లి మొగ్గలు వేయడం చంద్రబాబుకు తగదు. కోడెల శివప్రసాదరావు శాసన సభాపతిగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన తన చాంబర్‌లో పత్రికా సమావేశాలు పెట్టుకోవచ్చు. ఆ చాంబర్‌లో రాజకీయాల గురించి మాట్లాడారంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లే. రాజకీయ ఉపన్యాసాలు చేసేందుకు స్వీకర్ చాంబర్‌ను ఉపయోగించడం సరికాదు. దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆయన టీడీపీ కార్యాలయంలో కూర్చొని ఎవరైనా విమర్శించవచ్చు. స్వీకర్‌గా ఉండి రాజకీయ విమర్శలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.