ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారు

ఆ వ్యవస్థే పనికిమాలిందని చంద్రబాబు అన్నారు

కోడెల సెల్‌ఫోన్‌ గురించి ఎందుకు మాట్లాడడం లేదు

రాజకీయ లబ్ధికోసం కోడెల మరణాన్ని బాబు వాడుకుంటున్నారు

కోడెల మీద బాబుకెందుకు అంత అక్కసు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 

అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు సానుభూతి సంపాదించాలని చూస్తున్నాడని, కోడెల మీద అక్కసు లేకపోతే అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలను ఎందుకు వద్దన్నారో చెప్పాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ వ్యవస్థ పనికిమాలిందని గతంలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారో చెప్పాలన్నారు. గత మూడు నెలలుగా కోడెల శివప్రసాదరావును ఏం అంశంపై అయినా, ఏ సందర్భాలోనైనా చంద్రబాబు కలిశారా..? కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా వేధించింది మీరు కాదా.. బాబూ అని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన  మాటల్లోనే..
కోడెల మరణం బాధ కలిగించింది. పార్టీలో ఏం అవమానం జరిగింది. ఇంట్లో ఏం ఇబ్బందులు వచ్చాయి. ఏ కారణంతో చనిపోయారని ఆలోచన చేశాం. మా వంతు సానుభూతి కూడా తెలియజేశాం. మూడు రోజులుగా టీవీలు చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కోడెల చనిపోయాడనే బాధకంటే అక్కసు ఎక్కువగా ఉన్నట్లుంది. రాజకీయ ఆలోచనతో ఏదో సానుభూతి సంపాదించాలనే తాపత్రయం కనిపిస్తుంది. చంద్రబాబు గవర్నర్‌ను కలిసిందుకు వెళ్లారు. ఎందుకు కలిశారని తప్పుపట్టడం లేదు. ఇదే చంద్రబాబు గవర్నర్‌ వ్యవస్థ ఒక పనికిమాలిన వ్యవస్థ అని, ఎవరు గవర్నర్‌ అని, ఏజెంట్‌ అని గతంలో మాట్లాడిన మాటలను గుర్తుచేస్తున్నా.

ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ వైయస్‌ జగన్‌ యోగక్షేమాలు ఫోన్‌ ద్వారా తెలుసుకుంటే దానికి చంద్రబాబు మాట్లాడిన భాష, తీరు కించపరిచినట్లుగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారు. పనికిమాలిన వ్యవస్థ అయితే ఎందుకు వెళ్లావు. నువ్వు అధికారంలో ఉంటే ఒకటి. నువ్వు అధికారంలో లేకపోతే ఇంకొకటి. ఇదేనా చంద్రబాబు నీ 40 ఏళ్ల అనుభవం.
గవర్నర్‌కు సమర్పించిన రిపోర్టులో సీబీఐ ఎంక్వైరీ డిమాండ్‌ చేయలేదు. ప్రెస్‌మీట్లలో సీబీఐ ఎంక్వైరీ డిమాండ్‌ చేశారు. సీబీఐ కేంద్రం చెప్పుచేతల్లో ఉందని మాట్లాడింది చంద్రబాబు. కేంద్రంలో అప్పుడున్న ప్రభుత్వమే ఇప్పుడుంది. ఈ ఆరు నెలల్లో ఏమైంది. సీబీఐ రాష్ట్ర పొలిమేరల్లోకి రావొద్దన్న వ్యక్తివి ఏ ముఖం పెట్టుకొని సీబీఐ ఎంక్వైరీ డిమాండ్‌ చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాలు ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగబద్ధంగా పనిచేసిందా..? వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేశాడు. 2014 ఎన్నికలు అయిన తరువాత కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మా కార్యకర్తలు, మా నాయకులు ఏది చెబితే అది చేయండి చట్టం లేదు. ఏమీ లేదని మాట్లాడింది చంద్రబాబు కాదా..? రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసి ఈ రోజు కొత్త డ్రామా ఆడుతున్నాడు. కోడెల చేసుకున్న ఆత్మహత్యను ముందుకు తీసుకొచ్చి డ్రామాలు.

కోడెల ఎందుకు చనిపోయారు. చంద్రబాబును ఈ మూడు నెలల్లో కోడెల ఎన్నిసార్లు కలిశారో ఆలోచన చేయండి. కోడెల ప్రముఖుడు అని ఇప్పుడు అంటున్నారే.. ఎన్ని అంశాలు, ఎన్ని సందర్భాల్లో ఈ మూడు నెలల్ల కలిశారు. బీజేపీలో చేరేందుకు కోడెల శివప్రసాదరావు ఎందుకు ప్రయత్నాలు చేశారు. ఇది వైయస్‌ఆర్‌ సీపీ ఆపాదిస్తుంది కాదు.. బీజేపీ నాయకులు రఘురాం, రఘునాథరావు చెప్పిన మాటలు. టీడీపీలో గౌరవం లేదు. మా పార్టీలో చేరేందుకు పెద్దలను సంప్రదించాలనుకున్నారని వారే చెప్పారు.  

సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం బాధితులు ముందుకు వచ్చి కేసులు పెడితే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏముంది. కోడెల వల్ల మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు కానీ, ఆ కేసులను ఎవరైనా ఖండించారా..? చంద్రబాబు, లోకేష్, మిగిలిన నాయకులు ఎందుకు ఖండించలేదు.

సాక్షి పేపరు, సాక్షి టీవీ లేకపోతే గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన అరాచకాలకు, దౌర్జన్యాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏంటీ.? ఎల్లో మీడియా మొత్తం నీ చెప్పుచేతుల్లో పెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీపై దుష్ప్రచారం చేశారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలను సాక్షి మీడియా బయటపెట్టింది. చట్టాల గురించి చంద్రబాబు చెబుతుంటే విడ్డూరంగా ఉంది. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఛిన్నాభిన్నం చేశాడు చంద్రబాబు.

కోడెల శివప్రసాద్‌ మీద చంద్రబాబుకు ఎంత అక్కసు ఉందో అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశిస్తే చంద్రబాబు దాన్ని కూడా కోడెల నోచుకోనివ్వకుండా చేశాడు. కోడెల సెల్‌ఫోన్‌ పోయిందని పుకార్లు వస్తున్నాయి. చంద్రబాబు దాని గురించి ఎందుకు అడగడం లేదు. వైయస్‌ఆర్‌ సీపీ సెల్‌ఫోన్‌ దాచేసిందా..? ఏం చంద్రబాబు చెప్పండి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడు వైయస్‌ జగన్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఆత్మకూరులో రెండు కుటుంబాలు కొట్టుకుంటే దాన్ని రెండు పార్టీలకు పూశారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో క్యాంపులు రన్‌ చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు చూశారు. కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు హుందాగా ఒక స్టేట్‌మెంట్‌ ఇస్తే బాగుండేది.

Back to Top