అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హెచ్చరిక హేతబద్ధంగా లేదు!

ఇండియాలోనే మైనారిటీల హక్కుల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి కామెంట్‌

తాడేప‌ల్లి:  మానవ ప్రగతి విషయంలో, అక్కడక్కడా అలజడి, తాత్కాలిక అశాంతితో నిత్యం వార్తల్లో నిలిచే దక్షిణాసియాలో చాలా వరకు ప్రశాంతత నెలకొని ఉన్న దేశం ఇండియా. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా, 32,87,263 చ.కి.మీ సువిశాల భారతంలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాల జనాభా 20 శాతం వరకూ ఉంది. అయినా, దాదాపు 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మత ఘర్షణలు మన పొరుగు దేశాల స్థాయిలో ఎన్నడూ జరగలేదు. ఒకవేళ జరిగినా కొద్ది రోజుల్లోనే మామూలు పరిస్థితులు నెలకొనే ఆనవాయితీ ఉంది. మతపరమైన అణచివేత కారణంగా సరిహద్దు దేశాల నుంచి మైనారిటీలు ఇండియాకు శరణార్ధులుగా తరలివస్తున్నారేగాని, ఈ కారణంతో దేశం నుంచి మైనారిటీలు ఎవరూ విదేశాలకు వలసపోయే పరిస్థితులు లేనేలేవు. ఎక్కడైనా మతఘర్షణలు కాస్త తీవ్రస్థాయిలో పెరిగితే వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయుధ బలగాల వల్ల కాకపోతే– సైన్యాన్ని రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం ఎన్నో దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని మతాల ప్రజల మధ్య కొట్లాటలు జరిగితే ఇతర మతాల వారిని మరో మతం వారు తమ ఇంట్లో పెట్టుకుని కాపాడం కూడా భారత సాంప్రదాయంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అల్పసంఖ్యాక మతాలకు చెందిన ప్రజలు ఎలాంటి అశాంతి, అభద్రతాభావం లేకుండా దశాబ్దాల తరబడి జీవిస్తున్నారు. మత సామరస్యానికి సంబంధించి ఇంత చక్కటి, ఆదర్శప్రాయమైన నేపథ్యం, చరిత్ర ఉన్న భారత్‌ పై అమెరికా మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు, అక్కడి మైనారిటీ ఆఫ్రికన్‌–అమెరికన్‌ (నల్లజాతి) వర్గానికి చెందిన తొలి నేతగా అధ్యక్ష ఎన్నికల్లో  గెలిచి చరిత్ర సృష్టించిన బరాక్‌ ఒబామా నిన్న ఇండియాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. 

మైనారిటీల హక్కులకు రక్షణ కరువైతే ఇండియా ముక్కచెక్కలవుతుందన్న ఒబామా
అల్పసంఖ్యాక మతాల ప్రజలు, మైనారిటీ జాతుల హక్కులు పరిరక్షించకపోతే భారతదేశం ముక్కచెక్కలవుతుందని మాజీ అధ్యక్షుడు ఒబామా గురువారం వ్యాఖ్యానించారు. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ప్రఖ్యాత జర్నలిస్టు క్రిస్టీన్‌ అమన్‌ పూర్‌ కు ఇంటర్వ్యూ ఇస్తూ, భారత సమాజంలో బలహీనవర్గాల స్థితిగతులపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం సబబుగా కనిపించడం లేదని భారత మేధావులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇండియాలో మతపరమైన, జాతిపరమైన మైనారిటీల హక్కులు పరిరక్షించలేకపోతే, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేశం ముక్కచెక్కలవడం మొదలవుతుంది,’ అని ఒబామా ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన అమెరికా అధినేతగా గుర్తింపు పొందిన ఒబామా ఇలా మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ దేశంలోనైనా బడుగువర్గాలను, మైనారిటీలను కాపాడాలని, వారి హక్కులను పరిరక్షించాలని కోరడంలో తప్పులేదు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధికెక్కిన అమెరికాలో (నల్లజాతీయులను బానిసలుగా చూడడం) బానిసత్వం రద్దు సమస్యపై అక్కడి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కొద్ది కాలం అంతర్యుద్ధం జరిగింది కాని ఈ విశాల దేశం రెండుగా చీలిపోలేదు. కొన్ని ఏళ్ల అంతర్గత కల్లోలం తర్వాత అమెరికా మరింత బలోపేతం అయింది. కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యంగా అవతరించింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇండియాలో మతపరమైన మైనారిటీలకు లేదా జాతిపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు గాని తాత్కాలిక ఇబ్బందులు వచ్చినప్పుడు దేశం చిన్నాభిన్నమౌతుందని భయపడాల్సిన అవసరం లేదని మన చరిత్ర నిరూపించింది. భారత చరిత్రను క్షణ్ణంగా పరిశీలిస్తే–ఒబామా గారి హెచ్చరిక హేతుబద్ధంగా కనిపించదు.

Back to Top