నూత‌నోత్సాహం.. 

ప్లీనరీ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో వైయ‌స్ఆర్‌సీపీలో ఆనందోత్సాహాలు

ఇక మరింత ఉధృతంగా ప్రజల్లోకి..

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాపై ముప్పేట దాడి

గంటల తరబడి ప్రసంగాలు విని నిబద్ధత చాటుకున్న శ్రేణులు

జడివానలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించిన కార్యకర్తలు 

175 శాసనసభ స్థానాలూ గెలవడం అసాధ్యం కాదని సీఎం దిశా నిర్దేశం

సీఎం నింపిన స్ఫూర్తితో కార్యకర్తలు, అభిమానుల్లో కదనోత్సాహం

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల నిబద్ధతతో టీడీపీ, ఇతర ప్రతిపక్షాల్లో వణుకు 

అమరావతి: అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత నిర్వహించిన ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతం కావడంతో వైయ‌స్ఆర్‌సీపీలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 26 జిల్లాల నుంచి  పార్టీ శ్రేణులు ప్లీనరీకి పోటెత్తాయి. గుంటూరు–విజయవాడ మధ్య జన మహా సముద్రాన్ని తలపించింది. జడివానను లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చారు. ప్లీనరీ ప్రాంగణం వద్ద గంటల తరబడి కాలుకదపకుండా నిల్చొని నాయకుల ప్రసంగాలు విన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో భోజనం చేస్తున్న వారు కూడా మధ్యలో వదిలేసి వచ్చి, ప్రసంగాన్ని వినడం పట్ల శ్రేణుల్లో పార్టీ పట్ల నిబద్ధత రెట్టింపైనట్లు స్పష్టంగా కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టెంట్‌ బయట ఉన్న వారు వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయక జగన్‌ ప్రసంగం ఆద్యంతం వినడమూ కనిపించింది. ప్లీనరీ ప్రాంగణంలో నాలుగున్నర లక్షలు.. ట్రాఫిక్‌లో వాహనాలు చిక్కుకుపోవడంతో అంతే స్థాయిలో రహదారులపై ఉండిపోయారు. 

కాలరెగరేసే పరిస్థితి.. 
నవరత్న పథకాలన్నీ అమలు చేయడం.. ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేయడం.. అన్ని వర్గాల ప్రజలు సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనను ఆదరిస్తుండటంతో రాష్ట్రమంతా మేం వైయ‌స్ఆర్‌సీపీ అని కాలరెగరేసే పరిస్థితి ఉండటం వల్లే.. ప్లీనరీకీ అభిమానసంద్రం పోటెత్తిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేలా కార్యక్రమాలను ఉధృతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయించింది.

కర్తవ్య బోధతో కదనోత్సాహం  
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలనూ క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్లీనరీలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న మంచి వల్ల కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించి.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసేలా గెలిపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 175 స్థానాలూ గెలవడం అసాధ్యం కాదని.. సుసాధ్యమేనంటూ శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు.

చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సైన్యంగా ఏర్పడాలని సూచించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబుతో కూడిన కౌరవ సైన్యంపై గెలిచేందుకు అర్జునుడి పాత్ర పోషించాల్సింది మీరేనని శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నింపిన స్ఫూర్తి, కర్తవ్య బోధతో శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది.

మరింత నిబద్ధతతో గడప గడపకూ..
మూడేళ్లలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించి.. ఆశీర్వదించాలని కోరేందుకు మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్కార్‌ చేపట్టింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన లబ్ధిని వివరిస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌ రాసిన లేఖను అందిస్తూ.. ఆ పథకాలన్నీ వచ్చాయా? లేదా? అని ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ప్లీనరీ గ్రాండ్‌ సక్సెస్‌ అయిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిస లాడుతుండటంతో దాన్ని మరింత పెంచేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత నిబద్ధతతో నిర్వహించడానికి సిద్ధమయ్యారు.  

మీ ఆత్మీయతకు మరోసారి సెల్యూట్‌ 
వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరై, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన కార్యకర్తలు, అభిమానులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘నిరంతరం.. దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు. కార్యకర్తలు, అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీరిస్తున్న మద్దతుకు.. మీ జగన్‌ మరోసారి సెల్యూట్‌’ అని ట్వీట్‌ చేశారు. 

Back to Top