వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల దాతృత్వం

 కరోనా నివారణ చర్యలకు ఎంపీల విరాళం 
 

అమరావతి : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ముందుకొచ్చారు. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ౖవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. 
కరోనా వైరస్‌ కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు సాహసోపేతంగా పనిచేస్తున్నారని అభినందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయని గుర్తుచేశారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇంటికి పరిమితం కావడం చాలా ముఖ్యమని తెలిపారు. పనిచేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. కరోనాపై పోరాటానికి భావసారూప్యత ఉన్న వ్యక్తులు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. 
 

Back to Top