మరచిపోలేని పాదయాత్ర...మరపురాని మన రాజన్న

వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానానికి 16 ఏళ్లు

 చరిత్రలో నిలిచిపోయిన వైయస్‌ఆర్‌  పాదయాత్ర

 విశాలాంధ్ర గతిని మార్చి, స్థితిని పెంచిన ప్రజాప్రస్థానయాత్ర

 కరువు కష్టాలు...పాలకుల పీడ వదిలించిన రాజన్న

 వైయస్‌ఆర్‌ పాదయాత్ర ఫలితం..విశాలాంధ్రకు సువర్ణయుగం

అమరావతి: ప్రజల జ్ఞాపకాల పొరల్లో ఇంకిపోయిన పాదయాత్ర. మండుటెండల్లో వైయస్సార్‌ మొదలుపెట్టిన పాదయాత్ర. అది ఓ గొప్ప ఆశయంతో తలపెట్టిన పాదయాత్ర. అది అనితరసాధ్యమైన సంకల్పంతో సాగిన యాత్ర..ప్రజలకోసం సాగిన యాత్ర.
2003. ఏప్రిల్‌ 9. ఎండాకాలం. మండేకాలం. ఇప్పుడెందుకు రాజశేఖరా అని తల్లి ఆందోళన పడింది. ఇప్పుడు కాక? మరెప్పుడమ్మా? ప్రజలు కష్టాల్లో వున్నప్పుడే కదా...వారికి భరోసాగా నిలవాల్సింది..అన్నారు వైయస్సార్‌. కొడుకు కథ తెలిసిన అమ్మ...ప్రజలకోసం ఎందాకైనా కదలిపోయే బిడ్డ మనస్తత్వం తెలిసిన జయమ్మ..రాజశేఖరుడిని ఆశీర్వదించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా సాగిన 1476 కిలోమీటర్ల ...ఆ పాదయాత్ర విశాలాంధ్ర చరిత్రలో ఓ అద్భుత అధ్యాయానికి నాంది పలికింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. అసలు ప్రజానాయకుడిని పట్టిచూపింది. 

సరిగ్గా పదహారేళ్ల క్రితం తెలంగాణలోని చేవెళ్ల నుంచి వైయస్సార్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ ఎ్రరటి ఎండాకాలంలో వైయస్సార్‌ ప్రజాదీక్షకు ప్రకృతి కూడా నిశ్శబ్దంగానే కదిలిపోయింది....రాజశేఖరుడి సంకల్పానికి జనం కదిలిపోయారు. ప్రేమమీర శుభాభినందనలు అందించారు. అప్పుడు అటు తెలంగాణా ప్రాంతాలు, ఇటు ఆంధ్రాప్రాంతాలు అన్నీ కరువుతో అల్లాడిపోతున్నాయి. కరువు పీడ ఒకటయితే, నాటి పాలకుడు చంద్రబాబు అన్నదాతల వ్యతిరేక పాలన నడ్డివిరుస్తోంది. కరెండు షాకులతోనే సగం మంది రైతులను చంపేసిన కాలమంది. పల్లెలన్నీ కన్నీరు పెడుతున్న సందర్భమది. వైఎస్‌ కదిలారు. ఆయన వెంట జనం నడిచారు. ఊరూవాడా, కొండలు, గుట్టలు, అడవులు అన్నీ పాదయాత్రికుడికి పరిచిన బాటలే అయ్యాయి. పల్లెపల్లెను పలకరించారు. గుడిసె గుడిసె గుండెను తట్టాడు. మాకోసం వచ్చావా? రాజన్నా అంటూ ...పేదప్రజలు కంటతడిపెడితే, ఆత్మబంధువులా నడిచొచ్చావా తండ్రీ అంటూ ...సమస్త జనం వైయస్సార్‌లో నమ్మకమైన నాయకుడిని చూశారు.
తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో వున్న సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు వైయస్సార్‌. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు, కరెంటు లేక ఎండుతున్న పొలాలు, ఛిన్నాభిన్నమైన చేనేత, సాధికారత లేని మహిళలు, కూడూగుడ్డ లేని సామాన్యులు..ఇవన్నీ వైయస్‌ను నిశ్చేష్టున్ని చేశాయి. 

బావుల్లో, బోర్లలో నీళ్లులేవు. కరెంటు లేదు. అయినా పగటి పూటే రైతులు బీడుపొలాల్లో దాచిపెట్టుకున్న పాడుకాలం దాపురించిన కాలమది. కారణం, కరెంటు బిల్లుల పేరుతో ...అవమానకరరీతిలో ...కరెంటోళ్లను ఇళ్లపై ఉసిగొలిపిన రోజులవి. ఇక బ్యాంకుల దాడులూ మామూలే. పంటలు లేవు. అయినా అప్పులు కట్టాలి. ప్రైవేటు వాళ్లకన్నా ఎక్కువగా ప్రభుత్వమే పీడిస్తుంటే...ఆనాడు రైతన్నల బాధలు చెప్పడానికి అలవికానివి. హైటెక్కు...అంటూ అటు ఉట్టికీ..ఇటు స్వర్గానికి ఎక్కలేని పాలన కాలమది. కోట్ల బతుకుల్లో నిప్పులు పోసిన కాలమది. సీఎం చంద్రబాబులోని కాఠిన్యం బరితెగించిన కాలమది. 
సరిగ్గా...అలాంటి సమయంలోనే వైయస్సార్‌ ప్రజల మధ్య భరోసాగా నిలిచారు. వారిలో ధైర్యం నింపారు. నేనున్నాను...మీకేం కాదన్నారు. చీకటితో వెలుగే చెప్పినట్టుగా..చీకటి బతుకుల్లో వెలుగులొస్తాయని...వైయస్సార్‌ భగవంతుడి గొంతులా పలికారు. కురవని వర్షాల పాలనా కాలంలో...వైయస్సార్‌ పరామర్శ...భవిష్యత్తుకు సంబంధించిన చల్లని గాలులతో సేదతీర్చింది. తెలంగాణా జిల్లాల నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాను చుట్టేసిన పాదయాత్ర..ప్రజల్ని సేదతీర్చిన ప్రజాప్రస్థానయాత్ర. 
పాదయాత్ర కాలంలోనే వైయస్సార్‌ ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. విద్యుత్‌బకాయిలను మాఫీ చేస్తానన్నారు. అన్నదాతల్ని గుండెల్లో పెట్టుకుని చూస్తానన్నాడు. వ్యవసాయాన్ని కళ్లల్లో పెట్టుకుంటానన్నాడు. పల్లెతల్లి గుండెదిటవును పెంచింది వైయస్‌ ప్రజాప్రస్థానం.

 ప్రజల కష్టం, ప్రజల కన్నీళ్ల శాపం వూరికే పోలేదు. వెన్నుపోటు రాజకీయాలకు, నయవంచన పాలనకు విశాలాంధ్ర ప్రజలు గడ్డిపెట్టారు. గద్దె దింపారు. తొమ్మిదేళ్లకు పైగా సాగిన చంద్రబాబు పాలనలా పడగొట్టేశారు. అప్పుడు విశాలాంధ్రప్రజలు మార్పును మనసారా కోరుకున్నారు. మంచినే ఎంచుకున్నారు. వైఎస్‌ పాదయాత్ర ...జైత్రయాత్రే అయింది. ఆ తర్వాత రెండువేల నాలుగు ఏప్రిల్‌ ఐదవ తేదీ నుంచి, 25వ తేదీవరకు ఐదువేల ఐదువందల కిలోమీటర్లమేర ఎన్నికల ప్రచారం చేశారు. ఆ కష్టం వృధాపోలేదు. వైయస్‌పై ప్రజల నమ్మకం వమ్ముకాలేదు. 
రెండువేల నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక వై.యస్‌.వేగంగా కదిలారు. ప్రమాణం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేసిన రాజశేఖరుడు, ఆ తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. బకాయిల రద్దుతో లక్షలాదిమంది రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు లాగిన డాక్టర్‌ వైయస్సార్, జలయజ్ఞం కార్యక్రమంతో అపరభగీరథుడే అయ్యారు. భారీస్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ధైర్యంగా, ఆయన ప్రారంభించిన వైనం చూసి, దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. 

వైయస్‌ఆర్‌ పట్టుదల, అలుపెరగని పోరాటం, మడమతిప్పిన వైనం, మాట తప్పని నైజం ఆయనను అద్భుతమైన పాలకుడిగా మలిచింది. దార్శనికుడిగా చరిత్రలో నిలిపింది. ఎంత కష్టమొచ్చినా అనుకున్నది సాధించడం, నమ్ముకున్న వారికి న్యాయం చేయడం...వైయస్‌ వ్యక్తిత్వంలోని సహజగుణాలు. అవే ఆయన అడ్మినిస్ట్రేషన్‌లో కనిపించిన సుగుణాలు. 
ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైయస్సార్‌ జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంలో పెట్టింది పేరు. ఒక పథకాన్ని ఎంత వేగంగా రూపొందిస్తారో..అంతే వేగంగా జనంలోకి తీసుకెళ్లగల సామర్ధ్యం వున్న నేత ఆయన. ఒకటి రెండు సమావేశాలతోనే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా నిలిచిన వైయస్సార్‌ పదేపదే సమీక్షలకు దూరంగా వుండేవారు. ఎన్ని విమర్శలు వచ్చినా...ప్రజల కోసం చేపట్టిన పథకాల అమలులో ఏనాడూ వెనుకడుగు వేయలేదు.  మహిళా చైతన్యానికి వైయస్‌ ఓ అన్నలా చేయూత నిచ్చారు. ఇల్లాలంటే బాధ్యతలే కాదు..మొత్తం కుటుంబ శ్రేయస్సు కూడా ఆమెపైనే ఉంటుందని చెప్పే డాక్టర్‌ వైయస్‌ మహిళలకోసం ఎన్నెన్నో పథకాలు తెచ్చారు. పొదుపు అనే నిశ్శబ్ద విప్లవం విస్తరించి కోటిమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. పావలా వడ్డీ పథకం వైయస్‌ అంటే వైయస్సే అనేలా నిరూపించింది. 

తన మాట నమ్మి, తనపై నమ్మకం వుంచిన తెలుగుప్రజలకోసం నిరంతరం రాజన్న శ్రమించారు. మీకు అన్నివిధాలుగా సేవ చేయడానికి నేను సిద్దంగా ఉన్నా..నన్న మాటపై నిలబడ్డారు. ప్రతి పేదవాడినీ, ప్రతి సామాన్యుణ్ణిని, ప్రతి మధ్యతరగతి వారిని ఆదుకుంటానన్న వైయస్‌..ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు చూడాలన్నది జీవితలక్ష్యంగా చేసుకున్నారు. అవును నవ్వు తెలిసిన మనిషి..అందరి మోముల్లోనూ చిరునవ్వులు చూడాలనుకున్న మనిషి. అందుకే, ఆయన పాలనలో మానవీయకోణాన్ని మరవలేదు. ఏమారలేదు. 
రెండవసారి మే ఇరవై, రెండువేల తొమ్మిది సాయంత్రం ఆరున్నరగంటలకు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు డాక్టర్‌ వై.యస్‌.  పదవిని చేపట్టిన వైయస్సార్‌ వున్నది మూడునెలల కాలమే. దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌ను ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. పేదలకిస్తున్న రెండురూపాయల కిలోబియ్యం కోటాను పెంచారు. ప్రసంగం మ«ధ్యలోనే ఈ రెండు వాగ్దానాలకు సంబంధించిన ఫైళ్లపై, ప్రజల సమక్షంలోనే సంతకం చేశారు. వైయస్‌ సంతకాలంటే..పని పూర్తిచేసే అస్త్రాలే. 

దేశం వెలిగిపోవడమంటే ... దేశంలో కొంతమంది ధనికులు వెలగడం కాదు. వ్యాపారవేత్తలో, పారిశ్రామికవేత్తలో వెలగడం కాదు. రాష్ట్రం వెలగడమంటే ప్రతి సామాన్యుడికి ప్రతి మేలూ చేయాల్సిన అవసరం వుంది అని స్పష్టంగా చాటేవారు వైయస్‌. దానికి తగ్గట్టుగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్దిపథకాలు చేపట్టారు. 
సెప్టెంబర్‌ రెండోతేదీ రెండువేల తొమ్మిది నుంచి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆకస్మికంగా గ్రామాల్లో పర్యటిస్తా..ఊరిపేరును మాత్రం ముందే చెప్పను అంటూ వైయస్‌ రచ్చబండ కార్యక్రమానికి బయలు దేరారు. తన పాలనలోని లోపాలేవైనా వుండి, అవి ప్రజలకు కష్టం కలిగిస్తుంటే తొలగించాలన్నది వైయస్‌ ఆశయం. ఆ ఆశయం కోసం ఆయన అలా కదిలిపోయారు...కనిపించకుండా పోయారు.
ఎంతచేసినా..ఏమిచ్చినా మీ రుణం తీరదు అని పదే పదే ప్రజలతో అన్న రాజన్న..ప్రజల గుండెల్ని బద్దలు చేస్తూ వెళ్లిపోయారు...రాజన్నా నీరుణమెలా తీర్చుకోమయ్యా అంటూ జనం హతాశులయ్యేలా చేసిపోయారు వైయస్సార్‌. 
ప్రజలకోసం నడిచిన వైయస్సార్‌...ప్రజాసంక్షేమమే శ్వాసగా...ధ్యాసగా జీవించిపోయారు. జనం గుండెల్లో చెరగని రూపమై నిలిచిపోయారు. 

 

Back to Top