తీరు దివాళాకోరు.. బాబు చౌకబారు

చంద్రబాబు నాయుడి అబద్ధాలు ఒకటొకటిగా బట్టబయలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలకు పాతరేసి బాబు పైశాచిక రాజకీయాలు

గుండెపోటుతో మరణించారని   ముందుగా  ప్రసారం చేసింది ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి..టీవీ 5 లే

జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులోనూ చంద్రబాబు వైఖరి ఇంతే ఘోరం

నోరు తెరిస్తే అబద్ధం.
నలుగురూ నవ్విపోతారేమోనన్న స్పృహ కూడా ఉండదు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచమైన అసత్యాలకైనా సిద్ధం. నలభై ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అంతా విలువలను పాతాళానికి తొక్కేసిన అనుభవం.ఏ అంశమైనా సరే తన హోదాకు తగ్గట్లుగా హుందాగా ఉండకుండా దిగజారుడు రాజకీయం.ఇదీ దేశంలోనే అత్యంత సీనియర్ ని అని తనకి తాను కితాబునిచ్చుకునే చంద్రబాబు నాయుడి నైజం. చంద్రబాబు నాయుడి అబద్ధాలు ఒకటొకటిగా బద్దలవుతోంటే..వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రభుత్వ దుష్ప్రచారం కాస్తా బట్టబయలైపోతోంది. 

నలభై ఏళ్ల  రాజకీయ అనుభవాన్ని నెత్తిన పెట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాజకీయాలు అత్యంత చౌకబారే. ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ...చిన్నాన్న వై.ఎస్.వివేకానంద రెడ్డి దారుణ హత్య రాష్ట్రాన్నే పట్టి కుదిపేసిన సంగతి తెలిసిందే.ఈ హత్యపై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన చంద్రబాబు నాయుడు ఆ క్షణం నుంచే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోతూ..బాధిత కుటుంబంపైనే బురదజల్లుతున్నారు.వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు నిజాలకు పాతరేసి పైశాచిక^రాజకీయాలకు తెరలేపారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత పోలీసులు రాకముందే  సాక్ష్యాలు తారు మారు చేశారని చంద్రబాబు అన్నారు.నిజానికి పోలీసులు వచ్చిన తర్వాతనే..పోలీసుల సమక్షంలోనే  వివేకా నంద మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.వివేకా పార్ధివ దేహాన్ని ఆసుపత్రికి తరలించింది కూడా పోలీసులే. అయితే చంద్రబాబు మాత్రం అబద్ధాలతో ఎంతటి బురద అయినా జల్లేయచ్చని అనుకుంటున్నారు.వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేస్తే కుటుంబ సభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు నిలదీస్తున్నారు.
నిజం ఏంటంటే..వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన  పిఏ నుండి బంధువులకు సమాచారం అందిన వెంటనే అవినాష్ రెడ్డి వివేకానంద ఇంటికి వెళ్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నది చంద్రబాబు మొదటి అబద్ధం.
వివేకానంద రెడ్డి హత్యకు గురయితే కుటుంబ సభ్యులు గుండెపోటు అని అన్నారని చంద్రబాబు కోశారు.నిజానికి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు కానీ..బంధువులు కానీ వివేకా గుండెపోటుతో మరణించారని ఎక్కడా అనలేదు. ఎవరికీ చెప్పలేదు.
సాక్షి మీడియాలో వివేకాది గుండెపోటు అని వచ్చిందని చంద్రబాబు అన్నారు.

నిజం ఏంటంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని మును ముందుగా  ప్రసారం చేసింది మహారాజశ్రీ చంద్రబాబు గారి జేబు మీడియా అయిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి..టీవీ 5 లే. పోలీసులు ప్రాధమికంగా అందించిన సమాచారంతోనే సాక్షి మీడియా అయినా జేబు మీడియా అయినా వివేకాది అసహజ మరణమని ముందుగా చెప్పలేకపోయాయి. అయితే పోలీసులకు  వివేకానంద రెడ్డి పి.ఏ. ఇచ్చిన ఫిర్యాదులో వివేకానందరెడ్డి  బాత్రూమ్ లో చనిపోయి ఉన్నారని ఉంది. తప్ప గుండెపోటుతో మరణించారని ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదు. ఇది చంద్రబాబు నాయుడి మూడో అబద్ధం.
ఇక అన్నింటి కన్నా దారుణం ఏంటంటే..వివేకానంద రెడ్డి హత్య పై కేసు అవసరం లేదని అవినాష్ రెడ్డి అన్నారని టిడిపి నేతలు..బాబు జేబు మీడియా మరో ప్రచారం చేశాయి.నిజం ఏంటంటే..అవినాష్ రెడ్డి తానలా అనలేదని స్పష్టం చేశారు.
వివేకా అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందారని దానిపై దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలని అవినాష్ రెడ్డి మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు.ఇది కరడుగట్టిన అబద్ధాల కోరు చంద్రబాబు ఆడిన నాలుగో అబద్ధం.
ఇక చంద్రబాబు నాయుడి దివాళాకోరు  రాజకీయాలకు  పరాకాష్ట అయిన దుష్ప్రచారం ఏంటంటే..వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే  ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి వివేకా తలకు కుట్లు కుట్టి..కట్లు కట్టారని చంద్రబాబు పదే పదే అంటున్నారు. నిజం ఏంటంటే స్వతహాగా డాక్టర్ అయిన గంగిరెడ్డి కొంతకాలం క్రితం జారి పడిపోతే భుజం ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో ఆయన పులివెందుల నుండి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు వారాలుగా చికిత్స పొందుతున్నారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్ నుండి బయలు దేరి పులివెందుల  వెళ్లారు. అంటే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాతనే ఆయన పులివెందుల వెళ్లారు. మరి పులివెందులలో లేని గంగిరెడ్డి వివేకానంద రెడ్డి తలకు ఎలా కుట్లు  వేయగలరు.? ఇది చంద్రబాబు నాలిక్కి నరం లేకుండా ఆడిన అయిదో అబద్ధం. చంద్రబాబు అయితే ఎన్ని కట్టుకథలైనా అల్లేసి ముఖ్యమంత్రి హోదాను కూడా భ్రష్ఠుపట్టించగలరు.
ఆయన చెప్పిన అబద్ధాలను ఆయన జేబు మీడియా అక్షరం పొల్లుపోకుండా ప్రసారమూ చేయగలదు. ఇలా సాక్ష్యాలు తారు మారు చేయడం చంద్రబాబు నాయుడికి..ఆయన బంధువులకు చాలా బాగా తెలుసునంటున్నారు విపక్ష నేతలు.
ఏడు పదుల వయసున్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి?
నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత ఎంత  బాధ్యతాయుతంగా వ్యవహరించాలి? 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పాలకుడు ఎంత నిజాయితీగా  మాట్లాడాలి? మరి ఈ మూడు లక్షణాలూ ఉన్న చంద్రబాబు నాయుడిలో నిజాయితీ ఎందుకు కొరవడింది? బాధ్యతగా మెలగడం ..హుందాగా ఉండడం చంద్రబాబుకు అలవాటు లేకపోవచ్చు..ఎంత ప్రయత్నించినా నేర్వలేకపోవచ్చు..కానీ...ఇంతగా దిగజారి అబద్ధాలపై  అబద్ధాలాడతారా? అది కూడా లక్షలాది మంది ప్రజలు ఆరాధించే..అజాతశత్రువైన ఓ జననేత మరణంపై ఇంతటి నీచంగా బురదజల్లుతారా?
కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం.. ఇంతటి పాతాళానికి దిగజారిపోతారా?ఆయన దిగజారడమే కాదు...ఆయనతో పాటు ఆయన జేబు మీడియా కూడా అదే బురదజల్లుడు కార్యక్రమాన్ని నిస్సిగ్గుగా తలకెత్తుకోవడం  ఏం సంస్కారం? ఏం జర్నలిజం?
వివేకానంద రెడ్డి హత్య ఘటనలోనే కాదు..గత ఏడాది అక్టోబరు 25న  విశాఖ విమానాశ్రయంలో  ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులోనూ చంద్రబాబు వైఖరి ఇంతే ఘోరం. ఇంతే నీచం. జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన వెంటనే..పోలీసులు రంగప్రవేశం చేయకముందే చంద్రబాబు నాయుడు  కేసును ఎలా నడపాలో దిశానిర్దేశనం^చేసేలా అబద్ధాలాడారు.
జగన్ మోహన్ రెడ్డి అభిమానే దాడి చేశాడన్నారు.
నిజానికి హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ కుటుంబమంతా టిడిపి  కుటుంబమే.టిడిపి నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన క్యాంటీన్ లోనే శ్రీనివాస్ పని చేస్తున్న బండారమూ బయటపడింది.హత్యాయత్నం అనంతరం నెత్తురోడుతోన్న చొక్కాను మార్చుకుని ప్రాధమిక చికిత్స తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి ..మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లారు.వెంటనే చంద్రబాబు నాయుడు..జగన్ మోహన్ రెడ్డికి పెద్ద గాయమే కాలేదు అన్నారు. విశాఖ నుండి హైదరాబాద్ చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఇంటికెళ్లిపోయారని..కొంత సేపు పడుక్కున్నాక.. ఢిల్లీ నుండో మరెక్కడి నుండో వచ్చిన సూచనల మేరకు ఆసుపత్రి వెళ్లారని చంద్రబాబు నాయుడు  వ్యాఖ్యానించారు.
ఇదీ అబద్ధమే.
జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరగానే నేరుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికే వెళ్లారు. ఆ విషయం చంద్రబాబుకు తెలీకుండా ఉండే ప్రసక్తే లేదు.ఎందుకంటే..ప్రధాన ప్రతిపక్ష నేత అయిన జగన్ మోహన్ రెడ్డి ప్రతీ కదలిక పైనా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది.
అది ప్రోటోకాల్ సంప్రదాయం. జగన్ మోహన్ రెడ్డి  ఎక్కడికి వెళ్లినా వెంటనే సంబంధిత జిల్లా ఎస్పీకి సమాచారం వెళ్తుంది.ఆ వెంటనే ఇంటెలిజెన్స్ ఐజీకి సమాచారం వెళ్లిపోతుంది. అక్కడి నుండి డిజిపికి ఆ సమాచారం చేరుతుంది.
ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఉన్న భద్రతా సిబ్బంది కూడా జగన్ మోహన్ రెడ్డి కదలికల గురించి తమ పై బాసులకు సమాచారం అందిస్తారు. ఇది  సాధారణంగా జరిగిపోయే ఓ ప్రక్రియ.
అయితే చంద్రబాబు నాయుడు మాత్రం   దారుణమైన నేరగాళ్ల కన్నా ఘోరంగా అబద్ధం ఆడేశారు. జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఇంటికెళ్లారని   చౌకబారు రాజకీయం చేశారు.
రాజకీయంగా  పిసరంత లాభం ఉంటుందంటే  చాలు చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారు. ఎంతటి నీచమైన అబద్ధాలకైనా తెగబడతారు. ఆ అబద్ధాలను కళ్లకద్దుకుని  ఆయన జేబు మీడియా కథలుగా వండి  ప్రజల్లోకి తోసేస్తుంది.
ఈ అసత్యహరిశ్చంద్రుడి చౌకబారు రాజకీయాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది. 

 

Back to Top