రాజ‌ధాని ప్రాంతంలో కొండకు గుండు కొడుతున్న టీడీపీ భకాసురులు 

అనంతవరం గ్రామంలో  అధికార పార్టీ నేతల అక్రమ మైనింగ్  

చోద్యం చూస్తున్న అధికారులు

గుంటూరు జిల్లా:  తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో టీడీపీ నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) గ్రామమైన అనంతవరం పరిధిలోని కొండ వెనుక భాగాన్ని వందలాది వాహనాలతో తవ్వేస్తూ, విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండ‌పై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉండటం గమనార్హం. పవిత్రమైన ఆలయానికి సమీపంలోనే కొండను నాశనం చేస్తూ అక్రమ మైనింగ్ జరగడం భక్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. దేవాలయ పరిసరాల్లో పేలుళ్లు, భారీ యంత్రాల శబ్దాలతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ గూండాల కాప‌లా
అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన గ్రామస్తులు, రైతులు, యువకులను టీడీపీ గూండాలు బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొండ సమీపానికి ఎవ్వరూ రాకుండా కాపలా ఏర్పాటు చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని సమాచారం. అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినవారికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే
ల్యాండ్ పూలింగ్ పేరుతో త్యాగాలు చేసిన గ్రామాల్లోనే ఈ విధమైన దోపిడీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ నిబంధనలు, దేవాదాయ శాఖ అనుమతులు, గనుల శాఖ క్లియరెన్సులు లేకుండానే ఈ మైనింగ్ సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. 

 ఏంటి ఈ అరాచకం చంద్రబాబు గారు? 
ల్యాండ్ పూలింగ్ పేరుతో త్యాగాలు చేసిన గ్రామాల్లోనే ఈ విధమైన దోపిడీ జరగడం దారుణ‌మ‌ని రాజ‌ధాని ప్రాంత రైతులు మండిప‌డుతున్నారు. ఏంటి ఈ అరాచ‌కం అంటూ ముఖ్య‌మంత్రిని అనంత‌వ‌రం గ్రామ‌స్తులు ప్రశ్నిస్తున్నారు. పవిత్ర ఆలయాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, టీడీపీ నేతల అక్రమ మైనింగ్‌కు అండగా నిలుస్తుందా? కొండను గుండు చేసి పర్యావరణాన్ని నాశనం చేయడమేనా అభివృద్ధి? అంటూ నిల‌దీస్తున్నారు. 
ఈ అక్రమ మైనింగ్‌పై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, కొండను రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

Back to Top