గత ప్రభుత్వ అసమర్థత వల్లే విత్తన లోటు

మాజీ ఐటీశాఖా మంత్రి, ట్విట్టర్ పెట్ట అయిన నారా లోకేష్ వ్యవసాయం మీద అత్యధిక శ్రద్ధ, రైతుల మీద అతి ప్రేమ కురిపించేస్తున్నారు. అది కూడా ట్విట్టర్లోనే. అనంతపురంలో రైతులకు శెనగ విత్తనాలు దొరకడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యం అని ట్వీటుతున్నారు. విత్తనాలకోసం రైతులు రోడ్డెక్కారంటూ రెచ్చిపోతూ టీడీపీ నేతలు కూడా ఆవేశ పూరిత వాఖ్యానాలు చేస్తున్నారు. మాజీ ఆర్థికమంత్రి ఓ అడుగు ముందుకేసి విత్తనాల కోసం 380 కోట్లు ఇవ్వలేని ప్రభుత్వం కూడా ఓ ప్రభుత్వమేనా అంటూ విరుచుకుపడుతున్నారు. వాస్తవాలను దాచిపెట్టి రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటననూ కొత్త ప్రభుత్వానికి ముడిపెట్టి బురద చల్లేందుకు టీడీపీ చేసే వెర్రిమొర్రి వేయి ప్రయత్నాల్లో ఒకటే ఇది కూడా. వ్యవసాయ రంగంపట్ల చిత్తశుద్ధి లేని తెలుగుదేశం నేతలు నేడు వ్యవసాయరంగం గురించి రైతుల కష్టాల గురించి మాట్లాడటం విడ్డూరంగానే ఉంది. 
ఏడాది కిందట ఏపీ సీడ్స్ సంస్థకు చెల్లించాల్సిన 380 కోట్లు ఎగ్గొట్టింది గత టీడీపీ ప్రభుత్వం. ఏపీ సీడ్స్ కు విత్తన సేకరణ కోసం చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించకపోవడం వల్ల ఆ సంస్థ రైతుల నుంచి విత్తనాలు సేకరించలేకపోయింది. అందువల్లే నేడు రైతులకు సకాలంలో శెనక్కాయ విత్తనాలు అందకుండా పోయాయి. విత్తనాలు కావాలంటే ముందు ఏడాదే శెనగలు, ధాన్యం వంటివి కొని నిల్వ చేయాలి. వాటిని మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా రైతులకు చేరవేస్తారు. ఇది వాస్తవంగా జరిగే విత్తన వితరణ పద్ధతి. 
నిరుడు అంటే 2018 అక్టోబర్, డిసెంబర్ లోనే ప్రభుత్వం ఏపీ సీడ్స్ అనే సంస్థకు అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వాలి. అప్పుడే వారు 6 నెలల్లోపు విత్తనాలను ప్రాసెస్ చేసి, రైతులకు సబ్సిడీలో అందించగలుగుతారు. ఎలక్షన్లలో విచ్చలవిడి ఖర్చు కోసం ఖజానాను ఖాళీ చేసిన చంద్రబాబు ఏపీ సీడ్స్ కు విత్తన సేకరణకు డబ్బు ఇవ్వకపోవడే నేడు రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. 2017 కి ఇవ్వాల్సిన విత్తనాల అడ్వాన్స్ డబ్బును కూడా ఇవ్వకుండా చంద్రబాబు ఏపీ సీడ్స్ కు పెండిగ్ పెట్టారు. నిజానికి ప్రతి ఏటా అనంతపురంలో వర్షాభావం కారణంగా వేరుశెనుగ పంట తక్కువగా పండుతోంది. దానివల్ల విత్తన సేకరణ కూడా కష్టం అవుతోందని అధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. విత్తనాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనేయాలనుకుంటే వీలు కాదు. వాటి ప్రాసెసింగ్ కు కనీసం 6 నెలల సమయం కావాలి. లేకుంటే కృత్రిమ కొరత కారణంగా నకిలీ విత్తనాలు రైతులకు చేరే ప్రమాదం ఉంది. కనుకే కాస్త ఆలస్యమైన నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.  ఇప్పటికే ఇతర ప్రాంతాలకు విత్తన సరఫరా జరిగుతూనే ఉంది. పదిరోజుల్లోపే అన్ని ప్రాంతాలకూ విత్తనాలు అందేలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేసారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు ఇవ్వలేదంటూ విష ప్రచారం చేస్తోంది టీడీపీ. రైతులపై కక్ష కడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలు తమ పార్టీ హయాంలో కరెంటు బిల్లుల కోసం రైతులను వేధింపులకు గురి చేసింది, వారిపై కాల్పులు జరిపింది, రుణమాఫీ కోసం అడిగితే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రే బెదిరింపులు చేసింది గుర్తు చేసుకుంటే బావుంటుంది. 
రైతు సంక్షేమం కోసం సున్నావడ్డీ రుణాలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, గిడ్డంగులు, మద్దతుధర అందించే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టీడీపీకి అణువంతైనా అర్హతలేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. 

 

Back to Top