మంచి చేస్తున్నా విమర్శలా?

ప్రజలకు మంచి జరిగితే ఇన్నిన్ని మాటలా?

బొక్కలు వెదికే పని తప్పా...వెలుగును చూసే వ్యక్తిత్వమే లేదా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం...ఒక ఎమ్మెల్యే వున్న పార్టీలు చేస్తున్న ఆగింతం అంతా ఇంతా కాదు. ఆర్నెల్ల కాలంలోనే మనసున్న వారెవరైనా స్పందించాల్సినవి ఎన్నో జరుగుతున్నాయి. కనివినీ ఎరుగని రీతిలో ప్రజాసంక్షేమం కోసం యువముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనితరసాధ్యమైన కృషి చేస్తున్నారు.  ఓవైపు ప్రజల సొమ్ము గతంలోలా దుబారా కాకుండా చూస్తున్నారు. మరోవైపు తన చేతిలో మంత్రదండమేదీ లేకున్నా...దేవున్ని, ప్రజలను గట్టిగా నమ్మి, ప్రజాశ్రేయస్సే దీక్షలా పథకాలు అమలు చేస్తూ పోతున్నారు. ఈరోజు ప్రతి సామాన్యుడికి ఆయనో భరోసా కనిపిస్తున్నారు. ఓ దైర్యమై అండగా కనిపిస్తున్నారు. అడుగడుగునా చేయూతనందిస్తున్నారు. పేదలకు, బడుగు బలహీనవర్గాలకు...సమాజంలోని ఏ ఒక్కవర్గాన్ని మరిచిపోకుండా నవరత్నాల దీపాలు వెలిగిస్తున్నారు.
ఇలాగైతే ఎలా? రాజకీయాలు నడిచేదెలా? తమ ఉనికి నిలిచేలా? ఈ ప్రశ్నలిప్పుడు ప్రతిపక్షానికి, కొమ్ముకాసే మీడియాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. నిద్ర చెడింది. ఆవులించినంత ఈజీగా, నమ్మశక్యంగానీ అబద్దాలతో రోజుకో కట్టుకథ అల్లుతూ... మాటలతో, అక్షరాలతో నానా యాగీ చేస్తున్నారు. కనీస విలువల్ని కూడా విడిచేసి వికృతపోకడలతో వీరంగమేస్తున్నారు. జనం చూస్తున్నారు. జనం వింటున్నారు. జనం ఆలోచిస్తున్నారన్న కనీస ఇంగితజ్ఞానం లేకుండా, ముఖ్యమంత్రిపై కావుకావు మాటలతో పొడవాలని తెగతాపత్రయపడుతున్నారు. అలా కావుకావు అరుపుల్లో ఇప్పుడు మతం మాట తరచూ వినిపిస్తోంది. ఏ ప్రయోజనాలు ఆశించి మతం పేరిట యువనేతను దెబ్బతీయాలని చూస్తున్నారో కానీ, ఆ క్రమంలో అన్ని విలువలకూ పాతరేస్తున్నారు. అపారజనాదరణ పొందిన నేతపై రాళ్లు విసురుతూ ప్రజాస్వామిక స్పూర్తికే తూట్లు పొడుస్తున్నారు. ప్రతిపక్షంగా కనిపించాల్సిన హుందా తనాన్ని మరిచి, ఏవగింపు రాజకీయాలకు తెగబడుతున్నారు.
’ప్రతిరోజూ ప్రతిపక్షం నా మతాన్ని ప్రశ్నిస్తోంది. నేను ఒకటే మాట చెబుతున్నాను. నా మతం...మానవత్వం. నా కులం...మాట నిలబెట్టుకునే కులం’ అని, ఈరోజు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ...ఆరోగ్యశ్రీకి మరింత మానవత్వాన్ని జోడించే ఆరోగ్యఆసరా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ పథకం ద్వారా చికిత్స తరువాత కోలుకునే సమయంలో, ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం అమలు చేస్తారు. ఈరోజు ఒక్కటే కాదు...తన ఆర్నెల్ల పాలనా కాలంలో ఏపీ సీఎం...ప్రతి రోజు ప్రజల సమస్యలపై స్పందిస్తూనే వున్నారు. వాటికి పరిష్కారంగా పథకాలు తెస్తూనే వున్నారు. కలనైనా ప్రజాసంక్షేమాన్ని మరవని సంకల్పాన్ని చూపుతున్నారు. అందరికీ మెరుగైన జీవితాలే లక్ష్యంగా రేపటి సమాజానికి రూపురేఖలు దిద్దుతున్నారు వైయస్‌ జగన్‌.  
చదువుల్లో వెలుగులు... ప్రజారోగ్యం విషయంలో శ్రద్ద, రైతు, చేనేత కుటుంబాలకు భరోసా, మహిళలకు గతంలో కనివినీ ఎరుగని రీతిలో చేయూత పథకాలు, మద్యం మహమ్మారిని తరిమికొట్టే సాహసిక చర్యలు ఇలా...ఒకటా రెండా ...ఎన్నెన్నె పథకాలు తెస్తున్నారు.  కచ్చితంగా అవన్నీ సమాజంలోని సామాన్యజనం కుటుంబాల్లో వెలుగులు నింపే పథకాలే.
కులమతాలకతీతంగా, సమాజంలోని మానవజాతి మొత్తానికి మేలు చేయాలని తపించే మనిషి మతమెప్పుడూ మానవత్వమే అవుతుంది. మానవత్వం ఉన్న మామూలు మనిషైనా తన తోటిమనుషులకు సహాయకారిగానే వుంటాడు. అదేరీతిలో పాలకుడికి మానవత్వం ఉంటే కోట్లమందికి మేలు జరుగుతుంది. ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తోంది. మానవత్వపాలనే.  

Read Also: విశాఖ నగర అభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాజా ఫోటోలు

Back to Top