విజయనగరం: వైయస్ఆర్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని బొద్దాం గ్రామంలో అశేష జనవాహిని విశేష స్వాగతం మధ్య జైత్రయాత్రగా సాగింది. అడుగడుగునా జనం బస్సు యాత్రలో వచ్చిన నేతలకు అపూర్వంగా స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగున్నరేళ్లలో సాగించిన అభివృద్ధి పనులను నేతలు పరిశీలించారు. అనంతరం రాజాం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చినఅప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య,ధర్మాన కృష్ణదాస్, కళావతిలు హాజరయ్యారు. దేశ చరిత్రలో బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత జగన్ తోనే సాధ్యమైంది - డిప్యూటీ సీఎం బూడి ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందని, వెనుకబడిన అనేక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు బాలల చదవుల బాధ్యతను జగన్ తీసుకుని తన భుజస్కందాల మీద వేసుకున్నారని, రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతాలకు పెన్షన్ రూ. 3 వేలు అందనున్నాయని, రెండు వేళ్ళు చూపిస్తున్న టీడీపీ నేతలకు మూడు వేలు అందనున్న నేపథ్యంలో మూడు వేళ్లు చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ కుటుంబంలో అనేక మార్పులుచోటు చేసుకున్నాయని, ఈ సామాజిక సాధికారత ఎవరి వల్ల సాధ్యమైందో, జగన్ ఏ విధంగా సాధికారత సాధించారో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. కులగణన చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు మంరిత మేలు - స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ..వైయస్ఆర్ సీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సు యాత్ర సభకు ప్రజలు తరలిరావడం సీఎం జగన్ పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు నిదర్శనమన్నారు. తాండ్ర పాపా రాయుడు పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైయస్సార్ సీపీని గెలిపించారన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ప్రకటించారు. టీడీపీ హయాంలో విద్య,వైద్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేసారని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారన్నారు. అవినీతి లేకుండా లంచగొండులకు చోటు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలను జగన్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందచేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతుండటం అభివృద్ధి కాదా అని తమ్మినేని ప్రశ్నించారు. పేదలకు ఆర్థిక సాధికారత వైయస్ జగన్ పాలనలో కలగడంతో కొనుగోలు శక్తి పెరిగి దేశంలోని జీడీపీలో గణనీయ వృద్ధి సాదించడమే కాకుండా, అనేక రంగాల కేంద్ర సూచీల్లో కూడా మెరుగైన స్థానాల్లో రాష్ట్రం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాయని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చంద్రబాబును చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసారు. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం - ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ.. పార్టీకతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలకు 1970 కోట్లు రాజాం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కేటాయింపులు చేసారని అన్నారు. చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో పేదలకు అన్యాయం చేయడమే కాకుండా ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. వైయస్ జగన్ పాదయాత్రలో ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ మ్యానిఫెస్టో రూపొందించి దానిని పవిత్ర గ్రంధంగా గుర్తించి అమలు చేస్తున్నారని వివరించారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలకు చోటు లేకుండా జగన్ పాలన చేస్తున్నారని, సామాజిక సాధికారితను ప్రజలు గుర్తించి అన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. ప్రజల కోసం వైయస్ జగన్ ఉన్నారు.. వైయస్ జగన్ కోసం జనం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైయస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి బడుగుల ఆత్మాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ..వైయస్ఆర్ సీపీ బస్సు యాత్ర ను గాలి యాత్ర అని లోకేశ్ అంటున్నారని, ఇది బీసీల ఆత్మగౌరవ యాత్ర, టీడీపీ పై చేసే దండయాత్ర, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చేసే జైత్రయాత్ర అని తెలుసుకోవాలని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక అభివృద్ధి చేస్తున్న జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైందని విమర్శించారు.