గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం

రెండేళ్లు దాటక ముందే 2.22 కోట్ల సేవలందించిన గ్రామ–వార్డు సచివాలయాలు

ప్రజల ముంగిటకే ప్రభుత్వం.. 544 ప్రభుత్వ సేవలు 

సిఫార్సులు, పైసా లంచం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు  

2020 జనవరి 26 నుంచి సచివాలయాల్లో ప్రజా వినతుల పరిష్కారం ప్రారంభం

మే 10వ తేదీ నాటికి 2.22 కోట్ల దరఖాస్తుల పరిష్కారం 

కోటి 29 లక్షలకు పైగా సేవలందించిన రెవెన్యూ శాఖ 

విద్యుత్, మంచి నీటి కనెక్షన్, రైతుల సర్టిఫికెట్ల వరకు ఉన్న ఊళ్లోనే సేవలు

15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాలనలో విప్లవాత్మక సంస్కరణలు

గతంలో మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు

అమరావతి: పాలన వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్న ఊరు దాటకుండానే ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను అందించి రికార్డు సృష్టించారు. రెండేళ్లు దాటక ముందే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 2.22 కోట్ల సేవలను ప్రజలకు అందించారు. ఇది దేశంలోనే రికార్డు. ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇలా గ్రామ, వార్డు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలందిస్తున్న దాఖలాలు లేవు. 2019 అక్టోబర్‌ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కృతం చేశారు.  అంతటితో ఆగకుండా ఈ వ్యవస్థ ద్వారా ఉన్న ఊరు, వార్డు దాట కుండా అక్కడి ప్రజలకు 544 ప్రభుత్వ సేవలను అందించే కార్యక్రమానికి గత ఏడాది జనవరి 26వ తేదీన శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ పథకాలు, సేవల కోసం 2.27 కోట్ల దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటి వరకు 2.22 కోట్ల దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని నిరూపించారు.

అర్హతే ప్రామాణికంగా సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే కాకుండా ఆయా గ్రామ, వార్డుల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. తద్వారా ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఉన్న ఊరు, వార్డుల్లోనే ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువీకరణపత్రం నుంచి బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్‌ కార్డు, ఇంటి స్థలం పట్టా, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రైతులకు అవసరమైన భూ రికార్డులు, విద్యుత్, మంచినీటి కనెక్షన్‌ వంటి మొత్తం 544 సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1.29 కోట్ల వినతులను గ్రామ, వార్డు సచివాలయాలు తీర్చాయి. పౌర సరఫరాల శాఖకు చెందిన 37.02 లక్షల వినతులను, ఇంధన శాఖకు చెందిన 15.62 లక్షల వినతులను, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన 7.61 లక్షల వినతులను, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన 7.48 లక్షల వినతులను ఈ వ్యవస్థ తీర్చింది. గతంలో ప్రభుత్వ సేవలతో పాటు రేషన్‌ కార్డు కావాలన్నా, పెన్షన్‌ కావాలన్నా జన్మభూమి కమిటీలతో పాటు మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేసినా మంజూరు అయ్యేవి కావు. పైగా లంచాలు ఇచ్చిన వారికి, పార్టీకి చెందిన వారికే అరకొర మంజూరు అయ్యేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా సేవలు అందుతున్నాయి.     

బర్త్‌ సర్టిఫికెట్‌ గడువులోగా వచ్చింది
ఇదివరకు ఉద్యోగ విషయమై బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం కళ్యాణదుర్గంలోని తహసీల్దార్‌ కార్యాయానికి వెళ్లాను.  పట్టణ వీఆర్వో, ఆర్‌ఐ, తహశీల్దార్‌ నివేదికలు ఇచ్చాకే సర్టిఫికెట్‌ వస్తుందని, ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమన్నారు. నాకు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం కోసం సర్టిఫికెట్‌ వెంటనే అవసరం అయ్యింది. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. నానా తిప్పలు పడినా సర్టిఫికెట్‌ రాలేదు. చివరికి వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇటీవల పాస్‌పోర్ట్‌ కోసం బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అయ్యింది. 9వ వార్డు సచివాలయానికి వెళ్లి ఆధార్, స్టడీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశాను. 15 రోజుల్లోనే సర్టిఫికెట్‌ వచ్చింది.  
– అరుణ్‌కుమార్, ప్రైవేట్‌ ఉద్యోగి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా

సచివాలయ వ్యవస్థతో ఆధారం
నేను 20 సంవత్సరాల క్రితం ఆర్డీసీ డిపోలో శ్రామిక్‌ (కూలీ)గా పని చేసి, రిటైరయ్యాను. ప్రస్తుతం రూ.1,100 మాత్రమే పింఛన్‌ వస్తోంది. వృద్ధాప్యంలో నేను, నాభార్య జీవనోపాధి లేక ఇబ్బందులు పడేవాళ్లం. ఆధార్‌ కార్డు నమోదు చేసిన కొత్తలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేశారు. దీంతో నాకు వృద్ధాప్య పెన్షన్‌ కూడా రాని పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల పుణ్యమా అని ప్రస్తుతం నా భార్య నాగమణికి ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్‌ మంజూరు అయ్యింది. ముఖ్యమంత్రి జగన్‌ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
– విల్లా కృష్ణ, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా

ఆరేళ్ల ఎదురు చూపు.. సచివాలయంతో నెరవేరింది  
నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాం. ఊరూరా గాజులు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాను. నాకు పెళ్ళై ఆరేళ్లు అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటే నా భార్య పేరు లేకుండా నా ఒక్కడికే వచ్చింది. పేరు చేర్చాలని ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఐదు కిలోల బియ్యంతోనే సరిపెట్టుకున్నాం. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. రేషన్‌ కార్డులో నా భార్య, ఇద్దరు పిల్లల్ని చేర్చాలని రమణయ్యపేట గ్రామ సచివాలయం–1లో దరఖాస్తు చేశాను. రెండు రోజుల్లోనే కార్డు మంజూరు అయ్యిందని వీఆర్వో సత్యనారాయణ ఫోన్‌ చేశారు. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించాం. సచివాలయం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. 
– బత్తుల శ్రీనివాస్, రమణయ్యపేట, తూర్పుగోదావరి జిల్లా

ఉన్న ఊరిలోనే సేవలకు సచివాలయ వ్యవస్థ కేంద్ర బిందువు 
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందుతున్నాయి. ప్రతి సేవకు ముఖ్యమంత్రి నిర్ధిష్ట గడువు విధించారు. ఆ గడువులో 85.36 శాతం ప్రజల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. సచివాలయాల వ్యవస్థతో గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలు, సేవలు అందుతున్నాయి. గతంలో రేషన్‌ కార్డు పొందడానికే సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా నిర్ణీత గడువులోనే గ్రామ సచివాయాల్లో  కార్డు మంజూరు చేస్తున్నారు. ఉన్న కార్డుల్లో సభ్యుల సంఖ్య పెంచడం గతంలో జరిగేది కాదు. ఇప్పుడు అలాంటి 21.70 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం.  
– అజయ్‌ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్‌ 

తిప్పలు తప్పాయి
గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్ల ప్రతి చిన్న పనికి మండల కేంద్రాలకు వెళ్లి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. నాకు 70 ఏళ్ల వయసు ఉండటంతో పింఛన్‌ కోసం గతంలో అనేక సార్లు మా గ్రామానికి 13 కిలో మీటర్ల దూరంలోని పుట్లూరుకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఇప్పుడు మా గ్రామానికి ఆనుకొని ఉన్న తక్కళ్లపల్లిలో ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అక్క డికి వెళ్తే రేషన్‌కార్డుతోపాటు పింఛన్‌ అందే లా వలంటీర్లు, సచివాలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.   
 – ఎస్‌. రామాంజులు, తిమ్మాపురం, అనంతపురం జిల్లా 

తాజా వీడియోలు

Back to Top