కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ

 
ఉత్తమ నిర్వహణతో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ల‌క్ష్యం
 
పాదయాత్రలో గమనించిన అంశాల ఆధారంగా సూక్ష్మ స్థాయిలో సీఎం ఆలోచన

ఎయిమ్స్, అపోలో, ఇతర ఆస్పత్రుల నిర్వహణ విధానాలు అధ్యయనం

బెడ్లు, బాత్‌రూమ్‌లు, ఆహారం, పరికరాల నిర్వహణ ఇక అత్యుత్తమం

టీచింగ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులుగా వర్గీకరణ.. నిర్వహణకు ప్రత్యేకాధికారులు

ఒక్కో టీచింగ్‌ ఆస్పత్రికి ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు.. ఒక్కో జిల్లా, ఏరియా ఆస్పత్రులకు వేర్వేరుగా డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బిల్డింగ్, వైద్య పరికరాలు, సౌకర్యాలు.. బయో మెడికల్‌ నిర్వహణ, క్యాంటిన్, లాండ్రి, సెక్యూరిటీ.. విభాగాల్లో 1,150 మంది నిష్ణాతుల నియామకానికి కసరత్తు ఏటా నిర్వహణకు రూ.41.3 కోట్లు 

రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో వివిధ విభాగాల్లో అపార నైపుణ్యం ఉన్న వైద్యులు.. 24 గంటలూ సేవకు సిద్ధంగా ఉండే నర్సింగ్‌ సిబ్బంది.. అవసరమైన మేరకు వెనువెంటనే అన్ని పరీక్షలు చేసే ల్యాబ్‌ విభాగం.. ఇతరత్రా ఏ అవసరం పడినా అందుబాటులో ఉండే ఇతర విభాగాల సిబ్బంది దాదాపు పూర్తి స్థాయిలో ఉన్నారు. అధునాతన పరికరాలు వచ్చి చేరుతున్నాయి. మందులకూ కొరత లేదు. అయితే వచ్చిన సమస్యల్లా నిర్వహణ లోపం. ప్రస్తుతం ఈ రోగాన్ని కుదిర్చి.. రోగులకు సకల సౌకర్యాల మధ్య అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా విభాగాల నిర్వహణ నిపుణులను నియమించడం ద్వారా అందరూ సమన్వయంతో పనిచేసే చక్కటి వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. 

 రూ.వేల కోట్లు వెచ్చించి ఒక పక్క ‘నాడు–నేడు’తో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్పుచేసి.. నాణ్యమైన వైద్య సేవలందించడంతో పాటు మరోపక్క ఆస్పత్రుల నిర్వహణ అత్యుత్తమంగా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం సీఎం ఆదేశాల మేరకు ఎయిమ్స్, అపోలో తదితర వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ లోపాలను స్వయంగా గమనించిన వైఎస్‌ జగన్‌.. సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి, అత్యుత్తమంగా ఆస్పత్రులను నిర్వహించడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా బెడ్లు, బాత్‌రూమ్‌లు, ఆహారం, వైద్య పరికరాలు, బిల్డింగ్, పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ వంటి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసుల నిర్వహణతో పాటు బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం అధికారుల నియామకానికి అధికారులు కసరత్తు చేశారు. 

వివిధ విభాగాల నిర్వహణకు నిష్ణాతుల నియామకం
అత్యుత్తమ నిర్వహణలో భాగంగా టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు.. అని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏరియా ఆస్పత్రుల నిర్వహణ సిబ్బందే అవసరమైనప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రాలకు వెళ్లి సేవలందించేలా అధికారులు మ్యాపింగ్‌ చేశారు. ఒక్కో టీచింగ్‌ ఆస్పత్రి నిర్వహణ కోసం ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లను, ఒక్కో జిల్లా ఆస్పత్రి నిర్వహణ కోసం డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను, ఒక్కో ఏరియా ఆస్పత్రి నిర్వహణ కోసం డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను నియమించాలని ప్రతిపాదించారు.

వీరి పరిధిలో బిల్డింగ్‌ సర్వీసు, బిల్డింగ్‌ మౌలిక సదుపాయాలు–పరికరాలు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసు, బయో మెడికల్‌ నిర్వహణ, లాండ్రీ, క్యాంటీన్, సెక్యూరిటీ రంగాల వారీగా అర్హతగల నిష్ణాతులను నియమించాలని చెప్పారు. ఆయా రంగాల్లో నియమించిన వారికి అవసరమైన నైపుణ్యం కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను అత్యుత్తమంగా ఎప్పటికీ నాణ్యత, పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు 1,150 మంది అవసరం అవుతారని అధికారులు లెక్క తేల్చారు. ఇందుకోసం ఏడాదికి రూ.41.3 కోట్లు వ్యయం కానుంది. 

టీచింగ్‌ ఆస్పత్రుల నిర్వహణ ఇలా..
డిప్యూటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో బయో మెడికల్‌ ఇంజనీర్, ఇద్దరు టెక్నీషియన్లు, ఒక సివిల్‌ ఇంజనీర్, ఇద్దరు ప్లంబర్లు, ఇద్దరు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు నిర్వహించే వారు, ఒక ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, ముగ్గురు ఎలక్ట్రీషియన్లు, ఒక ఎస్‌టీపీ/ఈటీపీ, ఒక ఫైర్‌ ఫైటింగ్‌ సిబ్బంది, ఇద్దరు జనరల్‌ డ్యూటీ టెక్నీషియన్లు ఉంటారు. మరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో నలుగురు ఫెసిలిటీ మేనేజర్ల పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ ఉంటుంది.

జిల్లా ఆస్పత్రుల నిర్వహణ ఇలా..
డిప్యూటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఒక బయో మెడికల్‌ ఇంజనీర్, ఒక టెక్నీషియన్, ఒక సివిల్‌ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ నిర్వహణ సిబ్బంది ఒకరు, ఒక ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు, ఒక ఎస్‌టీపీ/ఈటీపీ, ఒక ఫైర్‌ ఫైటింగ్‌ సిబ్బంది, ఒక ఐటీ అసిస్టెంట్, ఇద్దరు జనరల్‌ డ్యూటీ టెక్నీషియన్లు, ఇద్దరు ఫెసిలిటీ మేనేజర్ల పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ ఉంటుంది.

ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల నిర్వహణ ఇలా
డిప్యూటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఒక బయో మెడికల్‌ ఇంజనీర్, ఒక టెక్నీషియన్, ఒక సివిల్‌ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ నిర్వహణ సిబ్బంది ఒకరు, ఒక ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఫైర్‌ ఫైటింగ్‌ సిబ్బంది, ఒక ఐటీ అసిస్టెంట్, ఒక జనరల్‌ డ్యూటీ టెక్నీషియన్,  ఒక ఫెసిలిటీ మేనేజర్‌ పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ ఉంటుంది.

నిర్వహణపై పర్యవేక్షణ
సీఎం ఆదేశాల మేరకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధ్యయనం చేశాం. తద్వారా ఇంకా మెరుగ్గా ప్రభుత్వ ఆస్పత్రులను అత్యుత్తమంగా నిర్వహించి, నాణ్యమైన వైద్యం అందించేందుకు విధానాలను రూపొందించాం. బెడ్లు, బాత్రూమ్‌లు, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత.. ఇలా అన్నీ బావుండాలన్నది సీఎం ఉద్దేశం. ఇందుకు మానవ వనరుల్లో నైపుణ్యతను పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత నిర్వహణ పర్యవేక్షణపై కూడా దృష్టి పెడతాం.
– డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top