ఆంధ్రప్రదేశ్‌లో అదొక మారుమూల పట్టణం. పేరు పలాస. ఆ ప్రాంతాన్నే ఉద్దానం అంటారు. అంటే.. ఉద్యానవనాలు ఉండే ఏరియా అని అర్ధం. కొబ్బరి, జీడి తోటలు ఉంటాయి. అయితే కళకళలాడే అదే చోట.. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదకరమైన జబ్బు కూడా ప్రజలను పీడిస్తుంటుంది. అది కిడ్నీ వ్యాధి. దశాబ్దాలుగా ఆ పరిస్థితి అలాగే ఉన్నా.. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి వారిపై శ్రద్ద చూపెట్టారు. ఆయనే వైఎస్ జగన్. కొద్దిరోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లిన సందర్భంలో.. కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలిసిస్ సెంటర్ నిర్మాణం, అక్కడ బాధితులకు జగన్ సర్కార్ నుంచి అందుతున్న సాయం, నీటి సరఫరా ఏర్పాట్ల గురించి నేను తెలుసుకున్నాను. స్వయంగా భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాను. ఒక భారీ భవనం దాదాపు సిద్దం అయింది. కిడ్నీ,యూరాలజీ పరీక్షలకు అవసరమయ్యే పరికరాల అమరిక జరుగుతోంది. వంద పడకలతో ఆస్పత్రిని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా కొద్ది నెలల్లో అది పూర్తి కావచ్చు. ✍️ ఉద్దానంలో ఎక్కడకు వెళ్లినా.. ఎవరితో మాట్లాడినా, జగన్ మానవత్వంతో వ్యవహరించిన తీరును అభినందిస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన డాక్టర్ కూడా. అక్కడ.. కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందన్నది ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారని, తాము వైద్యులుగా మందులు ఇస్తూ చికిత్స చేస్తుంటామని ఆయన చెప్పారు. తమ ప్రాంతంలో ఈ వ్యాధి ఉందని చెప్పడానికి ఈ ప్రాంత ప్రజలు ఇష్టపడరని, దానివల్ల సమాజంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుంటారని ఆయన అన్నారు. అయినా వ్యాధి వయసుతో నిమిత్తం లేకుండా యువతకు కూడా కొంతమేర వస్తున్నందునా.. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని మంత్రి సీదిరి తెలిపారు. ✍️ అంతెందుకు.. అక్కడ భవన నిర్మాణానికి స్థలం విషయంలో కూడా సమస్య కూడా ఎదురైందట. దానిని మండల తహశీల్దార్ తదితర అధికారులు ఎంతో శ్రమించితే కాని అది పరిష్కారం కాలేదట. చకచకా రోడ్డు పనులు కూడా జరగుతున్నాయి. లోపల ఫ్లోరింగ్ దాదాపు అయిపోయింది. అవసరమైన వైద్య పరికరాలు, పరిశోధనకు అవసరమైన యంత్రాలు అమర్చితే పూర్తి అయినట్లే. ఈ భవన నిర్మాణానికి సుమారు వంద కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్దానం ప్రాంతాలు ఉన్న పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలోని గ్రామాలన్నిటికి శుద్ది చేసిన మంచినీరు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వాటర్ స్కీమ్ కు సుమారు రూ. 700 కోట్లు వ్యయం చేస్తున్నారు. వంశధార నది బాక్ వాటర్ను ఇందుకోసం వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సహజ సిద్దరీతిలో నీటిలోని లవణాలు తగ్గించడానికి వీలుగా పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు చెబుతున్నారు. 140 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి సురక్షిత నీటిని ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే మనసున్న ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. ✍️ శ్రీలంక, దక్షిణాఫ్రికా మొదలైన కొన్ని దేశాలలో కూడా ఇలాంటి కిడ్నీ సమస్య ఉందని, కాని అక్కడ ఇలాంటి ప్రయత్నం జరగలేదని స్థానిక జర్నలిస్టులు తెలిపారు. జగన్ అమలు చేస్తున్న ఈ స్కీము ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిడ్నీ బాధితులకు పలాసలోను, మరి కొన్ని గ్రామాలలోను డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద సుమారు డెబ్బై పడకలను ఇందుకోసం వాడుతున్నారు. పలాస కేంద్రంలో డయాలిసిస్ చేయించుకుంటున్నవారిని చూస్తే ‘అయ్యో’ అనిపిస్తుంది. వారిలో ఎక్కువ మంది నలభై ఏళ్లలోపు వారే ఉన్నారు. పలాసలో రెండు షిప్ట్ లలో డయాలిసిస్ చేస్తున్నట్లు అక్కడి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. గత పలు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉన్నప్పటికీ, జగన్ మాదిరి ఎవరూ ఇంత శ్రద్ద చూపలేదని , ఆస్పత్రి ఛైర్మన్ భవాని శంకర్ చెప్పారు. ఆస్పత్రి కూడా నీట్ గానే కనిపించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అక్కడకు వెళ్లి పరిశీలించారు. అయినా పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం కిడ్నీ జబ్జు నివారణ చర్యలు చేపట్టలేకపోయింది. కానీ, జగన్ ఆ ప్రాంతంలో పర్యటించి తాను అధికారంలోకి రాగానే కిడ్నీ వ్యాధి బాధితులకు పెన్షన్ పది వేల రూపాయలు చేస్తామని, ఇక్కడే కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, శుద్ది చేసిన నీరు అందించడానికి స్కీమ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారమే ఆయన ముందుకు వెళ్లారు. ✍️ నీటి సరఫరా కోసం భారీ ఎత్తున పైప్ ల ఏర్పాటు జరిగింది. డిస్ట్రిబ్యూటరీలను సిద్దం చేస్తున్నారు. డయాలిసిస్ కు వచ్చే రోగులకు అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించారు. ఇవన్నీ మానవత్వంతో కూడిన చర్యలుగా కనిపిస్తాయి. కొద్ది నెలల్లో ఈ స్కీమును జగన్ ఆరంభించవచ్చు. రాష్ట్రంలో అభివృద్ది లేదని అబద్దం చెప్పే రాజకీయ నేతలకు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియాలకు.. ఈ పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, తాగు నీటి పధకం పెద్ద జవాబు అని ఎలాంటి సంశయం లేకుండా చెప్పవచ్చు. శహబాష్ జగన్ .. కీప్ ఇట్ అప్.