అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్ధారణ అయింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకపోవడంతో 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రమ్‌వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్‌లో ఐదు చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బ తిందని స్పష్టం చేస్తూ ఈనెల 12న కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందచేసింది. గతేడాది ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ దెబ్బ తిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బ తిన్నట్లు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో(యూఎస్‌ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందచేసింది. పూర్తి నివేదికను ఈనెల 12న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. క్రమబద్ధంగా పనులు » గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. » ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది. » దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ (లీకేజీ) అధికంగా ఉంది. వాస్తవాలకు దర్పణం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌లు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటిరంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రణాళికారాహిత్యం వల్లే.. » పోలవరం జలాశయం పనులను 2016 డిసెంబర్‌లో ప్రారంభించారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమ వైపు నుంచి 1,006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేశారు. 2018లోనూ వరద ప్రవాహం డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికే డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. » 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌లను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్‌లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది. దీనివల్ల వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఆ ప్రభావం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దాంతో 2019లో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కూడా కోతకు గురైంది. జగన్ సర్కారు పనులపై కమిటీ సంతృప్తి » పోలవరం పనులను 2019 నుంచి గాడిలో పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం » వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్ శరవేగంగా పూర్తి » ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లింపు » దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో జియో బ్యాగ్‌లు ఇసుకతో నింపి పూడ్చివేత » 2023 ఫిబ్రవరికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి » స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నట్లు నిపుణుల కమిటీ సంతృప్తి » గతంలో జెట్ గ్రౌటింగ్ గోడలో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీ ఒకే సీజన్‌లో.. కొత్త డయాఫ్రమ్‌వాల్ » 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి » పాత డయాఫ్రమ్‌వాల్‌కి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి » కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌కి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. డయాఫ్రమ్ వాల్ పనులను వరదలు తగ్గాక అంటే 2024 నవంబర్ 1న ప్రారంభించి 2025 జూలై 31లోగా పూర్తి చేసేలా నిరంతరాయంగా చేయాలని స్పష్టం చేసింది. ఒకే సీజన్‌లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులివీ... »గోదావరి వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతింది. మరమ్మతులు చేసినా అది పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందో లేదో చెప్పలేం. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్వాల్ని నిర్మించడమే శ్రేయస్కరం. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌లో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన నది మధ్యలో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీపేజీ నీటి మట్టం సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపే ఉండాలి. ఆ మేరకు దిగువ కాఫర్ డ్యామ్‌లో ఏర్పాటు చేసిన గ్రావిటీ స్లూయిజ్‌ల ద్వారా సీపేజీ నీటిని బయటకు పంపాలి. గ్రావిటీ ద్వారా పంపడానికి సాధ్యం కాని నీటిని ఎత్తిపోయాలి. ఈ పనులను తక్షణమే ప్రారంభించాలి. » నవంబర్ 1 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ఇసుక తిన్నెలను యధాస్థితికి తెచ్చేలా వైబ్రో కాంపాక్షన్ పనులను పూర్తి చేయాలి. సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తు వరకూ ఈ పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలి. » కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, పనులు చేపట్టడంపై వర్క్ షాప్ నిర్వహించాలి. » 2024లో వరదలు తగ్గి పనులు ప్రారంభించడానికి ముందే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వర్క్ షాప్ నిర్వహించాలి. సీడబ్ల్యూïÜ, పీపీఏ, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతిని«దులు పాల్గొనే ఈ వర్క్ షాప్‌నకు అంతర్జాతీయ నిపుణులు కూడా హాజరవుతారు.