ఆర్థిక భరోసా ‘గ్యారెంటీ’

గ్యారెంటీడ్‌ పెన్షన్‌ సిస్టమ్‌పై అసెంబ్లీలో మంత్రి బుగ్గన 

సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ ఎంతో మేలు

రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగులకు పెన్షన్‌ భద్రత.. చివరి బేసిక్‌లో 50% పెన్షన్, ఆ తర్వాత డీఆర్‌లతో భరోసా

ఓపీఎస్‌లో మాదిరిగానే జీవిత భాగస్వామికి పెన్షన్‌ సదుపాయం

ఉన్నత స్థాయి అధ్యయనాల తర్వాతే సీపీఎస్‌ ఉద్యోగులకు మేలు చేస్తూ జీపీఎస్‌కు రూపకల్పన

ఓపీఎస్‌ను అమలు చేస్తే రాష్ట్రం ఆర్థిక మనుగడకే ముప్పు.. ఐదేళ్లకో పదేళ్లకో కుప్పకూలుతుంది

కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు.. 10 వేల మందికి­పైగా రెగ్యులరైజ్‌ చేసేలా చర్యలు

ఇప్పటికే దాదాపు 2 లక్షల రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం

ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53 వేలకుపైగా పోస్టుల భర్తీ

జీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లులకు సభ ఆమోదం

మనుషుల జీవిత కాలం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకుపైగా  జీవించే వారు 2022లో 10 శాతం  ఉండగా 2025 నాటికి 16 శాతానికి పెరుగు­తారు. ఓపీఎస్‌ అనేది ఎన్ని  సంవత్సరాలు జీవిస్తే అన్నేళ్లూ ఇవ్వాలి. అమెరికా లాంటి దేశం కూడా పెన్షన్లపై పరిశోధన చేసి చివరకు సాధ్యం కాక ఓపీఎస్‌ను తగ్గించేసింది. సమయం, వయసు నిబంధనలను సవరించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, సీపీఎస్‌లపై చిత్తశుద్ధితో ఆలో­చించింది.  ఓపీఎస్‌తో సుదీర్ఘ భవి­ష్యత్తులో  జీతాల చెల్లింపులకు సైతం ఇబ్బం­దులొస్తాయి. ఇక సీపీఎస్‌ను అమలు చేస్తే వడ్డీ రేట్లు తగ్గిపోయి షేర్‌ మార్కె ట్‌లో పెట్టుబడులు సరైన రాబడి ఇవ్వ నప్పుడు ఉద్యోగులకు నష్టం వస్తుంది. అందుకే దీనిపై బాగా ఆలోచించి మధ్యేమార్గంగా జీపీఎస్‌ను తెచ్చాం. – అసెంబ్లీలో ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌

 ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్‌ సర్వెంట్స్‌ తమ అభిమతం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యమిస్తారన్నారు. అలాంటి ఉద్యోగుల కష్టా­న్ని గుర్తించిన తమ ప్రభుత్వం వారి ఆకాంక్షల­కనుగుణంగా పనిచేస్తోందన్నారు. ప్రధా­నంగా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. తమ ప్రభుత్వం 11వ పే రివిజన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేసిందని, అంతకంటే ముందు ఉద్యోగులు నష్టపోకుండా మధ్యంతర భృతి(ఐఆర్‌) ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

బుధవారం శానససభలో ఏపీ రెగ్యులరైజేషన్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ కాంట్రాక్టు ఎంప్లాయీ­స్‌ బిల్లు–2023, ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) బిల్లు–2023ని ప్రభుత్వం ప్రవేశ­పెట్టింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌ ద్వారా ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. జీపీఎస్‌ అమలుతో 2040 నాటికి రూ.2,500 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుందని అంచనా. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను (ఓపీఎస్‌) అమలు చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం గ్యారెంటీడ్‌ పెన్షన్‌ సిస్టమ్‌ను(జీపీఎస్‌) తెచ్చిందన్నారు.

ఒక సర్వే ప్రకారం ఓపీఎస్‌ కొనసాగితే రాష్ట్రంలో ఉద్యోగుల పెన్షన్ల ఖర్చు ప్రస్తుతం ఉన్నదాని కంటే నాలుగున్నర రెట్లు పెరుగుతుందన్నారు. ఓపీఎస్‌ ప్రకారం పెన్షన్‌  1991–92లో సున్నా నుంచి ప్రారంభమై 2022–23 నాటికి దేశవ్యాప్తంగా రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగి పెన్షన్లే కాకుండా జీతాలకూ ఇబ్బందులొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న న్యూ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌/సీపీఎస్‌) ప్రకారం దేశవ్యాప్తంగా 2023 నుంచి 2050కి నాటికి పెన్షన్ల చెల్లింపులు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటే అదే ఓపీఎస్‌ ప్రకారం అయితే రూ.18 లక్షల కోట్లవుతుందన్నారు.

 ‘దీనివల్ల అసలు ఓపీఎస్‌ను ఎవరైనా చేయగలరా? తాత్కాలికంగా ఒక వ్యక్తిని తృప్తి పరిచేందుకు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది సాధ్య­మైనా? పాలన చేసేటప్పుడు ఈరోజు పరిస్థితిని, భావి తరాల పరిస్థితిని కూడా చూసుకోవాలి. కొంతమంది మాదిరిగా ఏదో ఒకటి చేసుకోండని చెప్పి అమల్లోకి వెళ్తే ఐదేళ్లకో, పదేళ్లకో కుప్పకూలిపోతుంది. అందుకే మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నాం’ అన్నారు. ఇంకా బుగ్గన ఏమన్నారంటే..

రాబడి కంటే ఎక్కువ
ఏపీ ఓన్‌ రెవెన్యూ 2014–15లో రూ.38,038 కోట్లు­గా ఉంది. ఇది 2015–16 నాటికి రూ.44,842 కో­ట్లు, 2016–17లో రూ.44,374 కోట్లు,  2017–18కి రూ.53 వేల కోట్లు, 2020–21 నాటికి రూ.60,823 కోట్లకు చేరింది. ఇందులో మానవ వనరులపై ఖ­ర్చు 2014–15లో రూ.25,094 కోట్లు కాగా ప్రస్తు­తం రూ.83,604 కోట్లకు పెరిగింది. రాష్ట్రం మొత్తం రాబడిలో హెచ్‌ఆర్‌ ఖర్చులే 66 శాతంగా ఉన్నాయి. జీతాలు, పెన్షన్లకు 2014–15లో 70 శాతం ఉంటే.. 2019–20లో వంద శాతం, 2020–21 నాటికి 110 శాతం అయ్యింది. అంటే 2020–21 నాటికి మన రాష్ట్రానికి వచ్చే రాబడి కంటే ఎక్కువగా పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే  ఏపీలోనే ఎక్కువ
సొంత రాబడిలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2020–21లో ఏపీలోనే పెన్షన్ల ఖర్చు ఎక్కువ. 2015–16లో ఏపీలో 91 శాతం ఖర్చు అవుతుంటే తెలంగాణలో 53 శాతమే ఉంది. 2020–21లో ఏపీ­లో 110 శాతంగా ఉంటే  తెలంగాణ లో 53 శాతమే ఉంది. తెలంగాణ కంటే ఏపీలో రెట్టింపు వ్యయం అవుతోంది. కర్నాటక, తమిళనాడులోనూ మనకంటే తక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓపీఎస్‌ను అమలు చేయడం సాధ్యంకాదు. 2014–­15లో హెచ్‌ఆర్‌ ఖర్చు రూ.25,094 కోట్లు అయితే పెన్షన్లకు రూ.6,147 కోట్లు అయ్యింది. 2022–23­లో హెచ్‌ఆర్‌ వ్యయం రూ.83,406 కోట్లుండగా పెన్షన్లు రూ.22,602 కోట్లకు చేరాయి. ఇది మరింత పెరగడం ఖాయం. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టు­కొని ఓపీఎస్‌లోకి వెళ్లమని కొందరు సలహా ఇస్తు­న్నా­రు. కానీ రాష్ట్ర భవితకోసం ఆలోచిస్తున్నాం.

ఓపీఎస్‌తో ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోతుంది
సీపీఎస్‌లో ప్రస్తుతం ప్రభుత్వం రూ.1,510 కోట్లు ఏటా చెల్లిస్తోంది. అదే ఓపీఎస్‌లోకి వెళ్తే ఇప్పటి­కి­ప్పుడు కట్టాల్సింది రూ.23 కోట్లే. అయినప్పటికీ ఉ­ద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మధ్యేమా­ర్గంగా జీపీఎస్‌పై ఆలోచనలు చేశాం. ఓపీఎస్‌కు వెళ్తే  పెన్షన్లకు 2023లో రూ.20 వేల కోట్లకు పైగా, 2025 వచ్చేసరికి రూ.22,037 కోట్లు, 2030–35 నాటికి రూ.­33,546 కోట్లు, ఆ తరువాత నుంచి ఇక చేయి­దాటి పోతుంది. 2004లో నియమితులైన ఉద్యోగు­లు 2045 నాటికి  రిటైరవుతారు. అప్పుడు ఒకేసారి పెన్షన్ల భారం పెరుగుతుంది. దీన్ని ఆలోచించి జీపీఎస్‌పై కసరత్తు చేశాం. ప్రఖ్యాత కేఏ పండిట్‌ æసంస్థతో సంప్రదించి ఈ విధానాన్ని తెచ్చాం.

పెన్షన్‌కు ప్రభుత్వానిదే బాధ్యత 
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 5.70 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఓపీఎస్‌ ఉద్యోగులు 2.02 లక్షల మంది, సీపీఎస్‌ ఉద్యోగులు 3.04 లక్షలు, పెన్షనర్లు ఓపీఎస్‌లో 3,73,770, రెగ్యులర్‌ పెన్షనర్లు 24,663, ఫ్యామిలీ పెన్షనర్లు 1,69,107 మంది ఉన్నారు. సీపీఎస్‌లో ఉద్యోగులకు 20 శాతం కంటే పెన్షన్‌ రాదు. దానికీ గ్యారెంటీ లేదు. రిటైరయ్యాక  చివరి మూలవేతనంలో సగం మొత్తం పెన్షన్‌గా ఉండేలా జీపీఎస్‌ను రూపొందించాం. సీపీఎస్‌లో వడ్డీ రేట్లు తగ్గినా, షేర్‌మార్కెట్లో రాబడి లేకున్నా వా­రికి పెన్షన్‌ భద్రత ఉండదు. అదే జీపీఎస్‌లో ఉద్యో­గి చివరి నెల మూలవేతనంలో 50% పెన్షన్‌కు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.

జీవిత భాగస్వామి­కి 60 శాతం పెన్షన్‌ ఉంటుంది. దాంతోపాటు డీఆర్, ఈహెచ్‌ఎస్‌ స్కీమ్‌ను అమలు చేస్తాం. ఉదాహరణకు ఆఫీసు సబార్డినేట్‌ చివరి జీతంలో మూల వేత­నం రూ.45,966 అయితే సీపీఎస్‌లో 20 శాతం అంటే రూ.9579 మాత్రమే పెన్షన్‌ వస్తుంది. దానికి గ్యా­రెంటీ లేదు. కానీ జీపీఎస్‌లో 50 శాతం కింద రూ.­23,923 వస్తుంది. పోలీసు కానిస్టేబుల్‌కు రూ.­60,485 చివరి జీతం మూల వేతనం ఉంటే సీపీఎస్‌ లో రూ.12,079 పెన్షన్, జీపీఎస్‌లో రూ.30,243 వస్తుంది.

ఎస్జీటీ టీచర్లు చివరి జీతంలో మూల వేతనం రూ.78,352 అయితే వారికి సీపీఎస్‌లో రూ.15,647 పెన్షన్, అదే జీపీఎస్‌లో రూ.39,175 ఇస్తారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లకు చివరి జీతంలో మూల వేతనం రూ.1,48,597 ఉంటే సీపీఎస్‌ కింద రూ.29,675,  అదే జీపీఎస్‌ కింద రూ.74,299 వస్తుంది. దీనితో పాటు వారి ఫ్యామిలీ పెన్షన్‌ కింద 60 శాతం, హెల్త్‌ స్కీం సైతం వర్తిస్తుంది. ఏ లెక్కన చూసినా జీపీఎస్‌లో ఉద్యోగికి మేలు జరుగుతుంది. ఉద్యోగుల భద్రత కోసం ఆలోచించి భవిష్యత్తులో ఏ ఒక్కరికీ నష్టం రాకూడని తీసుకున్న నిర్ణయమిది. 

భారీగా ఉద్యోగాల భర్తీ
53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా రెగ్యులర్‌ గవర్నమెంట్‌ ఉద్యోగుల మాదిరిగా భద్రత కల్పిస్తున్నాం. వైద్య విధాన పరిషత్‌ను సైతం డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా మార్పు చేసి 15 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాం. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1.35 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాలను తెచ్చి ఉద్యోగాలిచ్చాం.  మరో 2.50 లక్షల మందిపైగా  వలంటీర్లుగా పని చేస్తున్నారు. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 ఉద్యోగాలను భర్తీ చేశాం. రెగ్యులర్‌ క్యాలెండర్‌ ప్రకారం వివిధ శాఖలో మరో 10,143 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాం. గ్రూప్‌1, 2లతో పాటు ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ నియామకాలు, 6,100 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టు­లను భర్తీ చేశాం.   

ఉద్యోగులపై చంద్రబాబు విషం
గతంలోనే ఉద్యోగులపై విషాన్ని తన మనసులో మాట పుస్తకం ద్వారా చంద్రబాబు బయటపెట్టారు.  ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో రాష్ట్రం అప్పుల వలలో చిక్కుకుపోతోందని విద్వేషాలను  ప్రచురించారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో సర్‌ప్లస్‌ రెవెన్యూ ఉన్నప్పుడు రాసిన మాట.  సీఎం జగన్‌ కోవిడ్‌ లాంటి విప­త్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపకుండా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉద్యోగులకు చే­యా­ల్సినంత మేలు చేస్తున్నారు.   ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఆలోచించుకోవాలి.

ఊహించని రీతిలో జీతాల పెంపు
చిన్న స్థాయి ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం. ఆశా వర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచడంతో 43 వేల మందికి లబ్ధి చేకూరింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం రూ.155 కోట్లు నుంచి రూ.517 కోట్లకు చేరుకుంది. గిరిజన, పబ్లిక్‌ హెల్త్, మున్సిపల్‌ వర్కర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచడంతో ప్రభుత్వంపై రూ.415 కోట్ల భారం కాస్తా రూ.622 కోట్లకు వెళ్లింది. మెప్మా రిసోర్స్‌ పర్సన్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, సెర్ప్‌ విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్స్‌కు రూ.2 వేల నుంచి రూ.10 వేలకు పెంచి వారి ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేశాం.

16 వేల మంది హోంగార్డులకు రూ.18 వేల నుంచి రూ.21,300కి జీతం పెంచడం ద్వారా భారం రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెరిగింది. 88 వేల మంది మిడ్‌ డే మీల్స్‌ సహాయకులకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు చేయడంతో రూ.200 కోట్లు అదనపు భారం పడింది. 48,770 మంది అంగన్‌వాడీలకు రూ.7 వేల నుంచి రూ.11,500కి, ఇందులో 55,607 మంది అంగన్‌వాడీ హెల్పర్స్‌కు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెంచాం. సెర్ప్‌లో పని చేసే హెచ్‌ఆర్‌ ఉద్యోగులకు 23 శాతం జీతాల పెంపుతో 4,569 మందికి లబ్ధి చేకూరింది.

సూక్ష్మస్థాయిలో ఆలోచించి 108 డ్రైవర్లకు రూ.13 వేలు ఉండే జీతాన్ని రూ.28 వేలు చేశాం. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌కు రూ.15,500 నుంచి రూ.20 వేలు, 104 డ్రైవర్లుకు రూ.26 వేలకు, ఆస్పత్రుల్లోని శానిటేషన్‌ వర్కర్లకు రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచాం. దాదాపు 3 లక్షల మందికి పైగా ఉద్యోగులకు జీతాల పెంపు ద్వారా ఆర్థిక భారం రూ.2 వేల కోట్లు నుంచి రూ.3500 కోట్లుకు చేరింది. రూ.1,500 కోట్లు అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోంది.

వీటికి తోడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వీక్లీ ఆఫ్‌లు తీసుకొచ్చాం. ఏజెన్సీల చేతుల్లో శ్రమ దోపిడీకి గురైన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఆప్కాస్‌లోకి తీసుకొచ్చి చట్టం చేసి ఒకటో తేదీన జీతంతో పాటు ఈపీఎస్, ఈఎస్‌ఐను కూడా కల్పిస్తున్నాం. ఉద్యోగులకు ప్రత్యేక లీవ్‌ బెనిఫిట్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ తీసుకొచ్చాం.

10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెర­వేరుస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యో­గు­లను క్రమబద్ధీకరిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్‌ సడలించారు. రాష్ట్రం విడిపోయిన నాటికి పర్మినెంట్‌ శాంక్షన్డ్‌ పోస్టులో ఫుల్‌ టైం కాంట్రాక్టు విభాగంలో నియమితులైన వారిని క్రమబద్ధీకరిస్తాం. శాంక్షన్డ్‌ పోస్టుకు ఆర్థిక శాఖ అనుమతి ఉండి నోటిఫై అయిన ఖాళీలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ పారదర్శకంగా భర్తీ చేసి ఉండాలి.

Back to Top