రెండు కాళ్లూ దెబ్బ తిన్నా పింఛన్ ఇవ్వట్లేదు రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బ తిని పనిచేయడం లేదు. రెండు నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి పోతున్నాను. అయినా నాకు పింఛన్ మంజూరు చేయడంలేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తేనే జీవించగలుగుతా. – ప్రభాకర్, కల్యాణపురం ఎస్టీ కాలనీ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే కాకుండా.. వలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని చెప్పి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడిన విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే.. సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పింఛన్ల పంపిణీ, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సవ్యంగా సాగేలా శ్రద్ధ తీసుకునేది. అందుకు అవకాశమే లేకుండా చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా పింఛన్లను తగ్గించాలా అని చూస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వివిధ సాకులు చూపుతూ ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 1.57 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. ఇది చాలదన్నట్లు అనర్హుల ఏరివేత అంటూ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్దిదారులపై వేటు వేసేందుకు వెరిఫికేషన్ కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై ప్రభుత్వం వెరిఫికేషన్‌ను చేపట్టనుంది. సంబంధిత సచివాలయాలనికి గానీ, అసలు మండలానికే సంబంధమే లేని.. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేపడతారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన ఒక్కో బృందం 40 మంది లబ్దిదారుల చొప్పున వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆయా సచివాలయ పరిధిలో ఉండే మొత్తం పింఛను దారుల సంఖ్య ఆధారంగా ఒక్కో సచివాలయ పరిధిలో 7 నుంచి 13 బృందాలను ఇప్పటికే ఆయా జిల్లాల డీఆర్‌డీఏ పీడీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్‌డీఏ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యక్తి పేరు సీపాన ఆనందరావు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామానికి చెందిన ఇతను అంధుడు. 2019 నుంచి పింఛన్ అందుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఆనందరావు దివ్యాంగుడు కాదని తప్పుడు ఫిర్యాదు చేయడంతో అతని పింఛన్ నిలుపుదల చేశారు. రిమ్స్ నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా కనికరించలేదు. ఎంపీడీవోను కలిసినా ఫలితం లేకపోయింది. మూడు నెలలుగా పింఛన్ ఆపేస్తే తన పింఛన్ రద్దయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్టుగానే మూడు నెలలు పూర్తయ్యాయి. పింఛన్ రద్దయింది. ఎంతగా వేడుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదు. ఒక్క టిక్‌తో అంతా తారుమారు వెరిఫికేషన్‌కు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఈ యాప్‌లో అన్ని పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలనే పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు వెరిఫికేషన్ చేసే ఉద్యోగి ‘అవును’/ ‘కాదు..లేదు’ అని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా ‘మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘అవును’/ ‘లేదు’ అని స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క ‘టిక్’తో పేద పింఛన్ లబ్ధిదారుల తలరాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగి అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి. 1. లబ్ధిదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉందా? 2. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా? 3. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా? 4. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? 5. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా? 6. కుటుంబానికి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా? 7. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? 8. కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారా? 9. మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా? రాజకీయ పైరవీలకు చోటు గత ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసే సమయంలో దరఖాస్తుదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది స్థానిక సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్ణయించేవారు. ఆపై ఆన్‌లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్) జరిపేవారు. ఆ తర్వాత పింఛన్ మంజూరు చేసేవారు. అయితే, ఇప్పుడు వెరిఫికేషన్‌లో ఆ లబ్ధిదారుడు పింఛను మంజూరు అర్హత నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది వెరిఫికేషన్ ఉద్యోగి నిర్ణయిస్తారు. ప్రభుత్వం అనర్హుల గుర్తింపు పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడంలోనే ఏదో మతలబు ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ప్రస్తుత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులపై ఆయా ప్రాంతాల్లో అధికార కూటమి పార్టీల నేతల ప్రభావం, ఒత్తిడి ఉంటుందని.. దీంతో అర్హులైన లబ్దిదారులను కూడా అనర్హులుగా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో 1.57 లక్షల పింఛన్లు తగ్గుదల రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య నెల నెలకూ తగ్గిపోతోంది. ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, డిసెంబర్ నెలకు వచ్చే సరికి 63,92,702 మంది లబ్దిదారులకు మాత్రమే పింఛన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 1,57,162 మేర పింఛన్లు తగ్గిపోయాయి. సెపె్టంబర్‌లో 22,601, అక్టోబర్‌లో 24,710, నవంబర్‌లో 21,472.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 88,379 పింఛన్లు తగ్గిపోయాయి. 2 లక్షల మంది వెయిటింగ్.. కొత్తగా దరఖాస్తులకు అవకాశమే లేదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పింఛన్ల మంజూరు కోసం కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ సేవలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో.. అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలు పని చేయడం లేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్త పింఛను మంజూరు చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కొత్త పింఛన్లే మంజూరు కాలేదు. గత ఐదేళ్ల కాలంలో పింఛన్ల పంపిణీ అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అప్పటి దాకా కొత్తగా గుర్తించిన పింఛన్ లబ్దిదారులందరికీ పింఛన్ల డబ్బుల పంపిణీ మొదలు కాగా.. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వరకు ‘ఏపీ సేవ’ అనే ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్ ద్వారా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. ఆ సమయంలో దాదాపు రెండు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దయలేకుండా తొలగించారయ్యా.. దివ్యాంగుడని కూడా చూడకుండా నా పింఛన్ తొలగించారు. నేనేం పాపం చేశానో తెలియడం లేదు. మూడు నెలల క్రితం నా పింఛన్ తొలగించారు. ఈ కుట్ర ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. దివ్యాంగుడైన నాకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. నేను ఎలాంటి పనులు చేయలేను. నాకొచ్చే పింఛన్ సొమ్ముతోనే నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. పింఛన్ ఆపేయడంతో తినడానికి కూడా కష్టంగా ఉంది. నాకు జరిగిన అన్యాయంపై ఇటీవల శ్రీరంగరాజపురం మండల కార్యాలయం వద్ద కుటుంబంతో నిరసన తెలిపాను. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని విన్నవించినా పట్టించుకోలేదు. నాకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – హేమాద్రి, దివ్యాంగుడు, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా పింఛన్ ఇప్పించండి సారూ.. మా బిడ్డ హరీష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన మేము మా బిడ్డ వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.7 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నాం. మా బిడ్డకు పింఛన్ మంజూరు చేయండి. – ఏ.హరీష్ తల్లిదండ్రులు, కల్యాణపురం ఎస్టీకాలనీ, పుత్తూరు మండలం, చిత్తూరు జిల్లా అర్హత ఉన్నా అందని పింఛన్ వైజాగ్ జీవీఎంసీ 47వ వార్డు కంచరపాలెం కొండవాలు ప్రాంతం జయప్రకాష్ నగర్‌లో టి.సునీత అనే మూగ–వినికిడి లోపం గల మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. జీవీఎంసీ జోన్–5 పరిధిలో యూసీడీ అధికారులకు ఎన్నోసార్లు పింఛన్ కోసం విన్నవించగా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో దరఖాస్తు చేసి కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించలేదని సునీత సైగలా ద్వారా వాపోతోంది. ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.